ట్రంప్ సుంకాల భేరీ
ABN, Publish Date - Apr 04 , 2025 | 03:14 AM
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. వాణిజ్య యుద్ధం ప్రారంభమైం ది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరింత నిజం చేశారు. మిత్ర దేశం, శత్రు దేశం అనే తేడా లేకుండా 60కిపైగా దేశాల ఉత్పత్తులపై...

ఫార్మా, ఇంధన పరిశ్రమకు ఊరట
ఆటో, ఐటీ ఎగుమతులకు కష్టాలు
రొయ్యల ఎగుమతులూ ఢమాల్ !
పారిశ్రామిక రంగం గగ్గోలు
అమెరికాకు అక్కరకు వచ్చే పరిశ్రమలపై కనికరం
న్యూఢిల్లీ: ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. వాణిజ్య యుద్ధం ప్రారంభమైం ది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరింత నిజం చేశారు. మిత్ర దేశం, శత్రు దేశం అనే తేడా లేకుండా 60కిపైగా దేశాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల పేరుతో 27 శాతం సుంకాలు విధించారు. అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే గొప్ప దేశంగా తీర్చి దిద్దాలన్నా, లక్ష కోట్ల డాలర్లకు (సుమారు రూ.85.30 లక్షల కోట్లు) చేరువైన వాణిజ్య లోటును పూడ్చాల న్నా ఈ సుంకాలు తప్పవని తేల్చి చెప్పారు. అయితే ఇదే సమయంలో అమెరికాకు ముఖ్యంగా అమెరికా పశ్రమ, వినియోగదారులకు కీలకమైన ఫార్మా, సెమీకండక్టర్లు, ఇంధన దిగుమతులను సుంకాల నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ నెల 5 నుంచి 10 మధ్య రెండు విడతలుగా ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి.
కొన్ని రంగాలకు మాత్రం కష్టమే
ట్రంప్ పోటుతో మన దేశానికి చెందిన కొన్ని రంగాలు పూర్తిగా డీలా పడ్డాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) లేదా అమెరికా స్థాయిలో సుంకాలు తగ్గించి ఆదుకోండని ప్రభుత్వాన్ని కోరాయి. లేకపోతే అమెరికా మార్కెట్‌లో ప్రవేశించడం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నాయి. ట్రంప్ సుంకాలతో ఈ కింది రంగాలు బాగా దెబ్బతింటాయని భావిస్తున్నారు.
మత్స్య ఎగుమతులు
ట్రంప్ తాజా సుంకాలతో మత్స్య పరిశ్రమ బెంబేలెత్తి పోతోంది. అమెరికా ఇప్పటికే మన మత్స్య ఎగుతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ పేరుతో 3.88 శాతం, కౌంటర్ వయలింగ్ డ్యూటీ పేరుతో 5.77 శాతం సుంకాలు విధిస్తోంది. ఇపుడు ప్రతీకార సుంకాల పేరుతో అదనంగా మరో 26 శాతం సుంకాలు మోపింది. దీంతో మన మత్స్య ఎగుమతులపై అమెరికా విధించే సుంకాల భారం 35.65 శాతానికి చేరింది. దగ్గర్లోనే ఉన్న ఈక్వెడార్ నుంచి వచ్చే మత్స్య దిగుమతులపై మాత్రం 13.78 శాతం మాత్రమే వసూలు చేయనుంది. మన దేశం నుంచి జరిగే మత్స్య ఎగుమతుల్లో 40 శాతం అమెరికాకే ఎగుమతవుతాయి. అందులో రొయ్యలదే పెద్ద వాటా. మన రొయ్యలకు ఇప్పటికే అమెరికా మార్కెట్‌లో ఈక్వెడార్, ఇండోనేషియాల నుంచి గట్టి పోటీ ఉంది. ఇపుడు ఈ సుంకాల పోటుతో మన మార్కెట్‌ను ఈ రెండు దేశాలు తన్నుకుపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రొయ్యల ఎగుమతిదారు బీఎంఆర్ గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ బీద మస్తాన్ రావు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. అమెరికా నుంచి మన దేశానికి దిగుమతయ్యే మత్స్య ఉత్తత్తులపై విధిస్తున్న 30 శాతం సుంకాన్ని జీరోకి తగ్గించడం ద్వారా ఆదుకోవాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి.
