Buchi Apparao :బుచ్చి అప్పారావు పేరు పునరుద్ధరణ
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:38 PM
Buchi Apparao : తాటిపూడి జలాశయానికి స్వాతంత్య్ర సమరయోధుడు, జామి మండలానికి చెందిన గొర్రిపాటి బుచ్చి అప్పారావు (జి.బి.అప్పారావు) పేరును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది.
శృంగవరపుకోట, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తాటిపూడి జలాశయానికి స్వాతంత్య్ర సమరయోధుడు, జామి మండలానికి చెందిన గొర్రిపాటి బుచ్చి అప్పారావు (జి.బి.అప్పారావు) పేరును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు గురువారం జల వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంతో పాటు అనేక సంస్థల పేర్లను మార్చేసింది. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఆ చర్యలకు పాల్పడింది. పాత పేర్లను పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాటిపూడి రిజర్వాయర్‌కు పెట్టిన బుచ్చి అప్పారావు పేరు పునరుద్ధరణకు నోచుకుంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఈ విషయాన్ని శాసనసభలోనూ ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన ప్రభుత్వం తిరిగి జలాశయానికి బుచ్చి అప్పారావు పేరు పెట్టింది.
నేడు బోటు షికారు..
గంట్యాడ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తాటిపూడి రిజర్వాయర్‌లో బోటు షికారును శుక్రవారం పునః ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విజయవాడ నుంచి బోట్లు, జట్టీలు తెప్పించి అంతా సిద్ధం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిని ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Updated Date - Jan 02 , 2025 | 11:38 PM