క్షయ మహమ్మారి భయం లేదు

ABN, Publish Date - Mar 24 , 2025 | 12:26 AM

శరీరానికి అవసరమైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యం. బలవర్ధక ఆహారం తీసుకోకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.

క్షయ మహమ్మారి భయం లేదు
క్షయ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ (ఫైల్‌)

ప్రభుత్వాసుపత్రిలో టీబీ పరీక్షలు

రోగులకు ఉచిత వైద్యం, మందులు

నెలకు రూ.వెయ్యి ఆర్థిక సాయం

పోషకాహారంతో వ్యాధికి చెక్‌

నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు

ఉమ్మడి జిల్లాలో వ్యాధి తగ్గుముఖం

శరీరానికి అవసరమైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యం. బలవర్ధక ఆహారం తీసుకోకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. పీల్చే గాలి ద్వారా కూడా వ్యాధులు ప్రబలి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. వేగవంతంగా సోకే వ్యాధి టీబీ (ట్యూబర్‌ క్యులోసిస్‌ బ్యాక్టీరియా). గాలిలో ఉండే సూక్ష్మక్రిములను పీల్చుకోవడం వల్ల క్షయ వ్యాధి సోకుతుంది. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు వెయ్యి మంది క్షయతో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1962లో భారత ప్రభుత్వం క్షయ నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఏలూరు క్రైం/భీమవరం క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): గాలిలో బ్యాక్టీరియా ద్వారా క్షయ వ్యాధి సోకుతుంది. గతంలో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో టీబీ తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ వ్యాధి త్వరి తగతిన సోకుతుందని, వ్యాధి ఉన్న వారు పౌష్టి కాహారం తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యంగా జీవించగలరని వైద్యులు చెబుతున్నారు. పీహెచ్‌ సీ, ప్రభుత్వాసుపత్రిలో క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ట్రూనాట్‌ మిషన్లు, సైటిబి టెస్ట్‌, సీబీనట్‌ వంటి నాలుగు విధానాల్లో వ్యాధిని స్పష్టంగా నిర్ధారిస్తున్నారు.

క్షయ వ్యాధి పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి టీబీ విముక్తి భారత్‌ పథకాన్ని చేపట్టింది. దాతల సహకారాన్ని కోరిం ది. టీబీ బాధితులకు దాతలు నేరుగా పౌష్టికాహా రం అందించవచ్చు. రోగికి ఆరు నెలల పాటు ఆహారం అందించడానికి జిల్లా టీబీ కంట్రోల్‌ అధికారులు లేదా సిబ్బందిని సంప్రదించాలి.

క్షయ వ్యాధి లక్షణాలు

రెండు వారాలు మించి దగ్గు ఎక్కువగా ఉండడం, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గితే క్షయ వ్యాధి పరీక్ష చేయించుకోవాలి.

దగ్గినప్పుడు కళ్లెలో రక్తపు మరకలు కనిపిస్తాయి.

ఈ వ్యాధి గోర్లు, తల వెంట్రుకలు మినహా ఎక్కడైనా రావచ్చు.

ఎక్కువగా ఛాతీ భాగంలో ఈ వ్యాధి ఉంటుంది. కొంతమందికి బ్రెయిన్‌లో కూడా వస్తుంది.

క్షయ బాధితుడితో ఎక్కువ సమయం గడిపితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకుతుంది.

ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు ఉన్నవారికి, అలాగే హెచ్‌ఐవి పాజిటివ్‌నకు టీబీ తొందరగా సోకే ప్రమాదముంది.

నివారణ ఇలా..

సాధారణంగా టీబీ సోకిన వారు ఆరు నెలల పాటు మందులను వాడాలి. ఆరు నెలల కు కూడా టీబీ తగ్గకపోతే అదనంగా మూడు విధానాల్లో ఈ మందువాడే ప్రక్రియను చేపడ తారు. హెచ్‌మోనో ఆరు నెలల నుంచి 9 నెలల వరకూ, ఎస్‌ఒబి 9 నెలల నుంచి 11 నెలలు, ఎఓఎల్‌ 18 నుంచి 24 నెలల పాటు మందులను వాడిస్తారు. క్షయ బాధితులకు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం నెలకు రూ. 500 చొప్పున ఆరు నెలల పాటు రూ.3 వేలు అందజేసే వారు. 2024 నవంబర్‌ నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నారు.

ఏలూరు జిల్లాలో 11 యూనిట్లు

ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్షయ నివారణ కార్యాలయం ఉంది. జిల్లాలో 11 ట్రీట్‌ మెంట్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో నిత్యం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 30 నుంచి 35 మంది వరకూ పరీక్షలకు వస్తున్నారు. 2023 లో 72 వేల మందిని పరీక్షించి 2942 మందికి, 2024లో 62,945 మందిని పరీక్షించి 2,752 మందికి టీబీ సోకినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 2675 మందికి పరీక్షించగా 555 మందికి టీబీ సోకినట్లు గుర్తించారు. నూజివీడు, లింగపాలెం, కుక్కునూరు, భీమడోలు మండ లాల్లో ఎక్కువగా టీబీ కేసులు ఉన్నట్లు తేలింది. జిల్లాలో క్షయ వ్యాధి లేని పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి 2023లో 21గ్రామ పంచాయతీలు, 2024లో 37 గ్రామ పంచాయతీలను గుర్తిం చారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా క్షయ వ్యాధిని పూర్తిగా నివారించడానికి ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు.

పశ్చిమలో 8 సెంటర్లు

పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 సెంటర్లలో టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 3,250 మంది క్షయ బాధితు లు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 90 మంది వైద్యులు పలు సీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో క్షయ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్షయ వ్యాధి సోకినవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకుని మందు లు వాడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేయడం వల్ల కుటుంబంలో వారికి కూడా వ్యాధి సోకి అవస్థలు పడక తప్పదు.

ఉచితంగా మందులు

భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తున్నాం. నిత్యం సుమా రు 50 మంది భీమవరం ప్రభుత్వాసుపత్రికి మందుల కోసం వస్తుంటారు. క్షయవ్యాధి ఉన్నట్లు అనుమానం కలిగితే వెంటనే పరీక్షలు చేయించుకుని మందులు వాడడం చాలా మంచిది. నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

డాక్టర్‌ మాధవీ కల్యాణి, భీమవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌

క్షయ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

క్షయ వ్యాధి నివారణ కోసం పూర్తిస్థాయిలో ర్యాండమ్‌ సర్వే నిర్వహిస్తున్నాం. బాధితులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా క్షయ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాలు లేదా టీబీ నిర్ధారణ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మందులున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. పరిశుభ్రత పాటించాలి. వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా తగిన ఆహారం తీసుకోవాలి. వ్యాధి సోకిన వారు ఆరు నెలల పాటు మందులను వాడాలి. కుటుంబంలో ఒక క్షయ బాధితుడు ఉంటే మిగిలిన వారికి సోకకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నాం.

డాక్టర్‌ ఎం.నాగేశ్వరరావు, క్షయ నివారణాధికారి, ఏలూరు జిల్లా

Updated Date - Mar 24 , 2025 | 12:26 AM