రైతు వ్యతిరేక విధానాలను వీడని కేంద్రం

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:41 AM

Anti Farmer Policies Corporate Favoritism Government Criticism

రైతు వ్యతిరేక విధానాలను వీడని కేంద్రం

రైతు వ్యతిరేకత, కార్పొరేట్లకు దాసోహం అనే విధానాలను కేంద్ర ప్రభుత్వం వదులుకోలేదు. గతంలో ప్రధాని మోదీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా 383 రోజులు సాగిన ఆందోళనలకు తలొగ్గి వాటిని ఉపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2024లో నేషనల్‌ పాలసీ ఫ్రేమ్ వర్క్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌; నేషనల్‌ కో ఆపరేటివ్‌ పాలసీ; డిజిటల్‌ అగ్రికల్చరల్‌ మిషన్‌ల పేర్లతో మూడు పథకాలను తెచ్చింది. నాటి రైతు వ్యతిరేక నల్లచట్టాలకు ప్రతి రూపమే ఈ పథకాలు. భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు, మార్కెట్‌ సదుపాయాలను విస్తరించేందుకు, డిజిటలైజేషన్‌ ద్వారా వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చేందుకనే అందమైన మాటలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో ఇవి రైతుల బతుకును చిన్నాభిన్నం చేస్తాయనే విమర్శలున్నాయి.


ఈ పాలసీలు రైతుల కంటే కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ప్రభుత్వ మార్కెట్ యార్డులను బలహీనపరచడం, ప్రైవేట్ సంస్థలకు మరింత అధికారం కల్పించడం వల్ల కార్పొరేట్లకు అవకాశాలు పెరిగి, చిన్న రైతులు తక్కువ ధరలకు తమ ఉత్పత్తులు విక్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే సహకార సంఘాలపై కేంద్ర ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని పెంచుతోంది. కార్పొరేట్ సంస్థలు సహకార సంఘాల్లో 20శాతం వాటాను పొందడమే కాకుండా, అదే స్థాయిలో ఓటింగ్ హక్కును కూడా సాధించగలవు. ఇది రైతుల స్వయం నిర్ణయాధికారాన్ని దెబ్బతీసేలా ఉంది. ఇకపోతే డిజిటల్‌ వ్యవసాయ మిషన్‌ వల్ల రైతుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ కంపెనీల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు వెనుకబడిపోతారు. గ్రామాల్లో తగినంత ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం కూడా మరో సమస్య.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం రూ.16లక్షల కోట్లకు పైగా బకాయిలు రద్దు చేసింది. మరో పక్క రద్దు చేసిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల స్థానంలో తెచ్చే పథకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఇవి చట్టరూపం దాల్చకముందే రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని అన్ని రైతు సంఘాలు కలిసివున్న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. అఖిల భారత కిసాన్‌సభ జాతీయ మహాసభలు ఏప్రిల్‌ 15, 16, 17 తేదీలలో తమిళనాడులోని నాగపట్నంలో జరుగుతున్నాయి. ఈ ప్రమాదకర చట్టాల పట్ల రైతులను చైతన్యపరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం విజయవాడలో ఏప్రిల్ మూడున, కర్నూల్లో నాలుగున, ఎనిమిదవ తేదీన అనంతపురంలోనూ సదస్సులు జరపనుంది. కేంద్రం తెచ్చిన ఈ విధానాలవల్ల సరైన భద్రత, న్యాయమైన ధరలు, స్వేచ్ఛ లేకుండా రైతులు వ్యవసాయ రంగంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ చట్టాలు రైతులకు మేలు కలిగించేలా మారాలంటే, ప్రభుత్వం నేరుగా రైతులను పరిరక్షించే చర్యలు తీసుకోవాలి.

కాగితాల రాజశేఖర్

(నేడు విజయవాడలో రైతు సదస్సు)

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:41 AM