ఇండియాఏఐతో మైక్రోసాఫ్ట్ జట్టు
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:51 AM
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కృత్రిమ మేధ (ఏఐ) ప్రాజెక్ట్ ‘ఇండియాఏఐ’తో అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో దేశంలోని విద్యార్థులు, టీచర్లు, డెవలపర్లు, ప్రఽభుత్వ అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలు...
2026 నాటికి 5 లక్షల మందికి ‘ఏఐ’లో శిక్షణ
మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ చందోక్ వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన కృత్రిమ మేధ (ఏఐ) ప్రాజెక్ట్ ‘ఇండియాఏఐ’తో అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో దేశంలోని విద్యార్థులు, టీచర్లు, డెవలపర్లు, ప్రఽభుత్వ అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలు సహా మొత్తం 5 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ వెల్లడించారు. ‘‘భారత్‌లో 20 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు గత ఏడాదే ప్రకటించాం. ఇప్పటికే 24 లక్షల మందికి శిక్షణ అందించాం. వచ్చే ఐదేళ్లలో కోటి మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించడం జరిగింది. ఇందుకోసం ఇండియాఏఐ మిషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకు న్నాం. ఈ ఒప్పందంలో భాగంగా 5 లక్షల మందికి శిక్షణ అందిస్తాం’’ అని చందోక్ పేర్కొన్నారు. తాజా ఒప్పందంలో భాగంగా మైక్రోసాఫ్ట్ 10 రాష్ట్రాలోని 20 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎన్‌ఎ్‌సటీఐ), ఎన్‌ఐఈఎల్‌ఐటీ సెంటర్లలో ఏఐ ప్రొడక్టివిటీ ల్యాబ్స్‌ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది.
ఈ కేంద్రాల ద్వారా 20,000 మంది టీచర్లకు ఏఐ ఫండమెంటల్స్ శిక్షణ ఇవ్వడంతోపాటు 200 ఐటీఐల్లో 1,00,000 మంది విద్యార్థులకు ఫౌండేషన్ ఏఐ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే, ‘ఏఐ క్యాటలిస్ట్స్’ పేరుతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు చందోక్ వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా గ్రామాల్లో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు లక్ష మంది ఏఐ డెవలపర్లకు మద్దతివ్వనున్నారు. సమాజానికి పనికివచ్చే పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహించనున్నారు.
సరికొత్త ఆవిష్కరణల కోసం
కృషి చేయాలి: నాదెళ్ల
కృత్రిమ మేధలో సరికొత్త ఆవిష్కరణల కోసం భారత్ కృషి చేయాలని, సొంత ఫౌండేషనల్ మోడల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సారథి సత్య నాదెళ్ల అన్నారు. కానీ, ఇందుకు పెట్టుబడుల లేమి ప్రధాన అవరోధమని, ఒక్క పురోగతి మొత్తం స్థితిగతులను మార్చగలదన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఏఐ టూర్ రెండో రోజు (బుధవారం) నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషలు, ఏఐ ద్వారా పారిశ్రామిక పరివర్తనం అంశాల్లో భారత్ గొప్పగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం భారత్ గూగుల్, ఓపెన్ ఏఐ తదితర సంస్థలు అభివృద్ధి చేసిన ఏఐ ఇంజన్లు లేదా ఫౌండేషనల్ మోడల్స్‌ను ఉపయోగించుకుంటోంది.
Updated Date - Jan 09 , 2025 | 01:52 AM