ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కో.. కోట్లు

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:14 AM

సంక్రాంతి పెద్ద పండుగ మూడు రోజులపాటు ధూమ్‌ధామ్‌గా సాగింది. నోట్లు చేతులు మారాయి. కోళ్లు కత్తులు కట్టుకున్నాయి. ఎక్కడికక్కడ సందడే సందడి. చిన్నాపెద్ద తేడా లేకుండా ఈ మూడు రోజులు మురిపించారు.

వీరవాసరం మండలం నవుడూరులో బరి వద్ద కార్లు, వాహనాలు

కో.. కోట్లు

మూడు రోజులూ కోడి పందేల జాతర

సంక్రాంతి పెద్ద పండుగ మూడు రోజులపాటు ధూమ్‌ధామ్‌గా సాగింది. నోట్లు చేతులు మారాయి. కోళ్లు కత్తులు కట్టుకున్నాయి. ఎక్కడికక్కడ సందడే సందడి. చిన్నాపెద్ద తేడా లేకుండా ఈ మూడు రోజులు మురిపించారు. ఓ వైపు కోతాట, మరోవైపు గుండాట, ఇంకోవైపు పొట్టేలు, పందుల పోటీలు.. ఎక్కడికక్కడ ఏటీఎంలే కాదు జనం జేబులు ఖాళీ అయ్యాయి. మద్యం ఏరులై పారింది. తెలంగాణ మద్యం అదనంగా వచ్చిపడింది. బుల్లితెర తారలు దిగొచ్చారు. ప్రజా ప్రతినిధులు బరుల వద్ద చుట్టాలయ్యారు. పండుగ ముగిసింది ఇక చాలంటూ కనుమ సాయంత్రం ఐదు గంటలకు బరుల వద్ద పోలీసులు వచ్చి వాలారు.

(భీమవరం/ఏలూరు/కాళ్ల/ తాడేపల్లిగూడెం రూరల్‌, ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 200 బరులు ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల్లో సుమారు రూ.300 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. ఇందులో కాళ్ల మండలంలోని బరుల్లో అధిక మొత్తం ఉంటుందని అంటున్నారు. సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో భారీ ఎత్తున పందేలు సాగాయి. పగలే కాకుండా కొన్ని గ్రామాల్లో రాత్రి పూట నిర్వహించేందుకు ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. జాతరను తలపించేలా గ్రామాలన్నీ కోలాహలంగా మారాయి. కోడి పందేలకు వచ్చే వాహనాలతో రోడ్లన్నీ స్తంభించాయి. కాళ్ల మండలం సీసలి, పెద అమిరం గ్రామాల బరుల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. పందెంరాయుళ్లను కట్టడి చేసేందుకు బౌన్సర్‌లను ఏర్పాటు చేశారు. అతిథులకు ప్రత్యేక పాస్‌లు ఇచ్చారు. కాళ్ళకూరు, ఏలూరుపాడు, కాళ్ళ, సీసలి, కోపల్లె, జక్కరం, మోడి, పెద అమిరం, మాలవానితిప్ప గ్రామాల్లో జోరుగా పందేలు నిర్వహించారు. సీసలి, పెద అమిరం పందేలను తెలంగాణ నాయకులు తిలకించారు. పందేలను తిలకించేందుకు వచ్చిన పందెంరాయుళ్లు, ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. భీమవరం రూరల్‌ గొల్లవానితిప్ప బరిలో మూడు రోజులకు గాను రూ.20 కోట్లకుపైగా పందేలు సాగాయి. ఒక పందెం రూ.60 లక్షల వరకు వెళ్లింది. కోడి పందేల ముసుగులో గుండాటలు జోరుగా సాగాయి. లోన, బయట పేక ముక్కల ఆటల్లో లక్షలు చేతులు మారాయి. గెలిచిన వారు ఆనందంతో రెట్టింపు పందేలకు దిగగా, ఓడిన వారు దిగాలుగా ఇంటి ముఖం పట్టారు.

