Constitutional Amendment: కేంద్రం తగ్గాలి.. రాష్ట్రాలు పెరగాలి

ABN, Publish Date - Apr 08 , 2025 | 06:39 AM

భారతదేశంలో జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పునఃఆలోచనలు సాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక పురోగతితో రాజకీయాధికారంలో ఉన్న అసమానతలు, ప్రజాస్వామిక చర్చలకు దారితీస్తున్నాయి

Constitutional Amendment: కేంద్రం తగ్గాలి.. రాష్ట్రాలు పెరగాలి

కాలస్పృహలేని దేశంగా భారత్‌ను పాశ్చాత్య మేధావులు ఒకప్పుడు వర్ణించారు. సమాజంలో జరిగే మార్పులను క్రమపద్ధతిలో నమోదుచేసి ముందు తరాలకు అందించాలన్న తపన మనకు చాలా తక్కువని చెప్పటమే వారి ఉద్దేశం. పాశ్చాత్య చరిత్రలోలాగా లౌకిక విశేషాలను అక్షరబద్ధం చేసే అలవాటు మనకు ఎక్కువగా లేని మాట నిజమే! చరిత్రలో ఏ సంఘటనకైనా కాలనిర్ణయం చేయటం మనకు కత్తిమీద సామే! దానికి కారణాలు అనేకం. పాత చరిత్రను కాసేపు పక్కనబెట్టి సమకాలీన రాజకీయాలను గమనిస్తే మరో విశిష్టత కనిపిస్తుంది. అదే కాలయాపన! అవసరమైన విషయాలపై వెంటనే మనం దృష్టిపెట్టం. రాజ్యాంగం వచ్చిన పదేళ్లలో అందరినీ అక్షరాస్యులను చేయాలనుకున్నాం. చేయలేకపోయాం. అంటరానితనాన్ని సంపూర్ణంగా రూపుమాపాలనుకున్నాం. దాన్నీ చేయలేకపోయాం. ఇలా ఒకటీరెండూ కాదు.. మన కాలయాపనలు గురించి చాలా ఉదాహరణలు ఇవ్వొచ్చు. వీటిల్లో ఒకటి ఇప్పుడు మన రాజకీయాలను ఊపేస్తోంది.

పదేళ్లకొకసారి జనాభా సేకరణచేసి లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలని రాజ్యాంగ నిబంధన ఉన్నా 50ఏళ్లపాటు కాలయాపన చేశాం. రాజకీయ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వాలు దాన్నే పరిష్కారం అనుకున్నాయి. ఇప్పుడు కూడా కాలయాపన సృష్టించిన సవాళ్లను ఎదుర్కోవటం కంటే మళ్లీ పాతదారి తొక్కాలనే వాదన కూడా వినిపిస్తోంది. మరో పాతికో, యాభై ఏళ్లో పునర్వ్యవస్థీకరణను వాయిదా వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోదు. నియోజకవర్గాల సంఖ్యను యథాతథంగా ఉంచటం వల్ల రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజకీయ అసమానతలు తొలగిపోవు. ఆర్థికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాల ఆదాయాన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ఎంతకాలం తరలిస్తారన్న ప్రశ్నలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి. ‘మేం ఇచ్చేదెంత? మాకు వచ్చేదెంత?’ అనే ప్రశ్నలు రాజకీయాల్లో సర్వసాధారణమైపోయాయి. కుటుంబ నియంత్రణ లక్ష్యాలను సాధిస్తే ఆదాయాల్లో కోతలు వేస్తారా అంటూ నిలదీయటం నిత్యకృత్యమైంది. ఉత్తరాది వెనుకబాటు భారాన్ని దక్షిణాది ఎందుకు మోయాలని అడగటానికీ సంశయించటం లేదు.