స్టీలు పరిశ్రమ బెంబేలు
మన స్టీలు ఎగుమతులపై ట్రంప్ సర్కా రు ఇప్పటికే 25 శాతం సుంకం వసూలు చేస్తోంది. ఇపుడు ప్రతీకార సుంకాల నుంచి మాత్రం మినహాయించింది. చైనా, యూరప్, జపాన్, దక్షిణ కొరియాల నుంచి దిగుమతయ్యే స్టీలుపై మాత్రం భారీగా ప్రతీకార సుంకాలు విధించింది. దీంతో దాదాపుగా ఈ దేశాలకు అమెరికా మార్కెట్ మూసుకుపోయినట్టే. దాంతో ఈ దేశాలు తమ మిగులు స్టీలును మరింత జోరుగా భారత మార్కెట్‌లో డంప్ చేసే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు భయపడుతున్నాయి. మన దేశీయ స్టీలు పరిశ్రమకు పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదం ఇదేనని పేర్కొన్నాయి.
ఆభరణాల ఎగుమతులకూ దెబ్బే
ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఆభరణాల పరిశ్రమ సైతం విలవిల లాడుతోంది. మన ఆభరణాల్లో దాదాపు 30 శాతం అమెరికాకే ఎగుమతవుతాయి. ఈ ఎగుమతులపై అమెరికా ప్రస్తుతం జీరో నుంచి ఐదు శాతం సుంకం విధిస్తోంది. మనం మాత్రం అమెరికా నుంచి దిగుమతయ్యే జువెలరీపై సగటున 20 శాతం సుంకం విధిస్తున్నాం. ఇపుడు ట్రంప్ ప్రతీకార సుంకాలతో 27 శాతం భారం పడనుంది. ఇది అమెరికాపై ఎక్కువగా ఆధారపడిన కంపెనీలకు గొడ్డలి పెట్టని పరిశ్రమ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీలైనంత త్వరగా అమెరికాతో బీటీఏ కుదుర్చుకోవడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్క వచ్చని ప్రభుత్వానికి సూచించింది. లేకపోతే దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన అమెరికా మార్కెట్ మనకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.
ఆటో బేఫికర్
ట్రంప్ 25 శాతం సుంకంపై దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెద్దగా భయపడడం లేదు. ఎందుకంటే మన దేశం నుంచి అమెరికాకు వాహనాల ఎగుమతులు అతి స్వల్పం. కాకపోతే ఆటోమొబైల్ విడి భాగాల తయారీ కంపెనీలు మాత్రం ఈ సుంకంపై కొద్దిగా భయపడుతున్నాయి. ఈ కంపెనీల మొత్తం ఎగుమతుల్లో 27 శాతం అమెరికాకే వెళతాయి. తన హార్లీడేవిడ్‌సన్ వంటి ఖరీదైన బైకులు, తన అనుంగు మిత్రుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కార్ల దిగుమతులపై సుంకాలు తగ్గించేలా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే ట్రంప్ సర్కారు ఈ రంగంపై 25 శాతం పన్నుల భారం మోపిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాడి పరిశ్రమ
మన పాడి ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 11.23 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోంది. ఇపుడు ప్రతీకార సుంకాలతో ఇది 38.23 శాతానికి చేరింది. తన పాడి ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు భారత్ ససేమిరా అనడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. అయినా దేశీయ వినియోగంపై ఎక్కువగా ఆధారపడిన భారత పాడి పరిశ్రమకు ఈ సుంకాలతో వచ్చిన ముప్పు పెద్దగా ఉండదని పరిశ్రమ వర్గాలు చెబుతునాయి.
బియ్యం ఎగుమతులు
మన దేశం నుంచి అమెరికాకు ఏటా 2.5 లక్షల నుంచి మూడు లక్షల టన్నుల బియం్య ఎగుమతవుతాయి. అమెరికా బియ్యం దిగుమతులపై మన దేశం 50 శాతం సుంకం విధిస్తోంది. అమెరికా మాత్రం 5.25 శాతం సుంకంతో అనుమతిస్తోంది. భారత్ కూడా అదే స్థాయికి తగ్గించాలని అమెరికా పట్టుబట్టింది. కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో ఇపుడు ప్రతీకార సుంకాలతో ఇది 27 శాతానికి చేరింది. దీంతో అగ్రరాజ్యంలోని దక్షిణ భారత ప్రజలు భారత బియ్యం రకాల కోసం మరింత ఖర్చు చేయక తప్పదు.
ఔళి పరిశ్రమకు మేలే
మన జౌళి ఎగుమతులపైనా అమెరికా 28 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లపై ఇంత కంటే ఎక్కువ భారం మోపారు. ఇది భారత వస్త్ర పరిశ్రమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
Read Also: ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..
Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి
Today Gold Rate: స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
Updated Date - Apr 04 , 2025 | 03:14 AM