సినిమా ఒక విచిత్రమైన సరుకు!
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:43 AM
నిన్నటి డిసెంబరు నెలాఖరులో, ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఎన్నో; అవి ఎన్ని కోట్లు వసూలు చేశాయో; ఎన్ని సినిమాలు ఘోరంగా దెబ్బతిన్నాయో; ఏ హీరో రేటు ఎన్ని కోట్లుగా పెరిగిందో– వగైరా వగైరా వార్తలూ...
నిన్నటి డిసెంబరు నెలాఖరులో, ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఎన్నో; అవి ఎన్ని కోట్లు వసూలు చేశాయో; ఎన్ని సినిమాలు ఘోరంగా దెబ్బతిన్నాయో; ఏ హీరో రేటు ఎన్ని కోట్లుగా పెరిగిందో– వగైరా వగైరా వార్తలూ, లెక్కలూ పత్రికల్లోనూ, టీవీ చానళ్ళలోనూ వచ్చాయి. 2024వ సంవత్సరంలో దాదాపు 160 తెలుగు సినిమాలు విడుదలయ్యాయట! వాటిల్లో ఒక పదో, పదకొండో మాత్రమే బ్రహ్మాండంగా ఆడి, భారీ వసూళ్ళు సాధించాయట! ఒక సినిమా 300 కోట్లు! ఇంకోటి 500 కోట్లు! మరొకటి 1000 కోట్లు! ఒక సినిమా అయితే, 1800 కోట్లు వసూలు చేసిందట! కానీ, బొత్తిగా ఆడని, పెట్టిన పెట్టుబడిలో కనీసం కూడా రాని, సినిమాలే ఎక్కువట! అలా నష్టపోయిన నిర్మాతలు ఎందరోనట! ఒక నిర్మాత, గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యాడనీ; ఇంకో నిర్మాత, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని అప్పులు తీర్చి బికారి అయ్యాడనీ; మరొక నిర్మాత ఇంటి ముందు, సినిమాకి అప్పులిచ్చిన వాళ్ళు ధర్నా చేశారనీ– ఇలాంటి వార్తలు కూడా విన్నాం. ఈ మధ్య సినిమాలు తియ్యడానికి అప్పులిచ్చేవాళ్ళు (ఫైనాన్షియర్లు) ఆ నిర్మాతలకి సంబంధించిన ఆస్తుల పత్రాలు ముందే తీసుకుని పెట్టుకుంటున్నారట!
కొన్ని సినిమాలే బాగా ఆడడమూ, ఎక్కువ సినిమాలు ఆడకపోవడమూ అనే దానికి –కథ, దర్శకత్వం, నటన, సంగీతం, పబ్లిసిటీ వంటి –అనేక కారణాలుంటాయి. అవన్నీ ఇక్కడ చర్చించలేం. ఒక ముఖ్యకారణం మాత్రం, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో, ఏ ఒక్క సరుకుకి సంబంధించీ కూడా, ఆ సరుకుని తయారు చేయించే పరిశ్రమదారులకు, ఒక ఉమ్మడి ప్లాను అంటూ ఉండకపోవడం! ఎందుకంటే, ప్రైవేటు పెట్టుబడిదారులు –వాళ్ళు సబ్బుల పెట్టుబడిదారులైనా, సినిమాల పెట్టుబడిదారులైనా– ఎవరికి వారు, తమ సరుకుల్ని పెద్ద ఎత్తున అమ్ముకోగలమనుకుంటారు. ఉదాహరణకి, ఒక ప్రాంతంలో ఉన్న జనాభాకి ఎన్ని సబ్బులు అవసరమో, ఆ సంఖ్యకి కొంచెం అటూ ఇటూగా, వాటిని తయారు చేయించరు. వంద సబ్బులు అవసరమైన చోట, వెయ్యి సబ్బులు తయారు చేయిస్తే, వాటిని వాడేవాళ్ళెవరు? సినిమాలైనా అంతే! జనాలు నెలకి ఒక కొత్త సినిమా చూస్తారనుకుంటే, పది పన్నెండు కాకుండా, ఏకంగా 160 సినిమాలు తీస్తే, ఎంత బాగున్నా, ఎన్నని చూస్తారు? దీన్నే ‘అమితోత్పత్తి’ అంటారు. పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న ఈ లక్షణాన్ని ‘అంటువ్యాధి’గా వర్ణిస్తాడు మార్క్సు. మార్కెట్‌లోకి, అవసరాన్ని మించి కుప్పలు తెప్పలుగా సరుకులు వచ్చి పడుతోంటే, అన్నిటికీ ఒకే రకమైన డిమాండు ఉండదు గదా!
