Share News

Biruduraju Ramaraajuఫ శత జయంతుల్లోనూ తేడలా

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:26 AM

తెలంగాణ జానపద సాహిత్య పరిశోధకుడు బిరుదురాజు రామరాజు శత జయంతి ఉత్సవాలు, ఆయన చేసిన కృషి, భాషా సంస్కరణలపై ఆలోచన. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, సామాజిక కుల వివక్షలకు ఎదురుదెబ్బ

Biruduraju Ramaraajuఫ శత జయంతుల్లోనూ తేడలా

సాహిత్యంలో అందునా జానపద సాహిత్యంలో విశేషంగా కృషిచేసిన బిరుదురాజు రామరాజు శత జయంతి నామమాత్రపు ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం తెలుగు ఎంఏ కోర్సులు ప్రవేశపెట్టించడంలోనూ, పీహెచ్‌డీ ప్రారంభించడంలోనూ ఆయన పాత్ర గణనీయమైనది. అదే సమయంలో సంస్కృత, తెలుగు, ఆంగ్లంలో అపూర్వ పాండిత్యం ఉన్నప్పటికీ, జానపద సాహిత్యాన్ని పరిశోధనకు స్వీకరించి, అందులో మొదటి పీహెచ్‌డీ పొందడం మాటలు కాదు. ఆయనలో చెప్పుకోదగిన మరొక దృక్పథం తెలంగాణ. తన భాషా పరిశోధనలో తెలంగాణ, ఓరుగల్లు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ లాంటి మండలాల్లో భాషను ఆయన ఉటంకించారు. విశాలాంధ్ర రాకముందే ఈ మూడు ప్రాంతాల కలయిక జరిగితే, జరిగినాక ఒక ప్రామాణిక భాష ఏర్పడాలని ఆయన సూచించారు. అప్పుడు ప్రాంతాలు ఒకదానిని మరొకటి సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాయని, ఈ పనిని పండిత పరిషత్తులు, విశ్వవిద్యాలయాలు చేయాలని ఆయన చెప్పారు. ‘‘విశాలాంధ్రకు హైదరాబాదు రాజధాని అయితే తెలంగాణ అవిభక్తంగా ఉన్న కాలంలో లాగా కేంద్ర స్థానం అవుతుంది. తెలంగాణ ప్రభావం దేశంలోని అన్ని రంగాల్లో ఉంటుంది. నన్నయ వంటి గోదావరి మండల వాస్తవ్యుని కవితలు, తిక్కన వంటి నెల్లూరు మండల వాస్తవ్యుని కవిత్వంలో కూడా తెలంగాణ పదాలు ఉన్నాయి.


తెలంగాణ కవులు కొందరు ఇంట్లో తెలంగాణ భాష మాట్లాడుతూ బయటకు వచ్చినాక ఆంధ్ర ప్రభావంతో వచ్చే భాషను రాస్తున్నారు, మాట్లాడుతున్నారు’’ అని ఆ కాలంలోని దాశరథి, సి. నారాయణరెడ్డిల తీరుని ఆయన ఉదహరించారు. ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతం తక్కువ చేస్తే దాని పరిణామాలు వికృతంగా ఉంటాయని ఆయన ఆ రోజే అభిభాషించారు. తెలంగాణది తెలుగేనా? ఇక్కడ కవులు కూడా ఉన్నారా? అన్న ఆంధ్ర పండిత అహంకారానికి సమాధానంగా సురవరం ప్రతాపరెడ్డి తెచ్చిన గోలకొండ కవుల సంచికను తన ‘రామరాజీయం’ వ్యాస సంపుటిలో పేర్కొన్నారు. తెలంగాణ వైతాళికుల్లో ఒకరని చెప్పుకోదగిన కొమర్రాజు లక్ష్మణరావు చేసిన సేవలను, ఆంధ్ర విజ్ఞానానికి, చరిత్రకు, ఆయన చేసిన దోహదాన్ని బిరుదురాజు రామరాజు చాలా ఆర్తితో వివరించారు. అదేవిధంగా కొమర్రాజు వారు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక మండలి వికాసంలో ఎట్లా పాలుపంచుకున్నారో తెలియజేశారు. ఆ కాలంలోనే బిరుదురాజుగారు ఈ పొత్తంలో బూర్గుల రామకృష్ణారావు, కొమర్రాజు లక్ష్మణరావు, డాక్టర్ డి.ఎస్. రెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, మాడపాటి హనుమంతరావు లాంటి తెలంగాణ ప్రముఖుల సాహిత్య జీవితాలను చాలా స్ఫూర్తిమంతంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ విధంగా తెలంగాణ వాదానికి, ఆ కాలంలో పండితాదరణ పొందని జానపద గేయ వికాసానికి, బిరుదురాజు చేసిన కృషి సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. ఇలాంటి పరిశోధకునికి, విమర్శకునికి తెలంగాణ ఎంత గుర్తింపు ఇస్తున్నది? 22 జూలై, 1925లో దాశరథి జన్మించారు. 16 ఏప్రిల్, 1925లో బిరుదురాజు జన్మించారు. ఇద్దరి శతజయంతి ఉత్సవాలు ఈ సంవత్సరమే. ఇద్దరూ తెలంగాణ పోరాట యోధులే. బిరుదురాజు కూడా ఇంకా తెలంగాణ స్వతంత్రం కాకముందు జరుగుతున్న పోరాటంలో దాశరథి వలెనే నిజాంని సవాల్ చేశారు.


