మృత్యువును గెలవలేక..
ABN, Publish Date - Apr 05 , 2025 | 12:25 AM
కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఉద్యోగి లైంగిక వేధింపులతో ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నల్లపు నాగాంజలి శుక్రవారం మృతిచెందింది.

13 రోజులుగా చికిత్స పొందుతున్న ఫార్మాసిస్ట్ నాగాంజలి మృతి
రాజమహేంద్రవరం ఆస్పత్రి నుంచి భౌతిక కాయం స్వగ్రామానికి తరలింపు
రౌతుగూడెంలో విషాదం..
నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న గ్రామస్థులు
ఒక్కగానొక్క కూతురు.. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పుట్టిన బిడ్డ. పేద కుటుంబమైనా అపురూపంగా చూసుకుని.. ఉన్నత చదువు కోసం పట్టణం పంపిం చారు. అక్కడ మోసగాడి చేతికి చిక్కి విలవిల్లాడింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 13 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. తల్లిదండ్రులకు కుమార్తె మృతి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.
జీలుగుమిల్లి / రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఉద్యోగి లైంగిక వేధింపులతో ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నల్లపు నాగాంజలి శుక్రవారం మృతిచెందింది. 13 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. ఆమె మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ప్రైవేట్ అంబులెన్సులో నాగాంజలి మృతదేహాన్ని స్వగ్రామమైన జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం తరలించారు. నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అత్యంత సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రికి వచ్చారు. నాగాంజలి తండ్రి దుర్గారావును పరామర్శించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, ఐద్వా, మహిళా సంఘం నాయకులు ప్రభుత్వ బోధనాసుపత్రికి చేరుకున్నారు.
తీరని విషాదం
రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి లో ఇంటర్న్‌షిప్‌లో ఉన్న నాగాంజలి కొద్ది రోజు ల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తుందను కుంటే విగతజీవిగా రావడం రౌతుగూడెంలో తీవ్ర విషాదం నింపింది. వికాస్ ఫార్మసీ కళాశా లలో ఫార్మాడి ఫైనలియర్ చదువుతోంది. ఇంట ర్న్‌షిప్ లో భాగంగా కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో 9 నెలలుగా ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తుంది. బొల్లినేని ఆస్పత్రిలో మెడికల్ కోఆర్డినేటర్ దువ్వాడ మాధవరావు దీపక్ ఆమెను పెళ్లి చేసు కుంటా నని నమ్మించి మోసం చేశాడు. మనస్తాపం చెందిన నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మృత దేహం గ్రామంలోకి చేరగానే గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నాగాంజలి కుటుంబానికి న్యాయం చెయ్యాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
నేతల పరామర్శ
నాగాంజలి తల్లిదండ్రులు నల్లపు దుర్గారావు, అనంతలక్ష్మిని ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివా సులు, టీడీపీ మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శ్యామలారాణి, మండల మహిళా సంఘాల నాయకులు ఎన్.నిర్మల, కె.దుర్గ, సీపీఎం మం డల కార్యదిర్శి తెల్లం దుర్గారావు సమీప గ్రామా ల వారు పలువురు పరామర్శించారు. కుటుంబా నికి అండగా ఉంటామన్నారు. వికాస్ కళాశాల ప్రిన్సిపాల్, రాచన్నగూడెం, ములగలంపల్లి, అ శ్వారావుపేట, ఆసుపాక గ్రామాల వారు నాగాం జలి మృతదేహానికి నివాళులర్పించారు. రౌతుగూ డెంలో అంవాఛనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా డీఎస్పీ బి.వెంకటేశ్వరావు, సీఐ బి.వెంక టేశ్వరావు, ఎస్సైలు నవీన్‌కుమార్, విజయ్‌బాబు, మహేశ్వరావు శాంతిభద్రతలు పర్యవేక్షించారు.
పుట్టెడు దుఃఖంలో తండ్రి
ఆసుపత్రి వద్ద నాగాంజలి తండ్రి దుర్గారావు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన పరిస్థితి చూసి అక్కడున్న వారు కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తెకు జరిగిన అన్యాయం, దిగులు ఎవరితో పంచుకోలేక, బాధ, ఆవేదన తనలోనే దిగమింగుకుని నిస్సహాయంగా ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకింద దిగాలుగా కూర్చోవడం అందరినీ కలచివేసింది. కూతురి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుంటే దుర్గారావు మౌనంగా రోదిస్తూ ఒంటరిగా ఉండిపోయారు.
వాడిని కఠినంగా శిక్షించాలి..
మా పాపకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. వాడిని కఠినంగా శిక్షించాలి.. ఇది మా కోరిక. ప్రభుత్వం తరపున సహకారం అందుతుంది. మా పాప పరిస్థితి ఎవరికీ రాకూడదంటే వాడిని కఠినంగా శిక్షించాల్సిందేనని దుర్గారావు అన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 12:25 AM