ఆయకట్టు పెంపుతోనే 15 శాతం వృద్ధిరేటు

ABN, Publish Date - Mar 22 , 2025 | 12:35 AM

వ్యవసాయ రంగంలో జిల్లా 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టరు అంబేడ్కర్‌ తెలిపారు.

ఆయకట్టు పెంపుతోనే 15 శాతం వృద్ధిరేటు
కలెక్టరు అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌ మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో జిల్లా 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టరు అంబేడ్కర్‌ తెలిపారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారక తీర్థసాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని త్వరలో జరిగే సదస్సులో ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. కలెక్టర్ల సదస్సు ఈనెల 25, 26 తేదీల్లో అమరావతిలో జరగనున్న నేపథ్యంలో 2025-26 జిల్లా అభివృద్ధి ప్రణాళికపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టరు మాట్లాడుతూ తోటపల్లి కుడి కాలువ, తారకతీర్థరామ సాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా అదనంగా 50 వేల ఎకరాల ఆయకట్టు పెరుగుతుందన్నారు. తద్వారా వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని, ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుంద న్నారు. దీంతోపాటు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని సీఎంకు వివరిస్తామని చెప్పారు. సమావేశంలోని సీపీవో బాలాజీ, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
మానాపురం ఆర్‌వోబీ కాంట్రాక్టర్‌కు నోటీసులు..
మానాపురం ఆర్‌వోబీ నిర్మాణం ఆలస్యం అయినందున కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టరు అంబేడ్కర్‌ ఆదేశించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో ఆర్‌ ఆండ్‌ బీ అధికారులతో సమావేశమై ఆర్‌వోబీ పనులపై సమీక్షించారు ఈ పనులు 2021 జూన్‌లో ప్రారంభం అయ్యాయని, ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జనవరి 23కు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే 780 రోజులు ఆలస్యమైందని, దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యతో పాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ఇప్పటివరకు 83.56 శాతం పనులు పూర్తయ్యాయని, 56.42 శాతం చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఆగ్రిమెంట్‌ విలువ రూ.20.8 కోట్లు కాగా, రూ.17.268 కోట్ల పనులు జరిగాయన్నారు. మిగిలిన పనులు విలువ రూ.3.532 కోట్లు ఉందన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:35 AM