India Shrimp Exports: 40 వేల టన్నుల రొయ్యల ఎగుమతులకు సన్నాహాలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:40 AM
అమెరికా ట్రంప్ సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేసిన నేపథ్యంలో, భారత రొయ్యల ఎగుమతిదారులు 40 వేల టన్నుల రొయ్యలను ఎగుమతించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో నిలిపివేసిన ప్రాసెసింగ్ పునఃప్రారంభమైంది

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో దేశానికి చెందిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు 35 వేల నుంచి 40 వేల టన్నుల రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రంప్ సుంకాల ప్రభావంతో కొద్ది కాలం క్రితం నిలిపివేసిన రొయ్యల ప్రాసెసింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్టు సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం సెక్రటరీ జనరల్ కేఎన్ రాఘవన్ తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయం ఫలితంగా గతంలో నిలిపివేసిన రెండు వేల కంటైనర్లను ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం భారత రొయ్యలపై అమెరికా 17.7% సుంకాలు విధిస్తోంది. 5.7% కౌంటర్ వీలింగ్ సుంకం, 1.8% యాంటీ డంపింగ్ సుంకం కూడా అందులో భాగంగా ఉన్నాయి. భారత రొయ్యలకు అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికా నుంచి ఆర్డర్లు ఏ మాత్రం తగ్గలేదని ఆ సంస్థ చెబుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 270 కోట్ల డాలర్ల విలువ గల రొయ్యలను ఎగుమతి చేసింది.