Incident of a tribal : తప్పని డోలీ మోత
ABN, Publish Date - Apr 03 , 2025 | 11:52 PM
Incident of a tribal :అస్వస్థతకు గురైన ఓ గిరిజనుడిని డోలీలో ఆస్పత్రికి తరలించిన ఘటన గిరిశిఖర గ్రామం బొడ్డపాడులో గురువారం చోటు చేసుకుంది.

- అనారోగ్యానికి గురైన గిరిజనుడు
- రోడ్డు పూర్తి కాకపోవడంతో డోలీలో ఆస్పత్రికి తరలింపు
సాలూరు రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి ): అస్వస్థతకు గురైన ఓ గిరిజనుడిని డోలీలో ఆస్పత్రికి తరలించిన ఘటన గిరిశిఖర గ్రామం బొడ్డపాడులో గురువారం చోటు చేసుకుంది. బొడ్డపాడుకు చెందిన సీదరపు నాగేశ్వరరావుకు ఆకస్మికంగా తాళలేని కడుపునొప్పి వచ్చింది. అయితే, బొడ్డపాడు నుంచి జిల్లేడువలస వరకు రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో నాగేశ్వరరావును వాహనంలో ఆస్పత్రికి తరలించేందుకు వీలుపడలేదు. దీంతో బంధువులు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సీదరపు అప్పారావు తదితరులు డోలీ కట్టి ఆయన్ను దాదాపు మూడు కిలోమీటర్లు మోసుకుంటూ కొండ దిగి జిల్లేడువలసకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆటోలో సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. దీంతో నాగేశ్వరరావును అక్కడకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం గౌరవ అధ్యక్షుడు సీదరపు అప్పారావు మాట్లాడుతూ.. కరడవలస నుంచి బొడ్డపాడు మీదుగా జిల్లేడువలసకు రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తే గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
Updated Date - Apr 03 , 2025 | 11:52 PM