వేసవిలో తాగునీటి సమస్య తలెత్తరాదు

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:18 PM

వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

   వేసవిలో తాగునీటి సమస్య తలెత్తరాదు
మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా గిరి శిఖరం ప్రాంతాల్లో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. బోరు బావుల ప్లషింగ్‌, ఇతర నిర్వహణ పనులను ముందుగానే చేపట్టాలన్నారు. జలజీవన్‌మిషన్‌ కింద అనేక ఆవాసాలకు తాగునీరు అందించామన్నారు. మిగిలిన వాటిపై దృష్టిపెట్టాలన్నారు. సమస్యను పరిష్కరించడానికి ఐటీడీఏలు కోటి రూపాయల వరకు నిధులు అందించాలన్నారు. వేసవి కాలం ప్రారంభమైందని, మే, జూన్‌ నెలల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడం వంటి అంశాల కారణంగా నీటి ఎద్డడి ఎక్కువ ఉండే అవకాశముందన్నారు. సమ్మర్‌ క్రాష్‌ కార్య క్రమాన్ని మార్చి 15 వరకు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు ఎంపీపీ నిధుల నుంచి రూ.75 లక్షలతో 15 మండలాల్లో మొత్తం 7,217 చేతిపంపుల మరమ్మతులు చేపట్టాలని అన్నారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకరరావు మాట్లాడుతూ.. మొత్తం 187 ఆవాసాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించామని, ఇక్కడ సమస్య పరిష్కారానికి గాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ నిధుల నుంచి రూ.5.16 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామన్నారు. జడ్పీ నిధులతో రూ.2.20 కోట్లతో 73 పనులు చేపట్టనున్నట్టు వివరించారు.

Updated Date - Feb 09 , 2025 | 11:18 PM