ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

In-Charges Only ఇన్‌చార్జిలే దిక్కు

ABN, Publish Date - Mar 29 , 2025 | 11:51 PM

In-Charges Only జిల్లాలో పురపాలక సంఘాలు ఇన్‌చార్జిల పాలనలోనే కొనసాగుతున్నాయి. నగర పంచాయతీది కూడా అదే పరిస్థితి. దీంతో పాలనా వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

సాలూరు మున్సిపల్‌ కార్యాలయం
  • మున్సిపాల్టీలు, నగర పంచాయతీలో గాడితప్పిన పాలన

  • ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజల విన్నపం

పార్వతీపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పురపాలక సంఘాలు ఇన్‌చార్జిల పాలనలోనే కొనసాగుతున్నాయి. నగర పంచాయతీది కూడా అదే పరిస్థితి. దీంతో పాలనా వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. వార్డుల్లో ప్రధాన సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అభివృద్ధి పనులూ ముందుకు సాగడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. జిల్లాలో రెండు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీలో పరిస్థితిని పరిశీలిస్తే..

- సాలూరు కమిషనర్‌గా పనిచేసిన సీహెచ్‌ సత్యనారాయణను కొద్ది రోజుల కింద ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఆయన్ని పక్కకు తప్పించారు. డీఈ ప్రసాద్‌కు పురపాలక సంఘం ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇన్‌చార్జి పాలన కారణంగా మున్సిపాలిటీలో పలు శాఖలపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో పారిశుధ్యం, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు లేకపోలేదు. మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలతో పలు ప్రజా ఉపయోగ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ఒకప్పుడు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగాంలో సాలూరు పురపాలక సంఘం నేడు అధ్వాన స్థితికి చేరింది. సాలూరుకు పూర్వవైభవం తెచ్చే విధంగా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

- పార్వతీపురం గ్రేడ్‌-1 పురపాలక సంఘానికి అదే స్థాయి కమిషనర్‌ను నియమించాల్సిన ఉంది. అయితే ఏడాదిగా ఎఫ్‌ఏసీ, వన్‌పే కమిషనర్లే తప్పా శాశ్వత ప్రాతిపదికన ఎవర్నీ నియమించడం లేదు. దీంతో మున్సిపాల్టీలో తాగునీటి సరఫరా మెరుగుపడడం లేదు. ప్రస్తుతం 30 వార్డులకు నాలుగు నుంచి ఐదు రోజులకొకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారు. పట్టణంలో పారిశుధ్యం కూడా లోపించింది. డంపింగ్‌ యార్డు తరలింపు సమస్య కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి.

- పాలకొండ నగర పంచాయతీలో రెగ్యులర్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సర్వేశ్వరరావు కొద్దిరోజుల కిందట ఏసీబీకి చిక్కారు. దీంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో నగర పంచాయతీలో మేనేజర్‌గా పనిచేస్తున్న టి.జయరాంను ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్‌ కమిషనర్‌ బాధ్యతలు చేపట్టేంత వరకు ఆయన నగర పంచాయతీ పాలకవర్గంతో కలిసి అన్ని రకాల అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను ఏ మేరకు పరిష్కరించి.. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Mar 29 , 2025 | 11:51 PM