నులిపురుగులను నిర్మూలిద్దాం..ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:19 PM

నులి పురుగుల నివారణ అనేది రక్తహీనత, పౌష్టికాహార లోపం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలతో ముడిపడింది.

  నులిపురుగులను నిర్మూలిద్దాం..ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

- నేడు డీ వార్మింగ్‌ డే

- ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి సన్నద్ధం

- జిల్లాలో 1,36,612 మంది పిల్లలు

కొమరాడ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నులి పురుగుల నివారణ అనేది రక్తహీనత, పౌష్టికాహార లోపం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలతో ముడిపడింది. ఇవి వినడానికి, చూడటానికి చిన్న సమస్యలుగానే కనిపిస్నున్నా వీటి వల్లే ఎదురయ్యే ముప్పు దీర్ఘకాలంలో పెద్దగానే ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వీటి తీవ్రతపై అవగాహన ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రతి ఏడాదీ రెండు పర్యాయాలు నులి పురుగుల నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తల్లిదండ్రుల్లో సరైన అవగాహన లేక భాగస్వామ్యం కావడం లేదు. పెద్దలు ఈ మాత్రలు వేసుకోకపోవడంతో పాటు పిల్లలతో వీటిని మింగించకుండా అవగాహన రాహిత్యంతో ఉంటున్నారు. సోమవారం సామూహిక నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ చేపడుతుంది. జిల్లాలోని 350 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,36,612 (1-19సంవత్సరాలు) పిల్లలు ఉన్నారు. ఇందులో 55,234 మంది అంగన్‌వాడీ చిన్నారులు ఉన్నారు. వీరికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేసేందుకు గాను 3,845 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 37పీహెచ్‌సీలు, 5యూపీహెచ్‌సీల సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, విద్యాశాఖ సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. జిల్లాలో నులి పురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

ఎలా వ్యాప్తిస్తాయంటే..

నులి పురుగులు సన్నటి దారం లాంటి ఆకారంలో ఉంటాయి. ఇవి మానవ శరీంలోని పేగుల గోడలను అంటి పెట్టుకుని ఉంటూ రక్తాన్ని పీలుస్తుంటాయి. మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలు, శక్తిని మన శరీరానికి అందకుండా చేస్తూ హాని కలిగిస్తాయి. ఇతర అవయవాలకు కూడా హాని కలిగిస్తాయి. అధిక శాతం కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల, కలుషిత నీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, బహిరంగ మల విసర్జన ద్వారా, భోజనం సిద్ధం చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు, తినే ముందు, ఆహారం తీసుకున్న తరువాత చేతులు శుభ్రంగా కడగకపోవడంతో నులి పురుగులు మనిషి శరీరంలో వ్యాపిస్తాయి. చేతి వేళ్ల గోర్లు పెంచడం, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లకు వెళ్లడం, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, దూళి ఎక్కువగా ఉండే వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్ధాలు తీసుకోవడం, ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు వంటివి శుభ్రంగా కడగకుండా తినడం ద్వారా మానవ శరీరంలోకి నులి పురుగులు సులువుగా ప్రవేశిస్తాయి. పెద్ద వాళ్ల కంటే పిల్లల ఆరోగ్యంపై నులి పురుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు అందే పోషకాలను ఇవి తీసుకోవడం ద్వారా వారిలో ఎదుగుదల లోపం కనిపించడంతో పాటు ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి తగ్గడం, నీరసించడం, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, మలంలో రక్తం పడటం, మల మూత్ర విసర్జన ప్రదేశంలో దురదలు రావడం, బరువు తగ్గడం, దగ్గు, ఆయాసంతో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణ చర్యలు

- భోజనానికి ముందు, తరువాత, మల విసర్జన తరువాత సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి.

- ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్‌ మాత్రలు 400 గ్రాముల చొప్పున వేసుకోవాలి.

- 1-2 ఏళ్లలోపు పిల్లలు 200 గ్రాముల మాత్ర వేసుకోవాలి.

- కచ్చితంగా భోజనం చేసిన తరువాత నమిలి లేదా చప్పరించి ఈ మాత్రలు కడుపులోకి పంపించాలి.

- మాత్రలు వేసుకునే ముందు కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలి.

పౌష్టికాహారం తీసుకున్నా ఉపయోగం ఉండదు

చిన్న పిల్లల్లో నులి పురుగులు ఉంటే ఆరోగ్య సమస్యలతో పాటు ఎదుగుదల లోపిస్తుంది. తల్లిదండ్రులు చిన్నారులకు పౌష్టికాహారం అందించినా ఉపయోగం ఉండదు. మంచి ఆహారం ద్వారా వచ్చే శక్తినంతా నులి పురుగులే హరిస్తాయి. చిన్నగా ఉండే నులి పురుగులు పెద్దగా పెరిగి పిల్లలకు ఆహారం అందకుండా చేస్తాయి. చిన్న పిల్లల మలాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించాలి. చిన్న చిన్న పురుగులు కనిపిస్తే వైద్యులను సంప్రదించి మాత్రలు వేయాలి. ముఖ్యంగా తొమ్మిదేళ్లలోపు పిల్లలందరూ తప్పకుండా వేసుకోవాలి.

-డాక్టర్‌ తెర్లి జగన్‌మోహనరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి.

Updated Date - Feb 09 , 2025 | 11:19 PM