Yelamanchili: పండగ పిలుస్తోంది.. పోదాం పదండి!
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:20 AM
రండి రండి రండీ... దయచేయండీ.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ! అంటూ సంక్రాంతి సంబరాలకు అందరినీ ఆహ్వానిస్తోంది యలమంచిలి గ్రామం.
మూడు రోజులూ ఆటపాటలూ... విందూ వినోదం
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో వేడుకలు
యలమంచిలి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రండి రండి రండీ... దయచేయండీ.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ! అంటూ సంక్రాంతి సంబరాలకు అందరినీ ఆహ్వానిస్తోంది యలమంచిలి గ్రామం. పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలిలో సంక్రాంతి సంబరాల రేంజే వేరు. పండుగ మూడు రోజులూ ఎంజాయ్.. ఆడండి... పాడండి.. తినండి... అంతులేని ఆనందాన్ని పొందండి... అంటూ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. నాలుగేళ్లుగా ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలను విన్నూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. స్థానికులతోపాటే.. వారి బంధువులు, వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినవారు, చుట్టుపక్కల గ్రామాలు.. ఇలా రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరైనా ఆహ్వానితులే! ఇందుకు ఇక్కడి శ్రీమూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం వేదిక కానుంది. రోజుకు సుమారు 15వేల మంది వస్తారనే అంచనాతో సర్వం సిద్ధం చేశారు. ఫొటోషూట్, సెల్ఫీలు తీసుకోవడానికి 27 రకాల పూలతో కూడిన వివిధ ఆకృతులను సిద్ధం చేశారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసే అతిథుల కోసం ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం నాన్‌వెజ్ భోజనాలు, టీ, స్నాక్స్ సిద్ధం చేస్తున్నారు. సున్నుండలు, పూతరేకులు, పాకుండలు, కజ్జికాయలు, బెల్లం గవ్వలు తదితర 27 రకాల స్వీట్స్‌ను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం భోగి మంట వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. మూడు రోజులూ జబర్ధస్త్ టీం కామెడీ స్కిట్లు, ఢీ ఫేం డాన్సర్ల ఆటపాటలు, సంగీతవిభావరులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మహిళలు, చిన్నారులు, యువత కోసం వేర్వేరు విభాగాల్లో వివిధ ఆటలపోటీలు నిర్వహిస్తారు. విజేతలకు 9 గోల్డ్, సిల్వర్ కాయిన్స్‌తోపాటూ మరెన్నో బహుమతులుగా అందజేస్తామని నిర్వాహకులు తాళ్లూరి శ్రీనివా్‌స(బుజ్జి) తెలిపారు.
Updated Date - Jan 13 , 2025 | 03:20 AM