ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Conserve Forests అటవీ సంరక్షణ ఎలా?

ABN, Publish Date - Jan 10 , 2025 | 12:05 AM

How to Conserve Forests? జిల్లాలో అటవీ శాఖకు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. భారీగా పోస్టులు ఖాళీ ఉన్నా కొన్నాళ్లుగా నియామకాలు చేపట్టడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. మరోవైపు అడవులపై పర్యవేక్షణ కొరవడుతోంది.

కురుపాం అటవీశాఖ రేంజ్‌ కార్యాలయం

  • ఉన్న ఉద్యోగులపై అదనపు భారం

  • కొరవడుతున్న పర్యవేక్షణ

  • రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఆక్రణమలు

  • స్పందించేవారే కరువు

జియ్యమ్మవలస, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ శాఖకు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. భారీగా పోస్టులు ఖాళీ ఉన్నా కొన్నాళ్లుగా నియామకాలు చేపట్టడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. మరోవైపు అడవులపై పర్యవేక్షణ కొరవడుతోంది. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమవుతున్నా.. విలువైన అటవీ సంపద తరలిపోతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా జిల్లాలో అడవుల విస్తీర్ణం 3,659 చదరపు కిలో మీటర్లు. 1,02,784 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మొత్తంగా 30 శాతం అడవులు ఉన్నాయి. వాటి పరిరక్షణకు సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం అటవీశాఖ రేంజ్‌ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, మొండెంఖల్‌, కొమరాడ, పార్వతీపురం, వీరఘట్టాం, పాలకొండ, కొత్తూరు, సరుబుజ్జిలి, సాలూరు, మక్కువ, మామిడిపల్లి, పాచిపెంట సెక్షన్లు ఉన్నాయి. మొత్తంగా 53 బీట్లు కూడా ఉన్నాయి. అయితే పూర్తిస్థాయిలో సిబ్బంది మాత్రం లేరు.

సిబ్బంది ఇలా..

అడవులపై పర్యవేక్షణ చాలా అవసరం. దీనికోసం ప్రతి రేంజ్‌కు ఒక అధికారి, సెక్షన్‌ ఆఫీసర్‌, ప్రతి సెక్షన్‌ పరిధిలో ఒక్కో బీటుకు ఫారెస్టు ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీటు ఆఫీసర్‌ కచ్చితంగా ఉండాలి. జిల్లాలో నాలుగు రేంజ్‌లు, 13 సెక్షన్లు, 54 బీట్లు, రెండు తానాదార్‌లు ఉండాలి. నిబంధనల ప్రకారం నలుగురు రేంజ్‌లు, 13 మంది సెక్షన్‌ ఆఫీసర్లు, 54 మంది బీటు ఆఫీసర్లు, 53 మంది అసిస్టెంట్‌ బీటు ఆఫీసర్లు ఉండాలి. జిల్లాలో చూసుకుంటే నలుగురు రేంజర్లు ఉన్నారు. పాలకొండ, పార్వతీపురం, సాలూరు రేంజ్‌ పరిధిలో కావల్సిన సెక్షన్‌ ఆఫీసర్లు ఉన్నారు. కురుపాం రేంజ్‌ పరిధిలో ముగ్గురు సెక్షన్‌ ఆఫీసర్లకు ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన రెండు సెక్షన్లకు ఆయనే ఇన్‌చార్జిగా కొనసాగుతుండడం వల్ల అదనపు పనిభారంతో సతమతమవుతున్నారు. 54 ఫారెస్ట్‌ బీట్లుకు సంబంధించి 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 53 అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లకు గాను కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అడవులపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. సాలూరు రేంజ్‌ పరిధిలో పి.కోనవలస చెక్‌పోస్టుకు తానాదార్‌ లేరు. పాలకొండ రేంజ్‌లో యాలం చెక్‌పోస్టుకు తానాదార్‌ ఉన్నారు. కురుపాం రేంజ్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు.

అటవీ భూములు అన్యాక్రాంతం..

అడవులపై పూర్తి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏటా వాటి విస్తీర్ణం తగ్గిపోంతోది. ఇప్పటికే కొంతమంది భూస్వాములు ఎక్కడికక్కడ చెట్లు, పొదలను కొట్టి చదును చేసుకుంటున్నారు. జీడి, మామిడి, తదితర మొక్కలు నాటి కొందరు అధికారులు, సిబ్బంది సహకారంతో పట్టాలు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అటవీ హక్కు చట్టానికి తూట్లు పడుతున్నాయి. అడవుల్లో ఉండాల్సిన వన్య ప్రాణులు పల్లపు ప్రాంతాలకు వచ్చి వేటగాళ్ల చేతుల్లో మృత్యువాత పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సిబ్బంది కొరతే. అడవుల పర్యవేక్షణకు అవసరమైన సిబ్బంది లేకపోవడం, ఉన్న ఉద్యోగులపై అదనపు పనిభారం పడడంతో సక్రమంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఏనుగుల కదలికల విషయంలో ట్రాకర్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఇదంతా అటవీశాఖకు తెలిసినప్పటికీ పోస్టుల భర్తీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది..

అటవీశాఖలో పోస్టుల భర్తీ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. వారు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మాకున్న సిబ్బందితో విధులు నిర్వర్తిస్తున్నాం.

- డి.గంగరాజు, ఫారెస్ట్‌ రేంజర్‌, కురుపాం రేంజ్‌

Updated Date - Jan 10 , 2025 | 12:05 AM