సినిమా తియ్యడానికి, ‘పెట్టుబడి’ పెట్టడమూ, ‘లాభాలు’ సంపాదించడమూ జరుగుతుంది కాబట్టి, సినిమా కూడా పెట్టుబడిదారీ పరిశ్రమే. ‘సినిమా ప్రదర్శన’ ఒక ‘అమ్మకం సరుకు.’ టిక్కెట్లు కొని, సినిమాని చూడడం అంటే, అది ఆ సరుకుని కొనడమే. అన్ని సరుకుల తయారీలో లాగే, సినిమా అనే సరుకు తయారీలో కూడా కావలిసినవి రెండు. 1) ఉత్పత్తి సాధనాలు (కెమెరాలూ, మేకప్ సామాన్లూ, బట్టలూ, సెట్టింగులూ వగైరాలు). 2) ఉత్పత్తిదారులు (డైరెక్టర్లూ, నటీనటులూ, టెక్నీషియన్లూ, వగైరాలు). అయితే, ఈ ఉత్పత్తిదారుల్లో రచనా, డైరెక్షనూ, నటనా, సంగీతమూ – వంటి ‘కళాత్మక నైపుణ్యాలు’ కొన్ని అవసరం అవుతాయి. కుండల్ని తయారు చెయ్యడంలోనూ, చెప్పుల్ని కుట్టడంలోనూ కూడా నైపుణ్యాల్లో తేడాలు ఉంటాయి. అటువంటి వస్తువుల్ని తయారుచేసే శ్రమల కన్నా, రచనా, గానం, నటనా – వంటి నైపుణ్యాల విషయాలు వేరు. వీటికి ‘కళ’ అనే ఒక వేరే లక్షణం కలుస్తుంది. సినిమా వంటి పరిశ్రమలు ‘నిజం కళల్ని’ వదిలేసి, ‘వ్యాపార కళల్ని’ పడతాయి!
ఏ ‘సరుకు’ విషయంలో అయినా, దాని తయారీకి అవసరమయ్యే పాతా–కొత్తా ‘శ్రమల మొత్తమే, దాని విలువ’. ఆ సరుకుని అమ్మితే వచ్చే డబ్బు, ఆ సరుకు ‘విలువే.’ సప్లై, డిమాండ్లని బట్టి, ఏదైనా మార్పు జరిగితే, ఆ ‘విలువ’ కన్నా, అమ్మకం ధర, కొంత తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. ‘సినిమా’ని కూడా ఒక ‘అమ్మకం సరుకు’గానే అర్థం చేసుకోవాలి. ఒక సినిమాని తయారుచెయ్యడానికి, ‘ఉత్పత్తి సాధనాల ఖర్చు’ని, ‘లక్ష’ అనుకుందాం. డైరెక్టర్ నించీ, లైట్ బాయ్ వరకూ తీసుకునే ఛార్జీల ఖర్చుని, ‘2 లక్షలు’ అనుకుందాం. (ఉదాహరణ తేలిగ్గా ఉండడం కోసం ‘లక్ష’ అనే అతి చిన్న మాట వాడుతున్నాం. అసలైతే, సినిమాలు తీయడానికి యాబై లక్షలు తక్కువ కాకుండా, వెయ్యి కోట్ల వరకూ ఖర్చు పెడతారట!) ఆ సినిమా కోసం ఖర్చులు పెట్టిన నిర్మాతకి వచ్చిన లాభాన్ని, ‘1 లక్ష’ అనుకుందాం. నిర్మాత చేతికి వచ్చేది లాభం! అంటే, ఆ సినిమా ప్రదర్శనలు పూర్తి అయ్యేటప్పటికి, దాని వల్ల మొత్తం రావలిసిన డబ్బుని, ఈ ఉదాహరణలో 4 లక్షలు అనుకోవాలి. అందులో నించి ‘ఉత్పత్తి సాధనాల మొదటి లక్షని’ తీసేస్తే, మిగిలిన 3 లక్షలూ, ఆ సినిమా తయారీ కోసం శ్రమలు చేసిన నటులతో కలిసి, మిగతా శ్రామికులందరిదీ అవుతుంది.