అమ్మో.. ఎంత డబ్బో

ఈ మధ్య కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో నగదు ప్రవాహంగా సాగిందంటే అది సంక్రాంతి కోడి పందేల సీజన్‌లోనే. బయట ప్రపంచం మరిచిపోయిన బెట్టింగ్‌రాయుళ్లంతా తెగబడ్డారు. ఏకంగా నగదును కట్టలు కట్టలుగా తెచ్చి బెట్టింగులను కాశారు. తగినంత భద్రత తీసుకున్నారు. మొత్తం నగదును నలుగురైదుగురికి విభజించి అందుబాటులో ఉంచుకున్నారు. ఆ తరువాతే వరుస బెట్టింగులకు దిగారు. హైదరాబాదు నగరం నుంచి వచ్చిన వ్యాపారవేత్త ఒకరు 50 లక్షల నగదును సంక్రాంతి ఒక్కనాడే కోడి పందేల్లో బెట్టింగ్‌ కాశారు. లండన్‌ నుంచి వచ్చిన అతిథి ఒకరు తన అదృష్ట సంఖ్య తొమ్మిదితో తొమ్మిది లక్షలు కాసి గెలుపొందడం విశేషం. రాయచోటి నుంచి వచ్చిన వరలక్ష్మి అనే మహిళ మూడు పందేల్లో రూ.11 లక్షలు పందెంగా కాశారు. ఇలా ఎక్కడికక్కడ నగదు విచ్చలవిడిగానే సాగింది. ఇక కోసాట విషయానికొస్తే చెప్పనక్కర్లేదు. 500 నోట్లు వెల్లువలా జారిపడ్డాయి. ప్రతీ పందెం బరిలోను కోసాట ఒక్కో రోజు 35 లక్షల నుంచి 45 లక్షల మేర సాగాయి. కొన్నిచోట్ల అనుకున్న విధంగా జనం రాకపోవడంతో నిరాశపడ్డారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కోడి పందేల్లోనే సుమారు రూ.390 కోట్ల వరకు చేతులు మారగా, పేకాటలోనూ పెద్ద మొత్తంలోనే చేతులు మారింది. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం సొమ్ము మూడు రెట్లు అధికం. ఇక గుండాట విషయంలో చెప్పనక్కర్లేదు.

కోడికి రూ.100

పందెంలో ఓడిన కోడిని మాంసంగా మార్చే ముందు శుభ్రం ఒక్కో దానికి చేసేందుకు రూ.100 వసూలు చేశారు. గత ఏడాది రూ.20 తీసుకోగా.. ఇప్పుడు పెంచేశారు. సెలవులు కావడంతో చదువుకునే పిల్లలు ఎక్కువగా ఈ పనిని ఎంచుకున్నారు. పండుగ ఖర్చులకు వారే సంపాదించుకున్నారు.

టెంట్‌లు, కుర్చీలకు డిమాండ్‌

సంక్రాంతి పేరుతో టెంట్‌లు కుర్చీలు, బల్లలకు డిమాండ్‌ ఏర్పడింది. కోడి పందేలు బరులు, పేకాట కేంద్రాలు ఏర్పాటుకు టెంట్‌లు, కుర్చీలు, బల్లలు అవసరం. షామియానా దుకాణాల్లో ముందుగానే బుక్‌ చేసుకున్నారు. టెంట్‌లకు భారీ ధరలు పలికాయి.

కోజాకు డిమాండ్‌

పందెంలో ఓడిపోయి చనిపోయిన కోడిని కోజాగా పిలుస్తారు. పందేలకు ముందు పందెగాళ్లు వీటికి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, కైమా వంటి బలవర్దకమైన ఆహారాన్ని అందిస్తారు. దీనివల్ల మంచి రుచి వస్తుందని వీటి కోసం మాంసం ప్రియులు ఎగబడుతుంటారు. ఒక్కో కోజా రూ. 3000 నుంచి రూ.10 వేల వరకు పలికింది. ఏలూరు శివారులో రూ.15 వేలు పలకడం విశేషం.

బరుల దగ్గర

దొంగల హల్‌చల్‌...

కోడిపందేల బరుల వద్ద దొంగలు హల్‌చల్‌ చేశారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెం బరుల్లో జేబు దొంగలు చేతివాటం చూపారు. పెదతాడేపల్లి బరి వద్ద తెలంగాణ నుంచి వచ్చిన వారి కారు అద్దాలు పగలగొట్టి కారులో నగదు అపహరించే ప్రయత్నం చేసిన దొంగ లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పందే లకు వచ్చిన వారి నుంచి సుమారు లక్షన్నరకు పైగా నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లను చోరీ చేసినట్టు బాధితులు వాపోయారు. దీంతో తాడేపల్లిగూడెం బరిలో దొంగలను పట్టించిన వారికి రూ.50 వేల నగదు అందిస్తామని నిర్వాహకులు ప్రకటించడం కొసమెరుపు.

Updated Date - Jan 16 , 2025 | 01:14 AM