Share News

Slot booking in effect అమల్లోకి స్లాట్‌ బుకింగ్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:05 AM

Slot booking in effect స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దళారుల ప్రమేయానికి చెక్‌ పెట్టడంతో పాటు క్రయవిక్రయదారులకు సమయం ఆదా చేసే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన స్లాట్‌ బుకింగ్‌ విధానం శుక్రవారం మొదలైంది.

Slot booking in effect అమల్లోకి స్లాట్‌ బుకింగ్‌

అమల్లోకి స్లాట్‌ బుకింగ్‌

రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త విధానం ప్రారంభం

క్రయ విక్రయదారులకు సమయం ఆదా

పైలట్‌ ప్రాజెక్టు కింద విజయనగరం ఓబీ కార్యాలయం ఎంపిక

తొలిరోజు 46 స్లాట్‌ బుకింగ్‌లు.. 44 రిజిస్ట్రేషన్లు

విజయనగరం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి):

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దళారుల ప్రమేయానికి చెక్‌ పెట్టడంతో పాటు క్రయవిక్రయదారులకు సమయం ఆదా చేసే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన స్లాట్‌ బుకింగ్‌ విధానం శుక్రవారం మొదలైంది. డాక్యుమెంట్‌ రిజిస్ర్టేషన్ల కోసం గంటలకొద్దీ నిరీక్షించకుండా డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ (డీక్యూఎంఎస్‌) విధానం దోహదపడనుంది. పాత విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం కొత్తగా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని ఆర్‌వో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఎంపిక చేశారు. దశలవారీగా మిగతా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రోజుకు సగటున 250 నుంచి 300 వరకూ రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయి. అయితే ప్రభుత్వానికి ఆదాయం కంటే దళారులు, దస్తావేజు లేఖర్లు ఎక్కువగా ఆదాయం పొందుతున్నారన్నది బహిరంగ రహస్యం. కొంతమంది సబ్‌ రిజిస్ట్రార్లు దస్తావేజు లేఖర్లు, దళారులను సొంతంగా ఏర్పాటు చేసుకుని పర్సంటేజీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్ని దస్తావేజులూ సక్రమంగా ఉన్నా పర్సంటేజీలు అందని వాటికి ఉద్దేశపూర్వకంగానే సబ్‌ రిజిస్ట్రార్లు అడ్డుపుల్ల వేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. అయితే రిజిస్ర్టేషన్ల ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా జరిగే జాప్యాన్ని నియంత్రించాలనే ప్రభుత్వం డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని ప్రారంభించింది.

కొత్త విధానం ఇలా..

స్థిరాస్తుల క్రయ విక్రయాలు, వివాహాల రిజిస్ర్టేషన్లకు సంబంధించి పబ్లిక్‌ డేటా ఎంట్రీ సిస్టమ్‌ (పీడీఈ) ద్వారా ఏపీ రిజిస్ర్టేషన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. రిజిస్ర్టేషన్‌ చేయాలనుకున్న తమ ఆస్తులు, ఇతర వివరాలు నమోదుచేసుకుని డాక్యుమెంట్లు తయారుచేసుకున్నాక దరఖాస్తు ఐడీ వస్తుంది. దీని ద్వారా స్టాంప్‌ డ్యూటీ, ఇతర ఫీజులు చెల్లించి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకొని స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇది పూర్తయిన వెంటనే వారికి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ టోకెన్‌ వస్తుంది. అందులో వచ్చిన అపాయింట్‌మెంట్‌ ప్రకారం నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ర్టేషన్‌ పూర్తిచేసుకునే వెసులబాటు కల్పించారు. కాగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యమాత్రమే దీనికి అవకాశం కల్పించారు. ముందస్తు స్లాట్‌ బుకింగ్‌కు ఎటువంటి ఫీజు ఉండదు.

పారదర్శకంగా రిజిస్ర్టేషన్లు

పారదర్శకంగా రిజిస్ర్టేషన్ల ప్రక్రియ జరుగుతోంది. జిల్లా ఆర్‌వో కార్యాలయంలో డైనమిక్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని ఫైలట్‌గా ప్రారంభించాం. మొదటి రోజు 46 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. 44 మందికి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. క్రయ విక్రయదారుల అనుకూల సమయంలో రిజిస్ర్టేషన్‌ చేస్తాం. ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సమయం అదా కావ డమే కాకుండా మధ్యవర్తిత్వం ఉండకుండా నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

- పి.రామలక్ష్మి పట్నాయిక్‌, జిల్లా ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌, విజయనగరం

Updated Date - Apr 05 , 2025 | 12:06 AM