ఆ కాలంలో ఆయన నిజాం కళాశాల విద్యార్థి. విద్యార్థులు నిజాంకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు ఆయన నాయకత్వం వహించారు. లాఠీచార్జిలో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ ఆయన మీద దాడి చేసి కర్రతో బలంగా మోదాడు. బిరుదురాజు కింద పడిపోయారు. ఇన్‌స్పెక్టర్‌ వదలకుండా ఆయన తల మీద తన బూటు కాలు వేసి తొక్కసాగాడు. తల నుండి, ముక్కు–చెవుల నుంచి కూడా రక్తం స్రవిస్తున్నది. కానీ ఇన్‌స్పెక్టర్‌ బూటు కాలు తీయడం లేదు. అదే కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సరోజినీనాయుడి కూతురు ఈ దృశ్యం చూసి, పరిగెత్తుకొచ్చి ఇన్‌స్పెక్టర్‌ను లాగి చెంపదెబ్బ కొట్టింది. బిరుదురాజును వెంటనే హాస్పిటల్‌కి తరలించింది. బిరుదురాజు ఉద్యమ జీవితంలోని ఒక చిన్న ఉదాహరణ ఇది. ఉద్యమ సమయంలో ఎందరి గురించో పేర్కొన్న ఉద్యమ మహోపన్యాసకులు, ఈ సంఘటనను గాని, ఇంకా రామరాజుకు సంబంధించిన ఇతర విషయాలు గానీ ఎక్కడా పేర్కొన్న దాఖలాలు లేవు. దాశరథి, బిరుదురాజుల శతజయంతి ఉత్సవ నిర్వహణలో ఎన్ని భేదాలు ఉన్నాయి? కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించే సెమినార్‌లో వాళ్ళ కుటుంబ సభ్యులే భోజనాలు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వాలు ఎంత గుర్తింపు ఇచ్చినట్టు? బ్రాహ్మణుడిగానో రెడ్డిగానో, ఈ కాలంలోనైతే దళితుడుగానో పుట్టిన సాహితీవేత్త అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందా? తెలంగాణ వచ్చాక ఇద్దరు బ్రాహ్మణ కవుల పేరు మీద అవార్డు ప్రవేశపెట్టారు. వాళ్లకి సమాంతరంగా ఉన్న బిరుదురాజు ఏమయ్యారు? బీసీ సమాజంలో అందునా భట్టురాజు కులంలో పుట్టడం ఒక నేరమా? ఇప్పటికీ ‘‘భట్రాజు పొగడ్తలు’’ అని కులాన్ని కించపరిచే సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు మనకెందరో కనబడుతుంటారు. ఒక కులాన్ని అట్లా కించపరిచే హక్కు వాళ్లకి ఎవరు ఇచ్చారు? ఇప్పటికైనా బిరుదురాజు పాండిత్యానికి భాషా సేవకు, తెలంగాణ వాదానికి హేతువులైన ఆలోచనలకు, సరైన గుర్తింపు లభిస్తుందని ఆశిద్దాం. ఏ సామాజిక వర్గమైనా ప్రతిభ ఉన్నవాళ్లకు నిర్ద్వంద్వంగా గుర్తింపు లభించాలని డిమాండ్ చేద్దాం.

కాంచనపల్లి గోవర్ధన్‌రాజు (రేపు బిరుదురాజు రామరాజు శతజయంతి)

Updated Date - Apr 15 , 2025 | 05:27 AM