కో..ఢీ
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:32 AM
పశ్చిమలో పండుగ జోష్ అంబరాన్ని తాకింది. కోళ్లు కత్తులు దూశాయి. పందేల రాయుళ్లు బరుల వద్దకు పరుగులు తీశారు. భోగి రోజు ఉదయం పది గంటల నుంచే బరులు తెరిచారు.
ఊరూరా లెక్కకు మించి బరులు
పందెగాళ్లు లేక పలుచోట్ల తొలగింపు
తొలిరోజు అత్యధిక పందెం రూ.5 లక్షలు
జిల్లాలో చేతులు మారిన మొత్తం రూ.100 కోట్లు !.. ఎక్కువ పందేలు గెలిస్తే బుల్లెట్లు
గుండాట, కోతాటల్లో జనం జేబులు ఖాళీ
ఏరులై పారిన మద్యం అమ్మకాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
పశ్చిమలో పండుగ జోష్ అంబరాన్ని తాకింది. కోళ్లు కత్తులు దూశాయి. పందేల రాయుళ్లు బరుల వద్దకు పరుగులు తీశారు. భోగి రోజు ఉదయం పది గంటల నుంచే బరులు తెరిచారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఊరూరా బరులు వెలిశాయి. ఈ కారణంగా చాలాచోట్ల జనం లేక సాయంత్రానికి కొన్నింటిని ఎత్తేశారు. జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్లు చేతులు మారినట్లు అంచనా.
ఉండి నియోజకవర్గం పెద అమిరంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీసలి బరిలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు డింకీ పందేలను ప్రారంభించారు. సీసలి, పెద అమిరం, కాళ్ళ, జక్కరం, ఏలూరుపాడు, కాళ్ళకూరు, జువ్వలపాలెం, మాలవానితిప్ప, బోస్ కాలనీల్లో యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట, గుండాటల్లో కోట్లు చేతులు మారాయి. సీసలి, పెద అమిరంలో రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో టీవీల ద్వారా వీక్షించేందుకు ప్రాంగణంలో ఎల్‌సీడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ఆకివీడులో ఒక్కో పందేనికి లక్షల్లో కాశారు. వీటిల్లో కోసు పందేలు అధికం. అధిక ధరలకు మద్యం, మాంసం విక్రయించారు. పందేలు ప్రారంభమయ్యే సరికి పోలీసులు కనిపించలేదు.పాలకోడేరు, మోగల్లు, గరగపర్రు, గొల్లలకోడేరు, వేండ్ర, శృంగవృక్షం, పెన్నాడ, విస్సాకోడేరు, కుముదవల్లి శివార్లలో వేసిన బరుల్లో పందేలు జోరుగా సాగాయి. ఈ ఏడాది పోటాపోటీగా ఒక్కొక్క గ్రామంలో రెండేసి బరులు ఉండటం, దానికి తోడు వైరస్ ప్రభావంతో కోడిపుంజులు చనిపోవడంతోపాటు బరులు ఎక్కువైపోవడంతో జనాలు పలుచగా కనిపించారు. పాలకోడేరులో ఒక వైపు టీడీపీ, మరోవైపు వైసీపీ నాయకులు బరులు ఏర్పాటుచేశారు.
భీమవరం మండలం గొల్లవానితిప్ప రోడ్‌లో వీఐపీ గ్యాలరీతో బరిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విచ్చేసిన వారు పందేలను తిలకించారు. సినీనటులు విచ్చేశారు. బరుల వద్ద బిర్యానీతోపాటు, చికెన్ పకోడీ, లెగ్ పీస్‌ల వంటకాలను ఏర్పాటు చేశారు. గుండాట, కోతాటలలో లక్షలు చేతులు మారాయి. ఇక్కడ జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీటిలోను లక్షల రూపాయలు చేతులు మారాయి. పందేలు చూసేందుకు మహిళలు ఆసక్తి చూపారు. బేతపూడిలో తొమ్మిది పందేలను ఏకబిగిన నిర్వహించారు. ఒక్కో పందెం రూ.3 లక్షలకు జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన సతీష్ ఆరు పందేలు నెగ్గి బుల్లెట్‌ను గెలుచుకున్నారు. వీరవాసరం మండలం నవుడూరులోనూ ద్విచక్ర వాహనాలు, బంగారు నాణేల ఆఫర్లు ప్రకటించారు.
