Tribals గిరిజనులకు ఊరట
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:02 AM
Relief for Tribals గిరిజనుల నుంచి నేరుగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సర్కారు ఆదేశాలు జారీ చేయండంతో గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తుల ధరలను పెంచింది.
వెల్లడించిన జీసీసీ
పార్వతీపురం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల నుంచి నేరుగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సర్కారు ఆదేశాలు జారీ చేయండంతో గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తుల ధరలను పెంచింది. గత ఏడాది కంటే ధరలు పెరగడంతో గిరిజనులకు కాస్త ఊరట కలగుతుందని చెప్పొచ్చు. ఇకపై వారు దళారులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఇలా..
గత ఏడాది పిక్కతో కూడిన కిలో చింతపండు ధర రూ.32-40పైసలు, పిక్కతీసిన చింతపండు రూ.63, కాగుపప్పు రూ.22, విప్పపప్పు రూ.29, కొండతామర జిగురు రూ.114 , ముసిడిక పిక్కలు రూ.90, కరక్కాయలు రూ.18, ఎండు ఉసిరిక పప్పు రూ.80, ఇండికా పిక్కలు రూ.50, కానీ కాయలు రూ. 17, కుంకుడుకాయలు రూ.35, సీకా కాయి రూ.40, అడవి తేనె రూ. 250, పుట్ట తేనె రూ. 160, తేనె మైనం రూ.160, కొండ చీపుర్లు గ్రేడ్-1 రూ.45
తాజాగా పెరిగిన రేట్లు ప్రకారం...
పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.34, పిక్కతీసిన చింతపండు రూ.67, కాగుపప్పు రూ.25, విప్పపప్పు రూ.32, ముసిడిక పిక్కలు రూ.వంద, నల్లజీడి పిక్కలు రూ.22, కరక్కాయలు రూ.20 , ఎండు ఉసిరిక పప్పు రూ.90, కానీ కాయలు రూ.18కు పెంచారు. మిగిలిన అటవీ ఉత్పత్తుల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే చింతపండుకు పిక్కతో ఉన్న దానికి రూ.రెండు, పక్కి తీసిన దానికి రూ.నాలుగు పెంచారు. చింతపండు, మిగిలిన అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి నేరుగా జీసీసీ కొనుగోలు చేస్తేనే లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది.గిరిజన రైతులకు కూడా ఎంతోకొంత గిట్టుబాటు అవుతుంది. దీనిపై జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
ధరలపై అవగాహన
మక్కువ: మొండంగి గ్రామంలో గురువారం గిరిజనులకు జీసీసీ ధరలు, అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై అవగాహన కల్పించారు. దళారులకు విక్రయిస్తే నష్టపోతారని, జీసీసీకి అమ్మితే గిట్టుబాటు ధర లభిస్తుందని వివరించారు. అనంతరం ధరల పట్టికను ప్రదర్శించారు. ఈ కార్య క్రమంలో జీసీసీ బ్రాంచి డైరెక్టర్ నూకమ్మ, సర్పంచ్ గంగమ్మ, సేల్స్‌మన్ ఎస్.రమణారావు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు చేస్తాం
జీసీసీ ద్వారా గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. ఈ ఏడాది రెట్లు పెరిగాయి. ఈ విషయాన్ని గిరిజన రైతులకు తెలియజేస్తాం. వారికి మేలు జరిగేలా చూస్తాం.
- ఉరిటి మహేంద్ర, డివిజనల్ మేనేజర్, జీసీసీ
Updated Date - Jan 10 , 2025 | 12:02 AM