Trump Tariffs: వడ్డీ రేట్ల తగ్గింపే ట్రంప్ అసలు వ్యూహం
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:09 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణంగా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు ప్రతీకార సుంకాలు విధించడం వల్ల, అమెరికా ప్రభుత్వ అప్పులు పెరిగి, వడ్డీ రేట్లు కూడా పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు

అందుకే మాంద్యం కోసం ప్రయత్నాలు
న్యూయార్క్: అన్ని దేశాల దిగుమతుల మీద ట్రంప్ సర్కారు ఎడాపెడా సుంకాలు విధిస్తోంది. దీంతో అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యం బారిన పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా ట్రంప్ సర్కారు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎవరెంత అరిచి గీపెట్టినా సుంకాలపై వెనక్కి తగ్గేదేలే అని స్పష్టం చేశారు. తన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై చైనా విధించిన 34 శాతం సుంకాలనూ వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే చైనా దిగుమతులపై మరిన్ని సుంకాలు తప్పవని తాజాగా హెచ్చరించారు. ఈ సుంకాల పోరు వెనుక అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్ద వ్యూహమే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏమిటీ వ్యూహం
పేరుకు అగ్రరాజ్యమైనా అమెరికా కూడా పెద్ద అప్పులకుప్పగా మారింది. ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వ అప్పు 36 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.3,079 లక్షల కోట్లు) చేరింది. ఇది ఆ దేశ జీడీపీలో 120 శాతానికి సమానం. ఈ మొత్తం అప్పుల్లో 7.2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.615 లక్షల కోట్లు) అప్పును వచ్చే ఏడాది జూన్‌లోగా చెల్లించాలి. ఈ అప్పుపై ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఏటా చెల్లిస్తున్న వడ్డీ రేటు 1 నుంచి 1.5 శాతం మాత్రమే. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేటు 4 నుంచి 4.5 శాతం వరకు ఉంది. మనకు ఇది తక్కువగా కనిపించినా అమెరికన్లకు మాత్రం ఇది చాలా పెద్దమొత్తమే.
నిధుల కొరత
అయితే ప్రస్తుతం అమెరికా ఖజానా కూడా దాదాపుగా నిండుకుంది. ద్రవ్య లోటూ జీడీపీలో 6 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరానికి మన దేశంలో నమోదైన 4.7 శాతం కంటే ఇది ఎక్కువ. డాలర్ ఇంటర్నేషనల్ కరెన్సీ కావడంతో కొత్త అప్పుల సమీకరణ అమెరికాకు పెద్ద కష్టమేమీ కాదు. అలా అని 4 నుంచి 4.5 శాతం వడ్డీతో కొత్త అప్పులు తేవడం ట్రంప్ సర్కారుకు ఇష్టం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపే అసలు లక్ష్యం !
వచ్చే ఏడాది జూన్‌లోగా 7.2 లక్షల కోట్ల డాలర్ల అప్పులు చెల్లించేందుకు సరిపడా డబ్బులు కూడా ట్రంప్ సర్కారు వద్ద లేవు. ఈ అప్పుల్ని రీ ఫైనాన్స్ చేయడం ఒక్కటే ప్రస్తుతం ట్రంప్ సర్కారు ముందున్న మార్గం. అలా అని ఈ అప్పులపై ప్రస్తుతం 4 నుంచి 4.5 శాతం వడ్డీ చెల్లించేందుకూ ట్రంప్ ఇష్టపడడం లేదు. దీంతో అన్ని దేశాల దిగుమతులపై ఎడాపెడా సుంకాలు మోపి, ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టి వడ్డీ రేట్ల తగ్గింపునకు ట్రంప్ వ్యూహం పన్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ‘సుంకాలతో ద్రవ్యోల్బణం పెరగదు, ముందు మీరు వడ్డీ రేట్లు తగ్గించండి’ అని అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్‌ను ట్రంప్ తాజాగా దబాయించడం వెనుక ఇదే వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యూహంతో ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ కుప్పకూలినా ట్రంప్ పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వడ్డీ రేట్లు తాను అనుకున్న 2 శాతం దిగువకు వచ్చాక ఈ రెండూ మళ్లీ రేసుగుర్రాల్లా పరిగెడతాయని ట్రంప్ నమ్మకం. ఈ నమ్మకం ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ మదుపరులు మాత్రం లబోదిబోమంటున్నారు.