ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

joint LPM problem: జాయింట్‌ ఎల్‌పీఎం సమస్యకు చెక్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:24 PM

joint LPM problem: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న శాశ్వత భూ హక్కు.. భూరక్ష పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన భూ సర్వే తప్పుల తడకగా ఉన్న విషయం తెలిసిందే.

- ఉచితంగా చేయాలని ఆదేశం

- జీవో జారీ చేసిన ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

- రైతుల్లో హర్షాతిరేకాలు

జియ్యమ్మవలస, జనవరి 2(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న శాశ్వత భూ హక్కు.. భూరక్ష పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన భూ సర్వే తప్పుల తడకగా ఉన్న విషయం తెలిసిందే. అస్తవ్యస్తంగా జరిగిన ఈ సర్వేతో రైతుల సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా జాయింట్‌ ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)తో రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు.


ఉచితంగా సింగిల్‌ ఎల్‌పీఎం ఇవ్వాలని రెవెన్యూ సదస్సుల్లో వేడుకుంటున్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్‌ ఎల్‌పీఎంలను సింగిల్‌ ఎల్‌పీఎంలుగా మార్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అదికూడా ఎటువంటి ఫీజు లేకుండా, ఉచితంగా ఈ సేవలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబరు 1ను విడుదల చేసింది.


జిల్లాలో 15 మండలాల పరిధిలో 965 గ్రామాలు ఉన్నాయి. 2020 డిసెంబరు 21న రీసర్వే ప్రారంభమైంది. 304 గ్రామాల్లో 1.70 లక్షల ఎకరాలను మూడు విడతలుగా సర్వే చేశారు. దీనికిగాను 240 గ్రామ సర్వేయర్లను అప్పటి ప్రభుత్వం వినియోగించింది. ఇందులో 18,746 జాయింట్‌ ఎల్‌పీఎంలు నమోదు చేసింది. దీనివల్ల దాదాపు 50 వేల మందికి పైగా రైతులు బాధితులుగా మారారు. కొందరు రైతులు రూ.550 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే ఆ రైతు ప్రాప్తికే ఒక మ్యాప్‌ వరకు సరిచేసేవారు.


కొందరు వీఆర్వోలు, సర్వేయర్లు ఆమ్యామ్యాలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో రైతులు తీవ్ర అవస్థలు పడేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రీసర్వే తప్పులను సరి చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం రెవెన్యూ సదస్సును నిర్వహిస్తోంది. కొందరు రైతుల రూ.500 చెల్లించి భూములను రీసర్వే చేయించుకుంటున్నారు. వారి పరిస్థితిని గమనించిన ప్రభుత్వం జాయింట్‌ ఎల్‌పీఎంలపై దృష్టి సారించి రైతులకు ఉచితంగా న్యాయం చేయాలని నిర్ణయించింది.


ప్రభుత్వ ఆదేశాలతో ఆ శాఖ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా నూతన సంవత్సరం రోజే జీవో ఆర్టీ నెంబరు 1ను విడుదల చేశారు. దీని ప్రకారం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పీఎంలపై స్వీకరించిన దరఖాస్తులను పూర్తి పరిశీలన చేసి, ఆన్‌లైన్‌ సబ్‌ డివిజన్‌ ఉచితంగా చేయాలని ఆదేశించారు. దీనికి ఆరు నెలలు గడువు కూడా ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


చాలా సంతోషం

గత ప్రభుత్వం జాయింట్‌ ఎల్‌పీఎంలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఆన్‌లైన్‌ సబ్‌ డివిజన్‌ చేయడానికి జీవో జారీ చేయడం సంతోషంగా ఉంది.

-మరడ సత్యనారాయణ, రైతు, తురకనాయుడువలస, జియ్యమ్మవలస మండలం


అధికారులు పకడ్బందీగా చేయాలి

రైతులకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాయింట్‌ ఎల్‌పీఎంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా అధికారులు పకడ్బందీగా ఆన్‌లైన్‌ సబ్‌ డివిజన్‌ చేయాలి.

-సింగిరెడ్డి శివున్నాయుడు, రైతు, తురకనాయుడువలస, జియ్యమ్మవలస మండలం


వారం రోజుల్లో అమలవుతుంది

జాయింట్‌ ఎల్‌పీఎంలు ఉచితంగా ఆన్‌లైన్‌ సబ్‌ డివిజన్‌ చేయమని ప్రభుత్వం జీవో ఇవ్వడం వాస్తవమే. వారం రోజుల్లో విధి విధానాలు రానున్నాయి. కచ్చితంగా చేస్తాం.

-పి.లక్ష్మణరావు, జిల్లా సర్వేయింగ్‌ ఏడీ, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Jan 02 , 2025 | 11:24 PM