పర్సనల్‌ లోన్‌.. తనఖా రుణం ఏది బెటర్‌!

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:13 AM

వ్యక్తిగత రుణాలతో పాటు తనఖా రుణాలకూ కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం కూడా. ఈ రెండింటి ప్రత్యేకతలను స్పష్టంగా అర్ధం చేసుకోగలిగితే, ఎంపిక సులభమవుతుంది...

పర్సనల్‌ లోన్‌..  తనఖా రుణం  ఏది బెటర్‌!

వ్యక్తిగత రుణానికి తాకట్టు అవసరం లేదు. రుణమూ త్వరగానే లభిస్తుంది. కానీ, వడ్డీయే కాస్త ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తనఖా రుణాలపై వడ్డీ తక్కువ. పెద్ద మొత్తంలో రుణం తీసుకోవచ్చు. కాకపోతే, ఏదైనా ఆస్తి తాకట్టు పెట్టాల్సిందే. పైగా ప్రహసనంతో కూడిన ప్రక్రియ. మరి ఏది సరైనది..? అంటే, మీ అవసరం, పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత రుణం తీసుకోవాలా..? తనఖా రుణం కోసం ప్రయత్నించాలా..? అనే సందిగ్ధ స్థితిలో ఉన్నవారు సరైన ఎంపిక చేసుకోవడానికి పరిగణనలోకి తీసుకో వాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం..

వ్యక్తిగత రుణాలతో పాటు తనఖా రుణాలకూ కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం కూడా. ఈ రెండింటి ప్రత్యేకతలను స్పష్టంగా అర్ధం చేసుకోగలిగితే, ఎంపిక సులభమవుతుంది. అలాగే, మీ ఆర్థిక అవసరాన్ని, క్రెడిట్‌ స్కోర్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.


వ్యక్తిగత

రుణం

ఇది తనఖారహిత రుణం. అంటే, ఈ రుణం కోసం ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రుణాలను మీ క్రెడిట్‌ స్కోర్‌, హిస్టరీ ఆధారంగా మంజూరు చేస్తారు. ఇందులో రుణదాతకు రిస్క్‌ ఎక్కువ. అందుకే, అధిక వడ్డీ వసూలు చేస్తారు. తాకట్టు అవసరం అవసరం లేకపోవడం, త్వరితగతిన రుణ మంజూరు, తీసుకున్న సొమ్మును ఏ అవసరానికైనా ఉపయోగించుకోగలిగే వెసులుబాటు ఈ రుణ అనుకూలతలు. మిగతా రుణాలతో పోలిస్తే అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం ప్రతికూలమే. మీ ఆదాయం, పరపతి స్థాయి, క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ ఆధారంగానే మీకు ఎంత రుణం మంజూరు చేయవచ్చనే అంశాన్ని రుణదాత నిర్ణయిస్తారు. ఆదాయం తక్కువగా ఉంటే మీరు ఆశించినంత రుణం లభించకపోవచ్చు. క్రెడిట్‌ స్కోర్‌ అంత బాగా లేని పక్షంలోనూ అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైగా, రుణ మొత్తంలోనూ రాజీ పడాల్సిందే.


తనఖా రుణం

ఇది తాకట్టుపై లభించే రుణం. ఇందుకోసం రుణగ్రహీత తనకు చెందిన ఏ ఆస్తినైనా తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఏదైనా స్థిరాస్తి కొనుగోలుకు లేదా ప్రస్తుత ప్రాపర్టీని తాకట్టు పెట్టి నిధులు సమీకరించేందుకు ఈ రుణాన్ని ఎంచుకుంటారు. దీని సానుకూలత విషయానికొస్తే, ఇందులో రుణదాతకు నష్ట భయం తక్కువ. కాబట్టి వ్యక్తిగత రుణంతో పోలిస్తే కాస్త తక్కువ వడ్డీకే లభిస్తుంది. ఆస్తి విలువ ఆధారంగా రుణమిస్తారు కాబట్టి, అధిక మొత్తంలో సొమ్ము లభించే అవకాశం ఉంటుంది. పైగా, తనఖా రుణాల తిరిగి చెల్లింపులకూ చాలా సంవత్సరాలు సమయం లభిస్తుంది. తద్వారా తక్కువ మొత్తంలో నెలవారీ కిస్తీ (ఈఎంఐ)ల్లో సుదీర్ఘకాలం పాటు తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ప్రతికూలతల గురించి ప్రస్తావించాలంటే, రుణం కావాలంటే ఏదైనా ఆస్తిని తప్పనిసరిగా తాకట్టు పెట్టాల్సిందే. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో రుణదాత మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ రుణ దరఖాస్తు ప్రాసెసింగ్‌, మంజూరుకూ కొంత సమయం పడుతుంది. ప్రాసెసింగ్‌ చార్జీలూ అధికమే. ఇందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ కూడా ప్రహసనంతో కూడిన ప్రక్రియ.


ఎంపిక

ఎలా..?

ఉద్దేశం: ప్రాపర్టీ కొనుగోలుకైతే తనఖా రుణం మేలు. వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి లేదా ఏదైనా ఆర్థిక అత్యయిక పరిస్థితుల నుంచి బయటపడేందుకైతే వ్యక్తిగత రుణం మెరుగైన ప్రత్యామ్నాయం.

సమయం: తక్షణమే నిధులు కావాలంటే వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. కాస్త సమయం పట్టినా ఫర్వాలేదు, పెద్ద మొత్తంలో నిధులు కావాలంటే తనఖా రుణం కోసం ప్రయత్నించవచ్చు.

వడ్డీ రేటు: తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు అధిక వడ్డీ అయినా ఫర్వాలేదనుకుంటే వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. తక్కువ వడ్డీయే మీ ప్రాధాన్యమైతే, తక్షణ అవసరం కాని పక్షంలో తనఖా రుణాన్ని ఎంచుకోండి.

క్రెడిట్‌ స్కోర్‌: ఈ రెండింటిలో మీ అవసరానికి సరిపోయే రుణాన్ని ఎంచుకోవడంలో క్రెడిట్‌ స్కోర్‌, హిస్టరీ చాలా కీలకం. ఎందుకంటే, రుణం ఇవ్వాలా..? వద్దా..? అనే విషయంలో క్రెడిట్‌ స్కోరే మీ అర్హతను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మీ క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే రుణ దాత ఎంత వడ్డీ వసూలు చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తాడు. కాబట్టి, తీసుకున్న రుణాలను సక్రమంగా, సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా క్రెడిట్‌ స్కోర్‌ను మరింత పెంచుకోవచ్చు. తద్వారా భవిష్యత్‌లో తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశముంటుంది.

ఇవి కూడా చదవండి:

BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 06 , 2025 | 04:13 AM