Sankranti సంక్రాంతి జోష్
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:27 AM
Sankranti josh పెద్దల పండగ అయిన సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం జిల్లా వాసులకు ఆనవాయితీ. అందుకే ఏ పండగలకు రాకపోయినా విధిగా సంక్రాంతికి వస్తుంటారు. అయితే ఇప్పటికే ఎంతోమంది వలస పక్షులు సొంతగూటికి చేరుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు నిమిత్తం ఇతర దేశాలు, రాష్ర్టాల్లో స్థిరపడిన జిల్లావాసులు, ఎన్‌ఆర్‌ఐలు స్వగ్రామాలకు తరలివచ్చారు.
పల్లెలు, పట్టణాలు కళకళ
సకాలంలో ధాన్యం నగదు జమ
ఆనందంలో అన్నదాతలు
సంప్రదాయబద్ధంగా పండగ నిర్వహణకు సర్వం సిద్ధం
అంతటా సందడే సందడి
పాలకొండ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): పెద్దల పండగ అయిన సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం జిల్లా వాసులకు ఆనవాయితీ. అందుకే ఏ పండగలకు రాకపోయినా విధిగా సంక్రాంతికి వస్తుంటారు. అయితే ఇప్పటికే ఎంతోమంది వలస పక్షులు సొంతగూటికి చేరుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు నిమిత్తం ఇతర దేశాలు, రాష్ర్టాల్లో స్థిరపడిన జిల్లావాసులు, ఎన్‌ఆర్‌ఐలు స్వగ్రామాలకు తరలివచ్చారు. ఉపాధి పనుల కోసం విజయవాడ, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్ తదితర రాష్ర్టాలకు తరలిన జిల్లావాసులు సైతం ముందస్తుగానే స్వస్థలాలకు చేరుకున్నారు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో సరదాగా పండగ చేసుకుని తిరుగు ప్రయాణమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వగ్రామాలకు అంతా చేరుతున్న క్రమంలో రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు కిటకిటలాడుతున్నాయి. మొత్తంగా పల్లెలు, పట్టణాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. కాగా మంగళవారం ఘనంగా సంక్రాంతిని జరుపుకునేందుకు జిల్లావాసులంతా సన్నద్ధమయ్యారు.
రైతుల్లో ఆనందం...
రైతులు తమ పంటలను విక్రయించి.. తిండి గింజలను ఇంటికి చేర్చిన తర్వాత చేసుకొనే సంప్రదాయ పండగ సంక్రాంతి. ఈ సంప్రదాయ పండగకు రైతులు ఎంతో ప్రాధ్యాన్యమిస్తారు. పంటను సకాలంలో విక్రయించి.. నగదు చేతికి అందితేనే రైతుల మోములో ఆనందం కనిపిస్తుంది. అయితే అది ఈ ఏడాది స్పష్టంగా కనిపించింది. ప్రతి రైతుకు ముందస్తుగానే సంక్రాంతి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మేరకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంది. అంతేకాకుండా ధాన్యం విక్రయాల్లో అన్నదాతలకు స్వేచ్ఛనిచ్చింది. ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోనే ఖాతాల్లోకి నగదు జమ చేసింది. దీంతో రైతులకు ముందుగానే పండగొచ్చింది. పెద్ద పండగకు అవసరమైన నూతన వస్ర్తాలు, ఇతర నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలల తరబడి ధాన్యం నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడేవారు. అప్పులు చేసుకుని పండగ చేసుకునే పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన ఆ ఇబ్బందులు తొలగిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు..
ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది రైతులకు ఎంతో మేలు జరిగింది. ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించి వెనువెంటనే ఖాతాల్లో నగదు జమ చేసింది. దీంతో ముందస్తుగానే సం క్రాంతి సంబరాలు జరుపుకున్నట్లయ్యింది.
-గోగులు శేఖర్, రైతు , పాలకొండ
=============================
గంటల వ్యవధిలోనే నగదు జమ
ప్రభుత్వ చొరవతో రైస్‌మిల్లులకు ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలకు నగదు జమ అయింది. దీంతో సంక్రాంతికి అవసరమైన నిత్యావసర సరుకులు, నూతన దుస్తులు కొనుగోలు చేసుకుని పండగకు సన్నద్ధమయ్యాం.
- పొట్నూరు జగ్గునాయుడు, రైతు, బుక్కూరు
=============================
ఏటా స్వగ్రామంలోనే సంబరాలు
హైదరాబాద్‌లోనే 25 ఏళ్లుగా ఉంటున్నా. అక్కడే చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాం. అయితే ఏటా సంక్రాంతికి మాత్రం స్వగ్రామానికి వస్తాం. కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహంలో సంప్రదాయబద్ధంగా పండగ జరుపుకుంటాం. పెద్ద పండగను సొంతూరిలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
- పొట్నూరు అచ్యుతరావు, చిరు వ్యాపారి, బుక్కూరు =============================
అబుదాబీ నుంచి వచ్చా..
అబుదాబిలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా. నాలుగు రోజు కిందటే ఇక్కడకి వచ్చా. ఏటా సంక్రాంతి పండగకు విధిగా స్వగ్రామానికి వస్తుంటా. కుటుంబ సభ్యులు, బందుమిత్రులతో కలిసి ఆనందంగా పండగ జరుపుకుంటాం. నాలుగు రోజుల కిందటే అబుదాబి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాను.
- లోచర్ల హరిబాబు, ఎన్‌ఆర్‌ఐ, పాలకొండ
Updated Date - Jan 14 , 2025 | 12:27 AM