కలల దేశంగా అమెరికా ఎప్పుడైనా ఉందా?
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:42 AM
జాతీయవాదం... దాదాపు 200 ఏళ్లకు పైగా ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. అన్ని సందర్భాల్లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనపడకపోవచ్చు. సాధారణ ప్రజలు చాలాసార్లు జాతీయవాద ప్రేరణతో....
జాతీయవాదం... దాదాపు 200 ఏళ్లకు పైగా ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. అన్ని సందర్భాల్లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనపడకపోవచ్చు. సాధారణ ప్రజలు చాలాసార్లు జాతీయవాద ప్రేరణతో వ్యవహరించి ఉండకపోవచ్చు. కానీ కీలక సందర్భాల్లో విపరీతంగా ప్రభావితం చేసిన భావజాలాల్లో జాతీయవాదమే ప్రధానమైంది. జాతీయవాదం కోసం సర్వంధారపోసినవారు అన్ని దేశాల్లోనూ కనపడతారు. ఇదంతా ఒకవైపు కథే! మరోవైపు నుంచి చూస్తే విపరీత జాతీయవాదం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అనేక యుద్ధాలకు, దారుణాలకు, వైషమ్యాలకు, విద్వేష ఆలోచనలకు కారణమై కోట్ల మంది జీవితాలను విచ్ఛిన్నం చేసిందీ జాతీయవాదమే! యుద్ధోన్మాదాలను రగిలించిన నాయకులందరూ జాతీయవాదాన్ని స్మరిస్తూనే రక్తపుటేరులను పారించారు.
మితిమీరిన జాతీయవాదంతో ఏ దేశంలోనైనా నలిగిపోయేది మైనారిటీలే. చరిత్రను తవ్వితీస్తే కనపడేది ఈ చేదు నిజమే. దేశంలోని మెజారిటీ ప్రజలను... మతపరంగానో, భాషపరంగానో, జాతిపరంగానో (రేస్), ప్రాంతంపరంగానో ప్రధాన సమూహంగా గుర్తించి వారందరికీ ఒకే తరహా ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయని ప్రచారం చేయటమే అతి జాతీయవాదంలో విశేషంగా ఉంటుంది. ప్రధాన సమూహ ప్రజల మధ్య తేడాలనూ, అసమానతలనూ గుర్తించకుండా కృత్రిమ జాతి ఆధిక్య భావాల చుట్టూ ప్రచారాన్ని కేంద్రీకరించి ఉద్రేకపరచటమే జాతీయవాదాల్లో తరచూ కనపడుతుంది. దేశం గొప్పగా భావించే సాంస్కృతిక వారసత్వాన్ని మైనారిటీలు అంగీకరించటం లేదనీ మనం తరచూ వింటూంటాం. సాంస్కృతిక ప్రత్యేకతలను వదులుకోనివారిని సందేహదృష్టితో చూడటం సంకుచిత జాతీయవాదంలో ప్రధానంగా కనపడుతుంది.
ప్రజాస్వామ్యానికి అగ్రదేశంగా మనందరమూ భావిస్తున్న అమెరికాలోనూ ఆది నుంచి ఇదే ధోరణి కనపడుతుంది. హెచ్1బి వీసాలను ఆసియావాసులు దుర్వినియోగం చేస్తున్నారనీ ఉన్నత చదువుకోసం వచ్చి ఉద్యోగాలను ఎగరేసుకుపోతున్నారనీ ప్రస్తుతం అమెరికాలో చెలరేగిపోతున్న విమర్శల వెనుకా మెజారిటీ శ్వేత జాతీయవాద విపరీత పోకడే వెల్లడవుతోంది. కుల, తెగ మనస్తత్వాల కంటే జాతీయవాదం విశాలమైనదే కావచ్చు. కానీ జాతి, వర్ణ ఆధిక్యంపై జాతీయవాదం ఆధారపడిన చోట అమెరికా అయినా మరో చోటైనా జరిగే దురాగతాలు ఇంచుమించుగా ఒకేరకంగా ఉంటాయి. జాతీయవాదం పేరుతో సంకుచిత్వం పెరిగే కొద్దీ మైనారిటీలకు క్షోభ ఎక్కువవుతుంది. సందర్భాన్ని బట్టి ఈ క్షోభ రూపం ఆధారపడి ఉంటుంది. అమెరికన్ల ఉద్యోగాలను కొట్టేస్తున్నారన్న విమర్శ ఆసియావాసులను ప్రస్తుతం క్షోభపెడుతోంది. చదువు ముగిసిన తర్వాత ఉద్యోగాలు చేసే కాలాన్ని బాగా తగ్గించాలనే డిమాండు ఊపందుకుంటోంది. ఇది జరిగితే బాగా నష్టపోయేది భారతీయులే. లక్షలు ఖర్చుపెట్టి అమెరికాలో చదువుతున్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో 25 శాతం పైగా భారతీయులే ఉన్నారు. 2022– 23లో 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లారు.
