ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:30 AM
ఆర్టీసీలో 2020 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి ఈహెచ్‌ఎస్ ద్వారా వైద్య సేవలు పొందేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా జిల్లాలో 150 మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. 2020లో ఆర్టీసీని అప్పటి జగన్ సర్కార్ ప్రభుత్వంలో విలీనం చేసింది.
మేలు చేసిన కూటమి ప్రభుత్వం
ఈహెచ్‌ఎస్ ద్వారా వైద్యసేవల పునరుద్దరణ
భీమవరం టౌన్, జనవరి 9(ఆంధ్రజ్యోతి):ఆర్టీసీలో 2020 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి ఈహెచ్‌ఎస్ ద్వారా వైద్య సేవలు పొందేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా జిల్లాలో 150 మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. 2020లో ఆర్టీసీని అప్పటి జగన్ సర్కార్ ప్రభుత్వంలో విలీనం చేసింది. కార్పొరేషన్‌లోని వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆశపడ్డారు. కాని, 2020 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇకపై ఈహెచ్‌ఎస్ ఉండదని చెప్పడంతో నిరాశ చెందారు. వారంతా సొంత ఖర్చులతోనే వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి. అసలే పెన్షన్ తక్కువ. పైగా వైద్య సదుపాయం రద్దుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు పదవీ విరమణ సమయంలో ఉద్యోగి నుంచి కొంత సొమ్మును ఈహెచ్‌ఎస్‌కు కట్టించుకుని భార్యాభర్తలకు రెండు లక్షల 50 వేల వరకు వైద్య ఖర్చులు భరించి సేవలందించేవారు. విలీనం తర్వాత దానిని రద్దు చేయడంతో అయోమయంగా మారింది. అంతకు ముందు ఉద్యోగ విరమణ చేసిన వారికి ఈ సేవలు యధావిధిగా అందుతున్నాయి. ఈ సమస్యలపై యూనియన్ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారు.
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వారికి ఊరటనిచ్చే విషయమని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్‌ఎస్ రావు తెలిపారు. ఐదేళ్లుగా వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చులు చేసుకునే పరిస్థితిలో ఈహెచ్‌ఎస్ సౌకర్యం కల్పిం చడం ఆనందంగా ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jan 10 , 2025 | 12:30 AM