తోటపల్లి పనులకు మళ్లీ బ్రేక్
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:20 PM
తోటపల్లి పూర్వపు ఎడమ, కుడి కాలువల ఆధునికీకరణ పనులు మళ్లీ ఆగిపోయాయి. రాష్ట్రంలో 25 శాతం లోపు పనులు జరిగిన ప్రాజెక్టులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తోటపల్లి కూడా ఉంది. ఇప్పటి వరకు 23 శాతం మేరకే పనులు జరిగాయి.

- నిలిచిన కాలువల ఆధునికీకరణ
- ఆపేయాలని ప్రభుత్వం ఆదేశం
- 25శాతం లోపు పనులు జరగడమే కారణం
- రైతుల్లో ఆందోళన
- ఎన్నో ఏళ్లుగా సాగునీటి కష్టాలు
తోటపల్లి పూర్వపు ఎడమ, కుడి కాలువల ఆధునికీకరణ పనులు మళ్లీ ఆగిపోయాయి. రాష్ట్రంలో 25 శాతం లోపు పనులు జరిగిన ప్రాజెక్టులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తోటపల్లి కూడా ఉంది. ఇప్పటి వరకు 23 శాతం మేరకే పనులు జరిగాయి. దీంతో కాలువల ఆధునికీకరణకు బ్రేక్‌లు పడ్డాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా తోటపల్లి పనులు మాత్రం పూర్తికావడం లేదని వాపోతున్నారు. ఫలితంగా శివారు భూములకు సాగునీరు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. పనుల పూర్తికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పాలకొండ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ఎడమ పూర్వపు ప్రధాన కాలువ పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో 37.53 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ కాలువ ద్వారా మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలంలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అలాగే కుడి ప్రధాన కాలువ పార్వతీపురం, విజయనగరం జిల్లాల పరిధిలో 17.616 కిలోమీటర్లు విస్తరించి ఉంది. మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, బలిజిపేట మండలాలతో పాటు విజయనగరం జిల్లాలోని వంగర మండలంలోని సుమారు 18 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే, గతంలో ఈ కాలువల ద్వారా పుష్కలంగా సాగునీరు అందేది. అయితే, కాలువలు నిర్మించి 120 ఏళ్లు కావడంతో ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోటపల్లి ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. అయితే, 20 ఏళ్లు అవుతున్నా ఇంకా పనులు 23 శాతానికే పరిమితమయ్యాయి. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఈ పనులు మాత్రం పూర్తికావడం లేదు. ఫలితంగా 7, 8 బ్రాంచిల్లోని శివారు మండలాలైన పాలకొండ, బూర్జ మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తీవ్రతరమయ్యాయి. పూర్తిగా ధ్వంసమైన సైఫాన్లు, ఆక్విడెక్ట్‌లు, అండర్ టర్నల్స్, స్లూయిజ్‌లతో సాగునీరు అందడం లేదు. ప్రధాన కాలువ పరిధిలోని బ్రాంచి కాలువల ద్వారా రెగ్యులేటర్లకు సాగునీరు అందించే స్లూయిజ్‌లకు షట్టర్లు లేవు.
ఎప్పటికి పూర్తవుతాయో?
35.36 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తోటపల్లి ఎడమ పూర్వపు కాలువకు సంబంధించి ఇప్పటివరకు 17.532 కిలోమీటర్లు మా త్రమే లైనింగ్ పనులు పూర్తయ్యాయి. నర్సిపురం-మహదేవివలస మధ్య పెద్దురి గెడ్డపై ఆక్విడక్ట్, జె.గోపాలపురం గ్రామంలో ఎస్‌ఎల్‌ఆర్‌బీ, వీరఘట్టం, రాజపురం మధ్య బ్రిడ్జి, రాజపురం వద్ద బ్రిడ్జి (డీఎల్‌ఆర్‌బీ), కత్తులకవిటిలో వంతెన (ఎస్‌ఎల్‌ఆర్‌బీ) నిర్మించారు. అలాగే 17.616 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కుడి ప్రధాన కాలువకు సంబంధించి ఇప్పటివరకు 9.372 కిలోమీటర్ల మేర మాత్రమే లైనింగ్ పనులు పూర్తి చేశారు. ఇంకా కుడి, ఎడమ కాలువల పరిధిలో 420 పనులు చేపట్టాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా సైఫాన్స్, ఆక్విడెక్ట్‌లు, బ్రిడ్జిలు, అండర్‌టర్నల్స్, స్లూయిజలు నిర్మించడంతో పాటు షట్టర్లు బిగించాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తోటపల్లి పూర్వపు కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు రూ.135 కోట్లు మంజూరయ్యాయి. పాలకొండ మండలం నవగాం వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో ఆ నిధులు వెనక్కి మళ్లాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ.195.34 కోట్లతో పనులు ప్రారంభించి 9 శాతం పూర్తి చేసింది. రూ.17 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 25 శాతం లోపు జరిగిన పనులను రివర్స్ టెండర్ పేరుతో నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తోటపల్లి పనులు నిలిచిపోయాయి. ఈ పనులను కేటగిరి-డిలో పెట్టింది. రెండేళ్ల తర్వాత మళ్లీ పనులు చేపట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు 23 శాతం మేర పనులు జరగ్గా కాంట్రాక్టర్‌కు రూ.34 కోట్ల బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా 25 శాతం లోపు పనులు జరిగిన ప్రాజెక్టులను నిలిపివేయాలని నీటిపారుదలశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి తోటపల్లి పనులకు బ్రేక్‌లు పడ్డాయి. ఇలా పాలకులు మారిన ప్రతిసారి వర్క్‌లు ఆగిపోతున్నాయి. కాగా, 2018లో టెండర్ ఖరారైన నాటికి ప్రస్తుత ధరలకు వ్యత్యాసం ఉండడంతో కాంట్రాక్టర్ కూడా పనులు చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఆధునికీకరణ పనుల కథ మళ్లీ మొదట కొచ్చింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తోటపల్లి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతుంది.
పనులు పూర్తి చేయాలి
తోటపల్లి ఎడమ, కుడి పూర్వపు కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి. అప్పుడే శివారు రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరుతాయి. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా పనులు మాత్రం పూర్తి చేయడం లేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలి.
-ఖండాపు ప్రసాదరావు, అభ్యుదయ రైతు, పీఆర్‌రాజుపేట
నిలుపుదల చేశాం
తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు 23శాతం మాత్రమే జరిగాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను నిలుపుదల చేశాం. దీనిపై కాంట్రాక్టర్‌కు సమాచారం అందించాం. ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
-శంకరరావు, జేఈఈ, నీటిపారుదలశాఖ, పాలకొండ
Updated Date - Feb 09 , 2025 | 11:20 PM