అభివృద్ధిచెందిన దేశాల్లో పలుచోట్ల జనాకర్షణ, ఉన్మాద నినాదాలతో ఓట్ల రాజకీయాల్లో పైచేయి సాధిస్తున్న నేతల్లో విపరీత జాతీయవాద పోకడలు లేని వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలవటంతో ఈ విపరీతం మోతాదు బాగా మించిపోతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారిని అక్కున చేర్చుకుని నివాసయోగ్యాన్ని కలిగించే దేశంగా అమెరికా గురించి ఘనంగా చెప్పుకోవటం అందరమూ వినే ఉంటాం. అమెరికాను వలసదారుల దేశంగా (ఎ నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రంట్స్) వర్ణించి బాగా ప్రాచుర్యం కల్పించటంలో ఒకనాడు ఆ దేశాధ్యక్షుడిగా వ్యవహరించిన జాన్.ఎఫ్.కెన్నడి పాత్ర చాలా ఉంది. ‘వలసదారుల దేశం’ పేరుతో 1958లో కెన్నడి ఒక వ్యాసం రాశారు. దాన్నే తర్వాత పుస్తకంగానూ ప్రచురించారు. 1961లో కెన్నడి అధ్యక్షుడిగా ఎన్నికకావటానికి ఆ పుస్తకం చాలా తోడ్పడింది. వలసదారులకు, శరణార్థులకు సురక్షిత ప్రదేశంగా ఉన్నప్పుడే అమెరికా ఘనత గొప్పగా ఉంటుందని కెన్నడి ప్రగాఢంగా చెప్పినా అది చాలా సందర్భాల్లో అమలుకాని ఆదర్శంగానే ఉండిపోయింది. అనేక దేశాల నుంచి వచ్చిన వలసదారుల అనుభవాలనూ, చరిత్రలనూ స్పృశిస్తూ జాక్లిన్ బాక్‌హౌస్.. ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇమ్రిగ్రేషన్’ పేరుతో రాసిన పుస్తకంలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. అమెరికా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న తొలినాళ్లలో అంటే 1790లో తీసుకొచ్చిన ‘నేచరలైజేషన్ యాక్ట్’లోనే వలసలకు కఠిన పరిమితులు విధించారు. పశ్చిమ యూరపు నుంచి వచ్చిన వారికే పౌరసత్వాన్ని ఇచ్చే వీలు కల్పించారు. అందుకే 1840–90 మధ్య వలసదారుల్లో 90 శాతం మంది యూరపు నుంచే వచ్చారు. 1919 వరకూ కూడా ఈ పరిస్థితి అసలు మారలేదు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో వలసలు దాదాపుగా ఆగిపోయాయి.
