భయం పీడ నుంచి బయటపడేయండి!
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:35 AM
ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికారంలోకి వస్తే, ‘వామ్మో’... అన్న ఆందోళన బహుశా ఏ రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చు. ఇది ఏపీలోనే ఆందోళనగా మారింది. జగన్ అంటే ఎందుకు అంతగా భయం? అంటే ఐదేళ్ళు జగన్మోహన్‌రెడ్డి పరిపాలన...
ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికారంలోకి వస్తే, ‘వామ్మో’... అన్న ఆందోళన బహుశా ఏ రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చు. ఇది ఏపీలోనే ఆందోళనగా మారింది. జగన్ అంటే ఎందుకు అంతగా భయం? అంటే ఐదేళ్ళు జగన్మోహన్‌రెడ్డి పరిపాలన చూసాక, అందరికీ కలిగిన అభిప్రాయం ఇదే! బాధ్యత కలిగిన పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. ఏదో పందెంలో బానిసలను గెలుచుకున్న యజమానిలా రాష్ట్రాన్ని గెలుచుకున్నట్టు భావించారు. తానే సర్వాంతర్యామి అన్నట్లుగా తలబిరుసుతో ప్రవర్తించారు. అంతా నా ఇష్టం అన్న ధోరణిలోనే ఐదేళ్ళు ‘కథ’ నడిపించారు. రాష్ట్రంలోని సర్వ వ్యవస్థలు తన పాదాల కింద దాసోహంలా ఉండాలి అన్న ధోరణిలోనే శాసించారు. ఐఏఎస్, ఐపీఎస్, తుదకు న్యాయస్థానాలలో కూడా తన మాట చెల్లుబాటు అయ్యేలా పాలించారు.
మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య సంఘటనలోనూ; ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు విషయంలోనూ; దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్ర వంటి ముఖ్యమైన నాయకుల అరెస్టులు ఇందుకు నిదర్శనం. నిజానికి వీరు చేసిన భారీ నేరాలు, భారీ మోసాలు ఏమీ లేవు. ఏదైనా ఉన్నా, విచారించే కేసులే తప్ప, అరెస్టులు చేసి, వేధించి జైళ్ళకు పంపేవి కావు. 70 ఏళ్ళ రంగనాయకమ్మ, 73 ఏళ్ళ జర్నలిస్ట్ అంకబాబు వంటి వారిపైనా ఇదే తరహా దాడి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావులకూ మినహాయింపు లేదు. మహిళలపై అత్యాచారాల సంఘటనల పట్ల చలనం లేదు. దళితుల శిరోముండనాలు, మూత్ర విసర్జనలను పట్టించుకోలేదు. అమరావతి రైతుల ఉద్యమం పట్ల ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన తీరు ఇసుమంతైనా వ్యక్తం చేయలేదు. కోర్టుల్లో కూడా అధికారులను చేతులు కట్టుకోని నిలబడేలా చేశారు. చంద్రబాబు ఇంటిపై, మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడులు చేయించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా వెనక్కి తగ్గలేదు. అమర్ రాజా బ్యాటరీని తరిమికొట్టి, దాని యజమాని గల్లా జయదేవ్‌ను రాజకీయాల నుంచి దూరం చేశారు. లులూ మాల్‌ను రాకుండా చేశారు. కియా కంపెనీని బెదిరించారు. దీంతో చాలా మంది రాష్ట్రం వదిలి వెళ్లి పోయారు.
ఇప్పటికీ జగన్ పాలనా కాలంలో జరిగిన నేరాలు, ఘోరాలు, మోసాలు తవ్వేకొద్దీ వస్తూనే ఉన్నాయి. ముంబై నటి కాదంబరి సంఘటన, కాకినాడ పోర్ట్ భూముల బెదిరింపుల వ్యవహారం, రేషన్ బియ్యం తరలింపు, పేర్ని నాని ఉదంతం, రిషికొండ ఖర్చు, సోషల్ మీడియా వంటి చాలా అంశాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. ఏపీకి వచ్చే పారిశ్రామికవేత్తలు రేపటి భవిష్యత్తు గురించి భయపడుతున్నారంటే గత ఐదేళ్ళ పాలనా రక్తపు మరకల గుర్తులే కారణం. పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్న మాట ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ నోట వస్తున్నదంటే పారిశ్రామికవేత్తల భయానికి నిలువెత్తు నిదర్శనం ఇది. ప్రజా రాజధాని అమరావతి భద్రతపై కూడా ప్రశ్నలు లేకపోలేదు. మూడు రాజధానుల అంశాన్ని ఇప్పటికీ జగన్ వెనక్కి తీసుకోకపోవడం గమనార్హం. మళ్ళీ మేం అధికారంలోకి రాగానే సప్త సముద్రాల ఆవల ఉన్న లాకొచ్చి, అందరినీ జైల్లో పెడతాం అని ఇప్పటికీ జగన్ బెదిరిస్తున్నారు. చంద్రబాబు అప్పటికి బతికుంటే, మళ్ళీ జైలుకు పంపుతాం అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పులి పంజా విసురుతోందని అంటున్నారు. అంటే వాళ్ళు కలగనేది జరిగితే, భవిష్యత్తు ప్రశ్నార్థకం అనే కదా?
మరోవైపు జగన్ కేసులకు పదేళ్ళు పైబడినా పరిష్కారం లభించలేదు. సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలు కూడా జగన్ కేసుల పర్వాన్ని మహాభారతం టీవీ సీరియల్‌లా నడిపించటం జగన్ బలానికి ప్రధాన కారణం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం అండతోనే జగన్ కేసులు సుదీర్ఘ విచారణ దిశగా సాగుతున్నాయి అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఘనాతిఘన విజయం ఇచ్చినా, అందులో బీజేపీ భాగస్వామ్యంగా ఉన్నా, పరిస్థితిలో మార్పు పెద్దగా కనిపించటం లేదు. జగన్ భయాలకు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. శాంతిభద్రతలు లేనిచోట అభివృద్ధి ఉండదు అని గ్రహించాలి. రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు భయం పీడ నుంచి బయటపడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– పోతుల బాలకోటయ్య,
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు
Updated Date - Jan 09 , 2025 | 02:35 AM