Supervision ఒక శాఖపై నలుగురి పర్యవేక్షణ!
ABN, Publish Date - Apr 04 , 2025 | 11:26 PM
Supervision of One Department by Four! జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక శాఖను నలుగురు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

నేటికీ సమాఖ్య భవనంలోనే పీడీ కార్యాలయం
కానరాని సిబ్బంది
ఉన్నతాధికారులు స్పందించేనా?
పార్వతీపురం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక శాఖను నలుగురు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 15 మండలాలు ఉండగా డీఆర్‌డీఏ కార్యక్రమాలకు సంబంధించి 8 మండలాలపై ఓ అధికారి, 3 మండలాలపై మరో అధికారి, 2 మండలాలకు సంబంధించి ఇంకొక అధికారి, మిగిలిన రెండు మండలాలపై మరోక అధికారి పెత్తనం చెలాయిస్తున్నారు. పేరుకే మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు తప్ప కనీసం ఉన్నతా ధికారులకు అవసరమైన కార్యాలయాలు గాని, అందులో పనిచేసేందుకు సిబ్బందిని గాని నేటికీ సమకూర్చలేదు. చాలా కార్యాలయాల్లో ఉమ్మడి జిల్లాల అధికారులు పెత్తనం నేటికీ కొనసాగు తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిశాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో జిల్లా సమాఖ్యతతో పాటు 15 మండలాలకు సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో 565 విలేజ్ ఆర్గనైజేషన్లు, 19,868 మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 2,29,055 మంది సభ్యులు ఉన్నారు. అదే విధంగా 15 మండలాల్లో ఏపీఎంలు, సీసీలతో పాటు ఇతర సిబ్బంది 167 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 138 మంది మాత్రమే ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, పార్వతీపురం, మక్కువ, జియ్యమ్మవలస, కురుపాం, కొమరాడ మండలాల పరిధిలో డీఆర్‌డీఏ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపడుతున్నారు. సీతానగరం, బలిజిపేట, గరుగుబిల్లి మండలాల సిబ్బంది వేతనాల చెల్లింపు, ఇతర కార్యక్రమాలు విజయనగరం డీఆర్‌డీఏ పీడీ ద్వారా జరుగుతున్నాయి. పాలకొండ, వీరఘట్టం మండలాలకు సంబంధించి శ్రీకాకుళం డీఆర్‌డీఏ పీడీ, భామిని, సీతంపేట మండలాలకు సంబంధించి సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా నలుగురు అధికారులు ఒక శాఖను పర్యవేక్షిస్తున్నారు.
సిబ్బంది ఎక్కడ..
జిల్లాలో 15 మండలాలకు ఏపీఎంలు ఉన్నారు. వారి పర్యవేక్షణలో సిబ్బంది పనిచేస్తున్నారు. అదే విధంగా పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో ఉన్న మండలాలకు కూడా ఇద్దరు ఏపీడీలు ఉన్నారు. సీతంపేటలో ఒక ఏపీడీ, పార్వతీపురంలో మరోక ఏపీడీ పని చేస్తున్నారు. కానీ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పీడీ కార్యాలయంలో మాత్రం సిబ్బంది లేని పరిస్థితి నెలకొంది. గతంలో పీడీగా పనిచేసిన కిరణ్‌కుమార్ పార్వతీపురం ఐటీడీఏ, వెలుగు ఏపీడీ కార్యాలయం నుంచి కొంతమంది సిబ్బందిని అనధికారికంగా పీడీ కార్యాలయంలో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే, ఆయన ఇక్కడి నుంచి వేరేచోటకు వెళ్లిపోయిన తరువాత ఆ కార్యాలయంలో పని చేసే సిబ్బంది కూడా తమ పాత కార్యాలయాలకు వెళ్లిపోయారు. కొత్తగా ఇప్పుడు జిల్లా డీఆర్‌డీఏ పీడీగా డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఎం.సుధారాణిని ప్రభుత్వం నియమించింది. ఆమెకు ప్రత్యేకంగా ఒక కార్యాలయంతో పాటు కొంతమంది సిబ్బంది ఎంతో అవసరం. కానీ, ఆ పరిస్థితి జిల్లాలో లేదు. జిల్లా సమాఖ్య భవనంలో పీడీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఆమె విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు స్పందించి డీఆర్‌డీఏ పీడీ నూతన కార్యాలయంతో పాటు ఒక సూపరింటెండెంట్, అసరమైన సిబ్బంది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా 15 మండలాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి డీఆర్‌డీఏ పీడీ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Apr 04 , 2025 | 11:26 PM