అమెరికాకు ఒకవైపున అట్లాంటిక్, మరోవైపున పసిఫిక్ మహాసముద్రాలు ఉన్నాయి. వీటి మధ్య భూభాగాలను కలుపుతూ రైల్వేలైన్లు వేయటం చాలా సంక్లిష్టమైన పని. అరణ్యాలు, ఉధృతంగా ప్రవహించే నదులు, మహాపర్వతాలతో కూడిన ప్రాంతాల్లో పనిచేయటానికి స్థానిక అమెరికన్లు ముందుకురాలేదు. చివరికి చైనా నుంచి వేలాదిమంది కార్మికులను రప్పించి, అతి తక్కువ వేతనాలతో రైల్వేలైన్లను పూర్తిచేశారు. అప్పటికే శాన్‌ఫ్రాన్సిస్‌కోలో పనుల కోసం వెతుకుతూ ఉన్న చైనీయులనూ రంగంలోకి దించారు. లైను పూర్తయ్యే లోపల వందల చైనా కార్మికులు చనిపోయారు. 90 శాతం మంది చైనా కార్మికులు రైల్వేలైను నిర్మాణంలో పాల్గొంటే అమెరికన్ల సంఖ్య 10 శాతానికి మించలేదు. 1869 మే 10 నాటికి లైను పూర్తయింది. ఆ సందర్భంగా ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల ఫోటోల్లో ఒక్క చైనా కార్మికుడు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతటి చిన్నచూపు, ఏహ్యత ఆనాడు ఉండేవి. ఏళ్లపాటు పనిచేసినందుకు తమకు పౌరసత్వం కల్పించాలని కోరారు. దానికి ససేమిరా అనటమే కాదు మొత్తంగా చైనీయులను అమెరికాలోకి అడుగుపెట్టకుండా 1882లో ‘చైనీస్ ఎక్స్‌క్లూజన్ యాక్ట్’ను తీసుకువచ్చారు. 1902లో వాళ్ల పౌరసత్వాలనూ రద్దుచేశారు. కాలిఫోర్నియాలో అయితే 1882 కంటే ముందే చైనీయులకు ఉన్న ఓటుహక్కునూ రద్దుచేశారు. 1917లో మొత్తంగా ఆసియాదేశాల నుంచే ప్రజలు రాకుండా నిషేధం విధించారు. ఆ తర్వాత 1924లో తీసుకువచ్చిన వలసల చట్టం దేశాలు, జాతుల వారీ కోటాలను ప్రవేశపెట్టి ఆంక్షలను మరింతగా పెంచింది. ఇందుకు 1890నాటి అమెరికాలోని జాతుల జనాభా సంఖ్య ఆధారంగా వలసల కోటాను నిర్ణయించారు. అప్పటికే అమెరికాలో ఉన్న ఒక జాతి జనాభాకు 2 శాతానికి మించి ఏ దేశం నుంచి వలసదారులను అనుమతించకుండా చర్యలు ఈ చట్టంలో ప్రతిపాదించారు. ఆసియా ప్రజలకు పూర్తిగా తలుపులు మూసివేశారు. దక్షిణ, తూర్పు యూరపు దేశాల ప్రజలపైనా చాలా నిషేధాలు పెట్టారు. చివరికి అనేక ఒత్తిళ్ల అనంతరం 1965లో తీసుకువచ్చిన ‘ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటి యాక్ట్’ కోటాల పద్ధతిని ఎత్తివేయటంతోనే ఆసియా వాసులకు అమెరికాలో ప్రవేశం కాస్త సులభమైంది. భారతీయులు కూడా ఈ చట్టం తర్వాతే అమెరికాకు వెళ్లటం మొదలుపెట్టారు. నిజానికి 1965 నాటి చట్టానికి అంతకు ముందు ఏడాది అమల్లోకి తెచ్చిన పౌరహక్కుల చట్టం చాలా తోడ్పడింది. నల్లజాతీయులు సాగించిన మహత్తర పోరాటాలతోనే అది సాధ్యమైంది. పౌరహక్కుల చట్టమే లేకపోతే ప్రజాస్వామ్యం గురించి, సమన్యాయపాలన గురించి, పౌరసమానత్వం గురించి ప్రపంచానికి నీతులు చెప్పే నైతిక అర్హతే అమెరికాకు ఉండేది కాదు.
