Saraswati River: సరస్వతి నది అసలు చరిత్ర తెలుసా..
ABN, Publish Date - Apr 04 , 2025 | 10:52 AM
భారతదేశ చరిత్ర, పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక త్వరలోనే ఈ నది పుష్కరాలు రాబోతున్నాయి. మరి సరస్వతి నది చరిత్ర గురించి తెలుసుకుందాం.

భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం.. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని.. సమస్యలు తీరుతాయని నమ్ముతాం. మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతి నది. రుగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి నది గురించి రుగ్వేదంలో "అంబితమే, నదీతమే, దేవీతమే" (ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవత)గా కీర్తించారు. సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో ప్రవహించిందని చెబుతారు. మరి సరస్వతి నది జన్మస్థానం ఎక్కడ.. ఇది ఏఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అనే వివరాలు ఇక్కడ మీ కోసం..
సరస్వతీ నది జన్మస్థలం.. ప్రవాహ తీరం..
సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై.. భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి.. చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు, భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. రుగ్వేదంలో సరస్వతి నది యమునా, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించినట్లు పేర్కొనబడింది. దీని ఆధారంగా.. సరస్వతీ నదిని ఆధునిక కాలంలో గగ్గర్-హక్రా నది వ్యవస్థగా గుర్తించారు. ఈ నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి,.. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నది మనకు కనిపిస్తుందా అంటే లేదు. సుమారు 4000-5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక, వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో.. తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం, సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్మకం. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామం (మానా విలేజ్) సమీపంలో, బదరీనాథ్ వద్ద అలకనంద నదితో కలిసే సరస్వతీ నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు. దీని ప్రకారం.. సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది.
ప్రారంభం ఎక్కడంటే..
సరస్వతీ నది ఆరంభం గురించి ప్రధానంగా రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి పురాతనమైనది కాగా.. మరోకటి శాస్త్రీయమైనది. ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే.. సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి, హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెబుతారు. అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే.. సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల్లోని హర్-కీ-దూన్ హిమానీనదం (గ్లేసియర్) నుంచి ఉద్భవించిందని కొన్ని కొందరు చెబుతుండగా.. గర్వాల్ ప్రాంతంలోని బందర్‌పూంచ్ మాసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం ఉంది.
ఈ నది సట్లెజ్, యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని, తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి, అలకనందలో కలుస్తుంది. కనుక మానా గ్రామం సరస్వతి నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు.
చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
సరస్వతీ నది ఒకప్పుడు హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాటి ప్రజలు ఈ నదిని జ్ఞాన దేవతగా పూజించారు. సరస్వతి నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయని నమ్మకం. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.
మిగతా నదుల మాదిరే 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. ఇది బృహస్పతి (గురు గ్రహం) మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. ఈ సారి 2025, మే 15 నుంచి మే 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..
భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా..
Updated Date - Apr 04 , 2025 | 10:57 AM