TB Cases జిల్లాలో తగ్గని క్షయ (టీబీ) బాధితులు

ABN, Publish Date - Mar 23 , 2025 | 11:47 PM

TB Cases Continue Unabated in the District జిల్లాలో క్షయ (టీబీ) కేసులు గతంతో పోలిస్తే కాస్త తగ్గినా పూర్తిగా అదుపులోకి రావడం లేదు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

TB Cases  జిల్లాలో తగ్గని క్షయ (టీబీ) బాధితులు
టీబీ లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంటి వద్దే పరీక్షలు చేపట్టే హ్యాండ్‌ హెల్డ్‌ ఎక్స్‌రే మిషన్‌

నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం

పాలకొండ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్షయ (టీబీ) కేసులు గతంతో పోలిస్తే కాస్త తగ్గినా పూర్తిగా అదుపులోకి రావడం లేదు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా దగ్గు వస్తున్నా సాధా రణమే కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారు. రెండు వారాలకు మించి దగ్గు వేధిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కళ్లె పరీక్ష చేయించుకోవాలి. ఆదిలోనే సరైన వైద్యం తీసుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు.

క్షయవ్యాధి కారకమైన బ్యాక్టీరియా (మైకో బాక్టీరియం ట్యూబర్‌క్యూలోసిస్‌)ను డాక్టరు కోచ్‌ కనుగొన్న తర్వాత శతాబ్ది వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా 1942 నుంచి ఏటా మార్చి 24న ప్రపంచ టీబీ దినం పాటించాలని చెప్పింది. ఈ రోజున దేశవ్యాప్తంగా వ్యాధి తీవ్రతపై చర్చలు నిర్వహించడం.. నివారణ మార్గాలను సూచించడం.. భవిష్యత్‌ కార్యాచరణకు వైద్యశాఖ ప్రణాళిక రూపొందించడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలికంగా దగ్గు వస్తుంటే తేలిగ్గా తీసుకోకూడదు. రెండు వారాలకు మించి దగ్గు వేధిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కళ్లె పరీక్ష చేయించుకోవాలి. దీర్ఘకాలిక దగ్గు క్షయ లక్షణం కావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఔషధాలను సకాలంలో వాడితే క్షయ వ్యాధి తప్పకుండా నయం అవుతుంది. లేని పక్షంలో మొండిగా మారి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు హరించే ప్రమాదం వుంది.

లక్షణాలు ఇవే ..

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు పడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆలసటగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్‌ వ్యాధిగ్రస్థులు, పొగ ఇతర మత్తుపదార్థాలు వాడే వారిలో టీబీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. క్షయవ్యాధి దగ్గు ద్వారా ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇంటిలో టీబీతో బాధపడేవారికి మిగిలిన కుటుంబ సభ్యులను కొంత దూరంగా ఉండాలి.

నాలుగు కేటగిరీలు...

క్షయవ్యాధిని నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. మొదటిసారి వ్యాఽధి బారిన పడితే కేటగిరీ-1గా భావిస్తారు. ఈ కేటగిరీలో ఉన్న వారికి ఆరు నెలల పాటు మందులు అందిస్తారు. రెండో సారి వస్తే కేటగిరీ-2గా గుర్తించి.. 8 నెలల పాటు మందులు అందిస్తారు. మొండి క్షయవ్యాధిగ్రస్థులను కేటగిరీ-3గా, ముదిరిపోయిన వ్యాధిగ్రస్థులను కేటగిరి-4ను పరిగణిస్తారు. వీరికి సుమారు రూ.18 లక్షల విలువైన మందులను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది.

నమోదైన కేసులు ఇలా..

జిల్లాలో 2024లో 1451 , 2025 ఫిబ్రవరి వరకు 507 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 883 మంది వరకు ఉన్నారు. బహుళ ఔషద నిరోధక (ఎండీఆర్‌) టీబీ కేసులు 16 వరకు ఉన్నాయి. సందేహిత పరీక్షలకు నెలకు సగటున మూడు వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు.

నిర్ధారణ ఇలా

క్షయవ్యాధి నిర్ధారణకు పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌రే, సీబీనాట్‌ పరీక్ష ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేస్తారు. అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ టీబీ నిర్ధారణ పరీక్షలకు అవకాశం ఉంది. టీబీ కేంద్రంలో కాట్రిజ్డ్‌బేస్‌డ్‌ యూక్లిక్‌ యాసిడ్‌, యాంప్లిఫికేషన్‌ టెస్ట్‌ (సీబీనాట్‌) పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 49 నిర్దేశిత సూక్ష్మ పరిశీలన కేంద్రాలు, 19 ఆర్‌టీ- పీసీఆర్‌ కేం ద్రాలు, ఏడు టీబీ యూనిట్లు ఉన్నాయి.

ఉచితంగా చికిత్స

ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాలను ఉచితంగా అందజేస్తున్నారు. టీబీ వ్యాధి నిర్ధారణ జరిగిన రోగులకు ఔషధాలను ఆరు నెలల పాటు ఉచితంగా అందజేస్తారు. ఈ ఔషధాలు క్రమం తప్పకుండా వాడితే టీబీ పూర్తిగా తొలగిపోతుంది. వీరికి పోషకాల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెలా వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు.

ఇంటి వద్దే పరీక్షలు

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వెళ్లి టీబీ పరీక్షలు చేపడుతున్నాం. హ్యాండ్‌హెల్డ్‌ ఎక్స్‌రే మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాని ద్వారా లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంటి వద్దే నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. ముఖ్యంగా షుగర్‌ బాధితులు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, పొగతాగే అలవాటు ఉన్న వారు, గుట్కా, పాన్‌ తినేవారికి పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీలోనూ పరీక్షలు చేస్తున్నాం. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి బారిన పడేవారు ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వినియోగించాలి.

- ఎం.వినోద్‌కుమార్‌, జిల్లా టీబీ నియంత్రణ అధికారి

Updated Date - Mar 23 , 2025 | 11:47 PM