ముగ్గుల పండగ
ABN, Publish Date - Jan 05 , 2025 | 12:41 AM
Festival of Rangoli ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రం పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముత్యాల ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.
పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయచంద్ర
విజేతలకు బహుమతుల అందించిన ఎస్పీ మాధవరెడ్డి
పార్వతీపురం/టౌన్/ బెలగాం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రం పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముత్యాల ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి ఫర్‌ఫెక్ట్ ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సీయా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో ఈ పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర జ్యూయల్ ప్యాలెస్ యజమాని ఇండుపూరు గోపాలరావు స్థానిక స్పాన్సర్‌గా వ్యవహరించారు. ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రిబ్బన్ కత్తిరించి.. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించడం వల్ల ముందుగానే సంక్రాంతి పండగ వచ్చిన వాతావరణం కనిపి స్తోందని అన్నారు. కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి.సీతారాం, జి.వి.నాయుడు, బి.చంద్రమౌళి, కె.నారాయణరావు. బి.గౌరునాయుడు, జి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతిని కాపాడడం అభినందనీయం: ఎస్పీ
‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆ దిశగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ముత్యాల ముగ్గుల పోటీల్లో యువతులు ఎక్కువగా పాల్గొనడం హర్షణీయమని అన్నారు. నేటి యువతకు మన సంస్కృతిని తెలియజేయడం శుభపరిణామమని ఆయన కొనియడారు. ఈ పోటీలు నిర్వహించడంతో జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి ముందుగానే వచ్చిందని అన్నారు. కలెక్టర్ సతీమణి భాగ్యమహాలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సంక్రాంతి పండగ రంగవల్లికలకు ప్రతీక అని... అటువంటి రంగవల్లుల పోటీలను ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షణీయమన్నారు. స్థానిక స్పాన్సర్, శ్రీ వెంకటేశ్వర జ్యూయల్ ప్యాలెస్ యజమాని ఇండుపూరు గోపాలరావు మాట్లాడుతూ ఏటా ముగ్గుల పోటీల తనను భాగస్వామిగా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని చెప్పారు. డీపీఆర్వో రమేష్ మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముగ్గుల పోటీల వల్ల భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తాయని చెప్పారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఎంఈవో విమల కుమారి, మహిళా ఉపాధ్యాయులు రోజారాణి, ప్రమీల మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో యువతులు ఎక్కువ మంది పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ యాజమాన్యాన్ని న్యాయ నిర్ణేతలు అభినందించారు.
విజేతలు వీరే
జిల్లా కేంద్రం పార్వతీపురంలో జరిగిన ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముగ్గుల పోటీల్లో 92 మంది పాల్గొన్నారు. ఇందులో పార్వతీపురం మండలం సూడిగాం గ్రామానికి చెందిన జి.కృష్ణవేణి ప్రథమ స్థానం సాధించారు. ఆమెకు రూ.6 వేల నగదు బహుమతిని ఎస్పీ మాధవరెడ్డి అందించారు. పార్వతీపురం పట్టణానికి చెందిన కె.పవిత్ర ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఆమెకు రూ.4 వేల నగదు బహుమతిని కలెక్టర్ సతీమణి భాగ్యమహాలక్ష్మి అందించారు. పార్వతీపురం పట్టణానికి చెందిన వి.అరుణ తృతీయ స్థానం సాధించారు. ఆమెకు రూ.3 వేల నగదు బహుమతిని స్థానిక స్పాన్సర్ ఇండుపూరు గోపాలరావు అందించారు. ఈ కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫర్ డీఎస్‌ఆర్ పట్నాయక్, విలేకరులు ఎస్.గౌరీశంకర్, గుంట్రెడ్డి పోలినాయుడు, ఒ.సత్యన్నారాయణ, రాఘవేంద్రరావు, డి.తిరుపతిరావు, మురళి, కోట శివ, చప్ప వెంకటరమణ, సింహాచలం, గంట గోపాలరావు, ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 12:41 AM