ఎన్నికల్లో లబ్ధి కోసమేనంటూ ఈ విమర్శలను కొట్టేయటం తేలిక. ప్రాంతీయ పార్టీలే వాటిని చేస్తున్నాయని ఆక్షేపించటమూ సులువే! కానీ సమస్య లోతుల్లోకి వెళ్లిచూస్తే ఈ విమర్ళలను నిర్హేతుకమైనవిగా భావించలేం. రాష్ట్రాల మధ్య అసమానతలను కాదనలేం. వాటిని పరిష్కరించకుండా ఉత్తర–దక్షిణాదుల మధ్య నెలకొన్న భేదభావనలను పొగొట్టలేం.

రాజకీయ ఆధిపత్యం ఆర్థిక అంశాలను ప్రభావితం చేస్తుంది. చట్టసభల్లో సంఖ్యాబలం రాజకీయ ఆధిపత్యాన్ని నిర్ణయిస్తుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రాల బలాలు చట్టసభల్లో తారుమారైతే.. ప్రాంతాల ఆధిపత్యంలోనూ తీవ్రమార్పు వస్తుంది. హిందీ రాష్ట్రాలకు అధికాధిపత్యం ఉందన్న భావన ఇప్పటికే బలంగా నాటుకుంది. ఇతర మార్పుల జోలికి వెళ్లకుండా కేవలం జనాభా ప్రాతిపదికగా వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సంఖ్యలో మార్పులు తెస్తే ఉత్తరాది ఆధిపత్యం మరింత పెరుగుతుందన్న భయమూ ఉంది. దీన్ని నివారించి రాష్ట్రాల మధ్య సమతూకం ఉండేలా చూడటమే పెద్ద సవాలుగా మారింది.

పునర్వ్యవస్థీకరణపై దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నా ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం తన ఆలోచన ఏమిటో స్పష్టంచేయలేదు. కోవిడ్‌ పేరుతో వాయిదావేసిన జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు మొదలుపెడతారో వెల్లడించలేదు. జనాభా ఆధారంగా మాత్రమే పునర్వ్యవస్థీకరణను చేపడితే ఒప్పుకొనేది లేదని దక్షిణాది నేతలు చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రులు అప్పుడప్పుడూ స్పందిస్తున్నారు. తమిళనాడు ఒక్క లోక్‌సభ స్థానాన్నీ కోల్పోదని హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. అదే నిజమైతే లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య మొత్తంగా పెరగాలి.

నియోజకవర్గాల పెంపు నిజమైతే దానికి అనుసరించే సూత్రం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. అందుకు ఉన్న రాజ్యాంగ నిబంధనలు ఏమిటి? వాటికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చేపడితే వివాదాలు సమసిపోతాయా? రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణమవుతున్న ఆదాయ పంపిణీలో అసమానతలు అంతమవుతాయా? అన్న ప్రశ్నలూ తలెత్తుతాయి. వీటిని సమగ్రంగా విశ్లేషించటం ఇటీవలే మొదలైంది. జెమీ హింట్‌సన్‌, మిలన్‌ వైష్ణవ్‌ 2019లో ఈ సమస్యపై రాసిన వ్యాసం ఆధారంగా ఇప్పటికీ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 2023లో శ్రుతీ రాజగోపాలన్‌ మరికొన్ని అదనపు విషయాలను విశ్లేషించారు. రాజ్యసభలో ప్రాతినిధ్యం ఎలా ఉండాలో చెబుతూ కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు చేశారు.


లోక్‌సభ సీట్ల పంపకం రాజ్యాంగంలోని 81, 82 అధికరణాలను అనుసరించి జరగాలి. జనాభా దామాషాను బట్టి లోక్‌సభ సీట్లను రాష్ట్రాల మధ్య పంచటమే కాదు.. ఓటర్ల సంఖ్య రీత్యా ఆ సీట్లు సమానస్థాయిలో ఉండాలని కూడా ఆ అధికరణలు నిర్దేశించాయి. ఒక ఓటుకు ఒక విలువ సూత్రం ప్రకారం ఆ నిబంధనలను పొందుపరచారు. ప్రస్తుతం మనకు 20 లక్షలలోపు ఉన్న నియోజకవర్గాలూ ఉన్నాయి. 40 లక్షల వరకూ ఓటర్లు ఉన్నవీ కనపడతాయి. అంటే ఓటు విలువలో సమానత్వం లేదు.