నరసాపురం పట్టణం, మండలం, మొగల్తూరుల్లో 25కు పైగా పందేల బరులు తెరిచారు. అన్నిచోట్ల గుండాట, కోత ముక్కలు విచ్చలవిడిగా సాగాయి. వీవర్స్ కాలనీలో అతిథులు కూర్చోందుకు ఖాళీ కంటైనర్లు పెట్టారు. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పందేలు జరిగాయి. పెద్ద బరుల్లో రాత్రి వేళల్లో మ్యూజికల్ నైట్, అర్కెస్ర్టా, డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. మొగల్తూరు మండలంలో ఎక్కువ బరులు ఏర్పాటు చేయడం.. పందెం రాయుళ్ల వద్ద డబ్బులు లేకపోవడంతో అవి వెలవెలబోయాయి. మొగల్తూరులో ఏడుచోట్ల బరులను సిద్ధం చేయగా జనం లేక సాయంత్రానికి మూడింటిని ఎత్తేశారు. కనీస ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని కాళీపట్నం పడమర, వారతిప్ప, పేరుపాలెం సెంటర్, కేపీ పాలెం బీచ్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన బరులకు ఇదే పరిస్థితి. యలమంచిలి మండలం కలగంపూడిలో ఈ ఏడాది రెండు బరులు వెలిశాయి. గుంపర్రు, వడ్డిలంక, బూరుగుపల్లి, నార్నిమెరక, యలమంచిలి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరుల వద్ద కోడిపందేలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. కలగంపూడిలో పెద్దఎత్తున కోడి పందేలు, గుండాట జరుగుతున్నాయి. లక్షలాది రూపా యలు పందెం రాయుళ్లు చేతులు మారుతున్నాయి.
తణుకు మండలం దువ్వ, తేతలి, మండపాక, వేల్పూరు, పైడి పర్రు, అత్తిలి మండలం ఘంటావారి పుంత, కెఎస్ గట్టు, ఇరగవరం మండలం రేలంగి, పెంట పాడు మండలం పెంటపాడు, అలంపురం, ప్రత్తిపాడు, దర్శిపర్రు, జట్లపాలెం, మీనవల్లూరు, రామచంద్రపురం, తాడేపల్లిగూడెం, ఆచంట, గణపవరం మండలం వెంకటరాజపురం, కాశిపాడు, అప్పన్నపేటల్లో పెద్ద ఎత్తున బరులు వెలిశాయి. తాడేపల్లిగూడెంలో అంతా ఆత్రుతగా ఎదురుచూసిన కోటి రూపాయల పందెం మంగళవారానికి వాయిదా వేసినట్టు నిర్వా హకులు ప్రకటించారు. జోడీలు ఎక్కవ గెలిచిన వారికి గోల్డ్ చైన్, రాయల్ ఇన్‌ఫీల్డ్ మోటారు సైకిల్స్ ఇస్తామని ఆఫర్స్ ప్రకటించి పందేలను మరింత రక్తి కట్టించారు. జిల్లావ్యాప్తంగా
అనేక చోట్ల ఇటువంటి పోటీ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం, వైసీపీ బరులు అన్నట్టు పోటీ ఏర్పడింది. ముందస్తుగానే అందరూ బరులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో పోలీసుల హడావుడి ఉండేది. బరుల వద్దంటూ హెచ్చరికలు చేసేవారు. ఈసారి అటువంటిది లేదు. బరులు ఎక్కువగా ఉం డడంతో ప్రతిచోట తొలిరోజు రద్దీ తక్కువగా ఉంది. ఇరగవరం మండలం కొత్తపాడు బరికి మధ్యాహ్నం వరకు అనుమతులు రాకపోవడంతో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధర్నా చేశారు. ఒంటి గంటకు బరికి అనుమతి ఇచ్చారు. జిల్లాలో ఎటు వంటి అలర్లు లేకుండా సజావుగా నిర్వాహకులు పందేలు నిర్వహించుకున్నారు. ఫ్లడ్‌లైట్ వెలుగుల్లోనూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి.
వైరస్ ప్రభావం
కోడి పందేలకు వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పందేలకు సరైన జోడీ ఉండడం లేదు. దీనికితోడు బరులు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో పందెం మధ్య సమయం ఎక్కువగా ఉంటోంది. భీమవరం ప్రాంతంలో పందెం ముగిసిన వెంటనే మరో జోడీని రంగంలోకి దింపేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. అరగంట సమయం తీసుకున్నారు. గత ఏడాది రూ.25 లక్షల వరకు పందెం వెళ్లింది. ఈ సారి అదే స్థాయిలో ఉంటుందని అనుకున్నారు. అంచనాలు వేసుకున్నారు. కానీ పందెం రాయుళ్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలిరోజు రూ.5 లక్షల వరకు మాత్రమే పెద్ద బరుల్లో అత్యధిక పందేలు జరిగాయి. మరోవైపు జనం పందేలకంటే ఈ సారి కుటుంబాలతో సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Updated Date - Jan 14 , 2025 | 12:32 AM