గోదారోళ్లే.. మరి!
ABN, Publish Date - Jan 16 , 2025 | 12:36 AM
విజయనగరంలో ఉంటున్న గోదావరి జిల్లా వాసులు సాంప్రదాయాన్ని కొనసాగించారు.
విజయనగరం రింగురోడ్డు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో ఉంటున్న గోదావరి జిల్లా వాసులు సాంప్రదాయాన్ని కొనసాగించారు. తన ఇంటి అల్లుడికి సంక్రాంతి పండుగ సందర్భంగా 200 వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. విజయనగరం శివారులోని చినతాడివాడలో నివాసం ఉంటున్న తోట వెంకటేశ్వరరావు, ఉమా దంపతులది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సొంతూరు. ఉద్యోగరీత్యా ప్రస్తుతం ఈ దంపతులు విజయనగరంలో ఉంటున్నారు. పండుగ సందర్భంగా గోదారోళ్ల సాంప్రదాయాన్ని కొనసాగించారు. మంగళవారం తన అల్లుడు ఏలూరు జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన చిలకలపూడి సంతోష్ పృథ్వీ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. కుమార్తె ధరణి గృహిణి. వీరివురిని సంక్రాంతికి విజయనగరం లోని చినతాడివాడకు అహ్వానించారు. వారి సాంప్రదాయం ప్రకారం కొత్త అల్లుడికి స్వాగతం చెబుతూ 200 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. కుమార్తె, అల్లుడు వంటలను ఒకరికొకరు తినిపించుకుంటూ వెంకటేశ్వరరావు దంపతులు మురిసిపోయారు. చినతాడివాడలో ప్రజలు దీనిపై ఆసక్తిగా చర్చించుకోవడంతో పాటు, ఆయా వంటకాలను వారి ఇంటికి వెళ్లి తిలకించారు.
Updated Date - Jan 16 , 2025 | 12:36 AM