WhatsApp governance: ప్రతి ఇంటికీ వాట్సాప్ గవర్నెన్స్-మనమిత్ర
ABN, Publish Date - Mar 26 , 2025 | 05:03 AM
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 9552300009 నంబర్ సేవ్ చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్లకు ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సూచించారు. ప్రస్తుతం 210 సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే 350 సేవలు అందనున్నాయి.

9552300009 నంబర్‌ను సేవ్ చేసుకోండి
ప్రజల్లో అవగాహన కోసం కలెక్టర్లు చొరవ తీసుకోవాలి
మరో 15 రోజుల్లో 350 సేవలు అందిస్తాం
ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ వాట్సాప్ గవర్నెన్స్-మన మిత్ర సేవలు అందుతాయని, ప్రజలు అందరూ 9552300009 సేవ్ చేసుకునేలా కలెక్టర్లు విస్తృత ప్రచారం చేయాలని ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ చెప్పారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం కలెక్టర్ల సదస్సు తొలిరోజున వాట్సాప్ గవర్నెన్స్‌పై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు జిల్లాల్లో కలెక్టర్లు చేపట్టాలన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం 210 ప్రభుత్వ సేవలు అందుతున్నాయని, మరో 15 రోజుల్లో 350 సేవలు అందుతాయని భాస్కర్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోం కార్యక్రమం కార్యాచరణ దాదాపు పూర్తయిందని వెల్లడించారు. ఎవరెవరికి ఏయే విద్యార్హతలు ఉన్నాయో వర్గీకరణ చేశామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక సర్వేను నిర్వహించామన్నారు. యువత నైపుణ్య స్థాయిని బట్టి వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా ఇస్తామన్నారు. జిల్లాల్లో నిర్మిస్తున్న ఆర్టీజీఎస్ భవనాల పరిరక్షణకు కూడా కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని భాస్కర్ ఆదేశించారు.
Updated Date - Mar 26 , 2025 | 05:03 AM