అవకాశాల సీమగా ఇప్పటికీ అమెరికాను పరిగణిస్తూ ప్రతి ఏటా దాదాపు లక్షల మందికి పైగా ప్రజలు అక్కడికి వెళుతున్నారు. 2021–24 మధ్య సగటున ఏడాదికి 24లక్షల మంది అక్కడికి చేరుకున్నారు. 1965 నుంచి చూస్తే క్రమేపీ లాటిన్ అమెరికా, ఆసియా నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. మొత్తం వలసదారుల్లో 50 శాతం వారే ఉన్నారు. ఇంతగా వెళుతున్న వారందరికీ అక్కడ సమభావనతో సమాజంలో స్వాగతం లభిస్తోందనీ ఇప్పటికీ చెప్పలేం. ఎన్నోరూపాల్లో శ్వేతజాతి ఆధిక్యతా ధోరణులు ఎదురవుతున్నాయని చెబుతూ చాలా రచనలు వస్తున్నాయి.
అమెరికా స్వాతంత్య్ర ప్రకటన మనిషి స్వేచ్ఛకూ సంతోషానికీ జీవికకూ పట్టంకడుతూ చాలా ఉదాత్తంగా ఉంటుంది. మనుషులు సమానంగానే పుట్టారనీ, విస్మరించలేని కొన్ని సహజ హక్కులను సృష్టికర్త వారికి కల్పించారనీ అందులో జీవిక హక్కు, స్వేచ్ఛ, సంతోషాన్వేషణ ప్రధానమైనవనీ ఆ ప్రకటన స్పష్టం చేసింది. అమెరికాలోని ఆదిమవాసులనూ ఆఫ్రికా నుంచి బానిసలుగా బలవంతంగా కొనుగోలుచేసి తెచ్చిన లక్షోపలక్షల మందినీ ఆ సహజ హక్కులకు అర్హులుగా చూడలేదు.
ఆఫ్రికా నుంచి నల్లజాతి ప్రజలను 16–19 శతాబ్దాల మధ్య కోటిమందిని బానిసలుగా అమెరికాకు తరలించారు. చరిత్రలో ఇంతమందిని ఇలా తరలించటం జరగలేదు. మెక్సికన్లది మరో విషాద చరిత్ర. మెక్సికో, అమెరికా మధ్య 1846–1848లో యుద్ధం జరగక ముందు అరిజోనా, కాలిఫోర్నియా, కలరాడో, నివాడ, ఓక్లహోమ, టెక్సస్, న్యూమెక్సికో, యూటా రాష్ట్రాల్లో చాలా భూభాగాలు మొత్తంగానో, పాక్షికంగానో మెక్సికో కిందే ఉండేవి. ఆ యుద్ధంలో మెక్సికో సగం భూభాగాన్ని కోల్పోయింది. కోల్పోయిన భూభాగాల్లో మెక్సికన్ల ఆస్తులు, ఉపాధికి భంగం కలగకూడదని ఒప్పందం కుదిరినా దాన్ని ఖాతరు చేయలేదు. అప్పటి నుంచీ మెక్సికన్లు కోల్పోయిన భూభాగాల్లో ప్రవేశించటానికి ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
చరిత్రను విశాల మానవతా దృక్పథంతో చూస్తే అమెరికా నుంచి నేర్చుకునేది ఎంత ఉందో నేర్చుకోతగనిదీ అంతకంటే ఎక్కువే ఉంది. వలసల చరిత్రలోని విషాదాలనూ రాజకీయాలనూ జాతి ఆధిక్యతా ధోరణులనూ తెలుసుకుంటేనే ఈనాటి ట్రంప్ విధానాల నేపథ్యమూ అర్థం అవుతుంది. అమెరికా ఆధిక్యతకూ శ్వేతవర్గానికీ పెద్దపీట వేయాలనే తర్కానికీ ట్రంప్‌తో మళ్లీ ఊపు వచ్చినా దాని మూలాలు ఇప్పటివి కావు! ఆధిపత్య భావజాలాలపై ఆధారపడిన జాతీయవాదాలు ఎక్కడైనా అమానవీయాలే! అందుకే ‘కలలదేశం’లో సామాజిక సమానత్వ ఆదర్శాల అమలూ అసంపూర్ణమే! భిన్నజాతుల ప్రజల మధ్య వివాహాలు 1967 వరకూ చట్టవిరుద్ధమైన చోట అదెంత ఉండి ఉంటుంది?
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
Updated Date - Jan 14 , 2025 | 12:42 AM