Quartz mining scam: కాకాణి అల్లుడూ డుమ్మా
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:05 AM
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఆయన అల్లుడు గోపాలకృష్ణారెడ్డి పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించలేదు. విచారణకు హాజరుకావలసిన రోజు గోపాలకృష్ణారెడ్డి కనిపించకపోగా, కాకాణి ఇప్పటికే మూడు సార్లు డుమ్మా కొట్టారు.

పోలీసుల ముందుకురాని గోపాలకృష్ణారెడ్డి
ఇప్పటికీ పత్తాలేని మాజీమంత్రి
నెల్లూరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డే కాదు.. ఆయన అల్లుడు గోపాలకృష్ణారెడ్డి కూడా పోలీసుల ముందుకు రావడం లేదు. సోమవారంనాటి విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. కాకాణి సన్నిహితుడైన కాంట్రాక్టర్ ఊరబిండి ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు చైతన్యలు కలిసి ఒక లాజిస్టిక్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరుతో వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ వద్ద 50 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా తీసుకున్నారు. ఈ భూమి కొనుగోలుకు అవసరమైన డబ్బు కాకాణి అల్లుడి నుంచే వచ్చిందన్నది అభియోగం. దీనికి బలం చేకూరుస్తూ ఈ లాజిస్టిక్ కంపెనీకు సీఈవోగా గోపాలకృష్ణారెడ్డి వచ్చి చేరారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురికీ పోలీసు లు ఆదివారం నోటీసులిచ్చి.. సోమవారం విచారణకు రమ్మన్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు ప్రభాకర్‌రెడ్డి మాత్రమే హాజరయ్యారు. పోలీసులు గంటపాటు ఆయన్ను ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. తనకు ఆరోగ్యం బాగోలేదని, మరోరోజు విచారణ కు వస్తానని చైతన్య పోలీసులకు తెలియజేయగా.. గోపాలకృష్ణారెడ్డి మా త్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇంకోవైపు.. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికి 3 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినా కాకాణి హాజరుకాలేదు. అసలు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు.