Anemia-Free District రక్తహీనత విముక్త జిల్లాయే లక్ష్యం
ABN, Publish Date - Jan 01 , 2025 | 12:23 AM
Anemia-Free District is the Goal నూతన సంవత్సరంలో జిల్లాను రక్తహీనత నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.
పార్వతీపురం, డిసెంబరు 31 (ఆంరఽధజ్యోతి): నూతన సంవత్సరంలో జిల్లాను రక్తహీనత నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ‘రక్తహీనత, మాతాశిశు మరణాల నియంత్రణ, విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ప్రధానంగా రక్తహీనత నివారణకు గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గుమ్మలక్ష్మీపురం, సాలూరుతో పాటు సీతంపేటలో కూడా గిరిజన గర్భిణుల వసతిగృహం కొనసాగుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా సాలూరు మండలం కరడవలసలో కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. త్వరలో కురుపాం, పాలకొండ నియోజక వర్గాల్లో వాటిని ప్రారంభిస్తాం. హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మరమ్మతుల కోసం సుమారు రూ.189 లక్షలు మంజూరయ్యాయి. రూ.29.61 కోట్లతో 31.72 కిలోమీటర్ల మేర 19 రోడ్లు నిర్మిస్తున్నాం. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.2.11 కోట్లతో దాదాపు 472 అభివృద్ధి పనులు మంజూరయి. ఇప్పటికే రూ.102 కోట్లు వెచ్చిచ్చాం. 190 బీటీ రోడ్లు, రక్షణగోడల కోసం రూ.570 కోట్లు అవసరమని అంచనా వేశాం. దాదాపు 713 రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయి. 4,660 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తాం. బహిరంగ మలవిసర్జన రహిత సమాజం, స్వచ్ఛ జిల్లాయే ధ్యేయంగా పనిచేస్తున్నాం.’ అని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) రిసెప్షన్ సెటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ప్రజలు రోజూ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఇక్కడ అర్జీలు ఇవ్వొచ్చని తెలిపారు. పీజీఆర్‌ఎస్ సెంటర్‌కు వచ్చే వారికి తాగునీరు, టీ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడుల కేసుల్లో బాధితులకు త్వరగా నష్టరిహారం చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజనల్ స్థాయిలో త్రైమాసిక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ మాధవరెడ్డి , ఏఎస్పీలు దిలీప్‌కిరణ్, అంకిత సురానా , డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.
వాటర్ గ్రిడ్‌కు ప్రతిపాదనలు
‘జిల్లాలోని 1,987 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు రూ.1452 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం. రూ.30 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ కింద 95 పనులు చేపట్టాం. 2025 ఫిబ్రవరి నాటికి అవి పూర్తికానున్నాయి. నీతి అయోగ్ ఆశావహ బ్లాక్ కింద భామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలో ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.1.50 కోట్లు ప్రోత్సాహకంగా లభించింది.’ అని కలెక్టర్ వెల్లడించారు.
మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు
మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసేవారికి శిక్షలు పడేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతం గుండా జరిగే రవాణాకు ఆశాఖాధికారులు అడ్డుకట్ట వేయాలన్నారు. విద్యా సంస్థలపై ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా చూడాలన్నారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వపథకాలను నిలుపుదల చేస్తామని తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 49 మందిని అదుపులోకి తీసుకున్నామని, తొమ్మిది వాహనాలను సీజ్ చేసినట్టు చెప్పారు.
జిల్లాలో ద్విచక్ర వాహనాలకు హెల్మెట్‌ధారణ తప్పనిసరి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధరించని వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు గురించి అందరికీ తెలిసేలా పోస్టర్లను అతికించాలని సూచించారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుప త్రిలో చేర్పించే వారికి అవార్డులు ప్రకటించాలన్నారు. జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పక్కాగా అమలు చేయాలని తెలిపారు. సమాజంలో మగ, ఆడ శిశు నిష్పత్తి సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు ఎవరూ వెళ్లరాదని తెలిపారు.
Updated Date - Jan 01 , 2025 | 12:23 AM