YCP: అంబేడ్కర్ సెంటిమెంట్‌తో అలజడి రేపేందుకు వైసీపీ కుతంత్రం
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:29 AM
వైసీపీ 2019లో ఫేక్ ప్రచారాలతో లాభం పొందింది. 2024లో కూడా అదే పంథాలో మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఐ-ప్యాక్ మద్దతుతో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది.

మళ్లీ వైసీపీ విద్వేష క్రీడ
కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం
2019 ఎన్నికల ముందు అబద్ధాలతో అందలం
2024 ఓటమి తర్వాత మళ్లీ కుట్ర రాజకీయం
జనంలోకి ఐ-ప్యాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు
హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం
తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం
అంబేడ్కర్ సెంటిమెంట్‌తో కులాల చిచ్చు
శాంతిభద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం
అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
2019 ఎన్నికల ముందు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసి, విద్వేషాలు రెచ్చగొట్టింది. ఐ-ప్యాక్ డైరెక్షన్‌లో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఆ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టకుండా లైట్‌గా తీసుకోవడమూ దాని ఓటమికి ఓ కారణం.
2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఇప్పుడు మళ్లీ పాత ‘వ్యూహాల’కు పదును పెడుతోంది. ఐ-ప్యాక్ మార్క్ ప్రచారాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సున్నితమైన మత, కులపరమైన అంశాల్లో చిచ్చు రేపాలని చూస్తోంది. ఇందుకు ప్రముఖ వ్యక్తులు, మతాలు, ఆలయాలను వాడుకుంటోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో ఉన్న పింక్ డైమండ్‌ను చంద్రబాబు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారంటూ విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రచారం చేశారు. బూందీపోటులో తవ్వకాలు చేసి సంపద దోచుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇవన్నీ అసత్యాలని తర్వాత తేలింది. అయితే టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ లబ్ధిపొందింది. ఇప్పుడు అదే పంథాలో కుల, మత, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు వైసీపీ ముఠా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఫేక్ పోస్టులు పెడుతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
విధ్వంసక రచన
పాస్టర్ ప్రవీణ్ మృతిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో హిందువులపైకి క్రైస్తవులను రెచ్చగొట్టాలని వైసీపీ ప్రయత్నించింది. వైసీపీ నేత జాన్ బెన్నీ లింగం... హిందువులను ఊచకోత కోస్తానంటూ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్‌ను హత్య చేశారంటూ జూపూడి ప్రభాకర్ కూడా రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆయన మృతిని అడ్డు పెట్టుకుని లబ్ధిపొందాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో వైసీపీ పట్ల హిందువులలో వ్యతిరేకత రాకుండా జగన్ అర్జెంటుగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తారు. గత వారంలో ఒకే రోజున జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడంటూ సోషల్ మీడియాలో 40కి పైగా పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
వైసీపీ నేతలు ఓవైపు హిందువులపైకి క్రైస్తవులను రెచ్చగొడుతూనే.. మరోవైపు ప్రభుత్వం పట్ల హిందువులలో వ్యతిరేకత కలిగించేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టీటీడీ గోశాలలో మూడు నెలల్లో వంద గోవులు మరణించాయని ఆ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ కూడా అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అనంతపురం జిల్లా హనకనహాళ్‌లో రాములోరి రథానికి టీడీపీ నేతలు నిప్పంటించారంటూ వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. గ్రామస్థులు గుర్తించడంతో వ్యవహారం సద్దుమణిగేలా టీడీపీ పెద్దల మంతనాలు చేశారంటూ అసత్యాలు వ్యాపింపజేసింది. చివరకు పోలీసుల విచారణలో వైసీపీ కార్యకర్త ఈశ్వర్ రెడ్డి ఈ పని చేశారని తేలింది. అతడ్ని అరెస్టు చేశారు.
టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయంటూ తాజాగా వైసీపీ విష ప్రచారం చేసింది. జగన్ రోత పత్రిక దీన్ని రక్తి కట్టించింది. 3 నెలలుగా ఆవులు మరణిస్తుంటే జగన్ పత్రికలో ఎందుకు రాయలేదు? ఈ విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయింది? స్థానిక వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు?
ఇప్పుడే విషయం తెలిసినట్టుగా వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో హడావుడి చేశారు. గోశాలలో 100 ఆవులు మరణించాయని చెబుతూ, సాక్ష్యంగా ఫొటోలు కూడా చూపించారు. అయితే, ఆయన చూపించిన పలు ఆవుల కళేబరాల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు. ఎక్కడెక్కడివో ఫొటోలు చూపించి నమ్మబలికే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్ర చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
ఆసాంతం కుట్రలు, అబద్ధాలే
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైసీపీ కుట్రలు, అబద్ధాలనే నమ్ముకుంది. 2019 ఎన్నికల ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఎన్నో అసత్యాలు ప్రచారం చేసింది. కుల, మత, ప్రాంతాలపరంగా చీలికలు తెచ్చేందుకు యత్నించింది. సీఎం అయ్యాక కూడా జగన్ తీరులో మార్పు రాలేదు. ఎన్నో అబద్ధాలు చెప్పారు. మూడు రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. ముద్రగడ, హరిరామజోగయ్యను అడ్డం పెట్టుకుని కుల విద్వేషాలకు కుట్రలు చేశారు. వైసీపీ అసలు స్వరూపాన్ని తెలుసుకున్న ప్రజలు 2024 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్న జగన్ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. శాంతిభద్రతల నిప్పు రాజేసి రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలని చూస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ఇలాంటి ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. ప్రజలకు వాస్తవాలను వివరించి అప్రమత్తం చేయాలి.
అంబేడ్కర్ సెంటిమెంట్‌తో ఆటలు
ఇటీవల తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారని, ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందంటూ వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించింది. కానీ పోలీసుల విచారణలో వైసీపీ నాయకుడే ఈ పని చేశారని తేలింది. పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి అరెస్టు కూడా చేశారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేసిన ఘటన జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి ముందే సమాచారం ఉంది.
ఎస్సీ వర్గీకరణపై గప్‌చుప్
రాజీవ్ రంజన్ మిశ్రా సారథ్యంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మార్చిలో రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దానిపై ఇప్పటి వరకు నేరుగా స్పందించని వైసీపీ దొంగచాటుగా మతం పేరుతో, అంబేడ్కర్ సెంటిమెంట్‌తో ఎస్సీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
వక్ఫ్ బిల్లుపై దొంగాట
వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా వైసీపీ ద్వంద్వ వైఖరి పాటించింది. ఎన్డీయేకు బలమున్న లోక్‌సభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. కానీ ఎన్డీయేకు సంఖ్యాపరంగా తక్కువ మంది ఉన్న రాజ్యసభలో మాత్రం విప్ జారీ చేయకుండా దొంగాట ఆడింది. ఎన్డీయే కూటమి లేకున్నా వైసీపీ వక్ఫ్ బిల్లు విషయంలో లోక్‌సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా వ్యవహరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News