ఉదాహరణకి, 4 లక్షల ఖర్చుతో తయారైన ఒక సినిమాకి, ‘డిమాండ్’ పెరిగిపోయి, ఎక్కువ మంది చూసి, ఎక్కువసార్లు చూసి, దానికి మొత్తం మీద 1 కోటి డబ్బు వచ్చిందనుకుందాం. ఆ డబ్బు ఎక్కడి నించి వచ్చినట్టు? ఆ సినిమా తయారుకావడానికి జరిగిన రకరకాల శ్రమల నించే వచ్చినట్టు. ఆ సినిమా వల్ల 1 కోటి డబ్బు వచ్చిందంటే, ఆ కోటిలో నించి, ‘ఉత్పత్తి సాధనాల’ లక్షని తీసివేస్తే, ఇంకా మిగిలే 99 లక్షలూ, ఆ సినిమా తయారీలో శ్రమలు చేసిన కార్మికుల ‘శ్రమ విలువే!’ కానీ, ఆ శ్రమ విలువ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి: సినిమా తీయడానికి అవసరమైన శ్రమలు చేసిన వారికి (లైట్ బోయ్ నించీ సూపర్ స్టార్ వరకూ అనేక మందికి) ఇచ్చిన జీతభత్యాలు. రెండు: ఆ శ్రామికులు, తాము జీతాలుగా పొందిన దానికన్నా అదనంగా చేసే శ్రమ విలువ. (అదే అదనపు విలువ! దాన్ని పెట్టుబడిదారుడు ‘లాభం’ అంటాడు.)
ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. సినిమాకి డిమాండ్ పెరిగి, ఎక్కువ టిక్కెట్లు అమ్ముడై, ఆ రకంగా వచ్చిన డబ్బు, ఎన్ని కోట్లు వస్తే, అన్ని కోట్లూ, సినిమా కార్మికుల శ్రమ విలువే అవుతుందా? ఈ విషయం గురించి వివరంగా చర్చించడానికి ఇక్కడ చోటు చాలదు. క్లుప్తంగానే చూడగలం! ఒక నటి గానీ, నటుడు గానీ, డైరెక్టర్ గానీ, ఎక్కువ డిమాండ్‌తో పదేసి లక్షలో, కొన్ని కోట్లో తీసుకున్నారనుకుందాం. అది వాళ్ళ ‘ధర’ అన్నమాట! అలా తీసుకుంటే, వాళ్ళు ఎంత ఎక్కువ తీసుకుంటే, ఆ ఎక్కువ అంతా, వాళ్ళ శ్రమ విలువేనా?– దీనికి జవాబు, ‘కొంతవరకూ అవును’, ‘కొంతవరకూ కాదు’ అని! పెట్టుబడిదారీ సమాజం మొత్తంలో, అనేక సరుకుల తయారీ కోసం జరిగే శ్రమల విషయంలో, జనరల్ సూత్రంగా చూస్తే, ఇది నిజమే! కానీ, మార్క్సు వివరించినట్టు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ‘‘విలువ పరిమాణానికీ, డబ్బు రూపంలో దాని వ్యక్తీకరణకీ మధ్య’’ పొంతనే వుండదు (‘ఇన్ కన్సిస్టెన్సీ’). ఈ పాయింటుని వివరించడానికి, మార్క్సు, ‘పరువు, ప్రతిష్ఠ’ అనే విషయాల్ని ఉదాహరణగా తీసుకుంటాడు, ఇలా: ‘‘డబ్బు అనేది, సరుకుల విలువల రూపం మాత్రమే అయినప్పటికీ, ధర అనేది విలువను బొత్తిగా వ్యక్తం చెయ్యకపోవచ్చు. ‘అంతరాత్మ, గౌరవం’ (కీర్తీ, పరువు ప్రతిష్ఠలూ) వగైరాలు, తమంత తాముగా సరుకులు కానప్పటికీ, వాటి యజమానులు, వాటిని అమ్మకానికి పెట్టడం సాధ్యమే! ఆ రకంగా వాటి ధర వల్ల అవి సరుకుల రూపం ధరిస్తాయి. కనుక, విలువ అనేది లేని వస్తువులకు సైతం ధర అనేది వుండవచ్చు. అటువంటి సందర్భాలలో, ధర అనేది... ఊహాత్మకం!’’ (కాపిటల్–1, ‘సరుకులూ, డబ్బూ’ చాప్టరులో.)
మార్క్సు వివరణని, సినిమాలకి అన్వయించి చూద్దాం. ఉదాహరణకి, ప్రేక్షకుల్లో ‘గౌరవాన్ని’ (అభిమానాన్ని) సంపాదించిన–అంటే, డిమాండు ఉన్న–ఒక హీరో చేసే నటన అనే శ్రమకీ, దానికోసం అతను తీసుకునే కోట్ల డబ్బుకీ పొంతన ఉండదు. అతను, తన పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిమానానికి కూడా ఒక ధర పెట్టి, దాన్ని ఒక సరుకుగా అమ్మకానికి పెడతాడన్నమాట! అందుకే, 2024 సంవత్సరంలో, తెలుగు సినిమాల్లో హీరోలు కొందరు 30 కోట్లూ, కొందరు 50, కొందరు 100, కొందరు 200 కోట్లూ తీసుకున్నారట! ఈ మధ్య విడుదలై, తొక్కిసలాట జరిగిన సినిమాలో, హీరో 350 కోట్లు తీసుకున్నాడని ఒక వార్త. ఇది నిజమైనా కాకపోయినా, ప్రేక్షకుల్లో డిమాండు ఉన్న హీరోలు, కోట్లలో డబ్బుని డిమాండ్ చేస్తారనేదాన్ని నమ్మకుండా ఉండనక్కరలేదు. ‘డిమాండ్ల’ పేరుతో, తాము చేసే ‘నటన’ అనే శ్రమకి, లక్షలూ, కోట్లూ సంపాదించే పెద్ద పెద్ద సినిమా నటీనటులందరినీ ‘శ్రమ దోపిడీ వర్గం’లో జమ కట్టెయ్యవచ్చు! కారణం, వాళ్ళ ఆస్తులూ, అహంకారాలూ, విలాసాలూ, వ్యసనాలూ!
హీరోలూ, హీరోయిన్లూ, డైరెక్టర్లూ, సినిమాల కోసం చేసే శ్రమకీ, ఆ శ్రమకి బదులుగా తీసుకునే కోటానుకోట్ల డబ్బు రాశులకీ, ఏ సంబంధమూ లేని పరిస్థితే, సినిమాని, మిగతా సరుకుల ప్రపంచం నించీ భిన్నమైన, ప్రత్యేకమైన, ఒక విచిత్రమైన సరుకుగా చేస్తుంది!
రంగనాయకమ్మ
Updated Date - Jan 09 , 2025 | 02:43 AM