1971 నాటి జనాభా లెక్కల ప్రకారం చేసిన పునర్వ్యవస్థీకరణ ఆధారంగానే ప్రస్తుత లోక్‌సభ, శాసనసభ సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 1976లో ఒకసారి, 2002లో మరోసారి 25 ఏళ్లు చొప్పున పునర్వ్యవస్థీకరణపై నిషేధం విధించారు. 2026 తర్వాత చేపట్టబోయే జనాభా లెక్కలను అనుసరించి మాత్రమే పునర్వ్యవస్థీకరణను చేపట్టాలని 84వ రాజ్యాంగ సవరణ(2002) నిర్దేశించింది. జనాభా సేకరణను త్వరలో చేపట్టినా తుది లెక్కలు రావటానికి రెండేళ్లైనా పట్టొచ్చు. ఏ జనాభా లెక్కలు ఆధారంగా పునర్వ్యవస్థీకరణను చేపట్టాలన్నది 84వ రాజ్యాంగ సవరణకు ప్రభుత్వం ఇచ్చే వ్యాఖ్యానమే కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం కావాలనుకుంటే సీట్లల్లో మార్పులను 2031 జనాభా సేకరణ లెక్కలు వచ్చేదాకా వాయిదానూ వేయొచ్చు!

పెరిగిన జనాభా లెక్కలను తీసుకుని పునర్వ్యవస్థీకరణ చేస్తే మార్పులు తీవ్రంగానే ఉంటాయి. ఉదాహరణకు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ స్థానాలను సర్దుబాటు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు కోల్పోయేది ఎక్కువని అయిదేళ్ల కిందటే జెమీ హింట్‌సన్‌, మిలన్‌ వైష్ణవ్‌ వివరించారు. హిందీ రాష్ట్రాలు బాగా లబ్ధిపొందుతాయనీ తేల్చారు. పైన ఇచ్చిన పట్టిక చూస్తే ఈ తేడాలు స్పష్టంగా కనపడతాయి. దక్షిణాది రాష్ట్రాలు 18 స్థానాలు కోల్పోతాయి. ఇక ఈ ఏడాదే (2026) పునర్వ్యవస్థీకరణ జరిగితే లాభనష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు దక్షిణాది 26 సీట్లను కోల్పోతుంది. హిందీ రాష్ట్రాలకు అదనంగా 35 సీట్లు చేరతాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం ఒక్కోసీటు మాత్రం తగ్గుతుంది. మొత్తంమీద బీజేపీకి పరిస్థితి అనుకూలంగా మారుతుంది.

పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఉన్న సీట్లను ఏ రాష్ట్రమూ కోల్పోకూడదన్న లక్ష్యంతో 2011 జనాభా లెక్కల ఆధారంగా కసరత్తు చేస్తే మొత్తం సీట్లను 718కి పెంచాల్సి వస్తుంది. ఇక 2026 జనాభాని పరిగణనలోకి తీసుకుంటే పెరిగే సీట్లు 848 అవుతాయి. అప్పుడు కేరళ మినహా అన్ని రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి. కానీ ఉత్తర, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల మధ్య తేడాలు ఇంకా ఎక్కువవుతాయి. మొత్తం సీట్లల్లో దక్షిణాది శాతం ఇప్పటికంటే తగ్గిపోతుంది.


రాజ్యసభలో రాష్ట్రాలకు కేటాయించే సీట్లు కూడా జనాభాను బట్టే ఉంటాయి. జనాభా ప్రాతిపదికగా ఆ సీట్లను పెంచినా పరిస్థితి మారదు. లోకసభ సీట్ల విషయంలో తలెత్తిన పరిస్థితే ఇక్కడా ఎదురవుతుంది. అమెరికా సెనేట్‌లాగా ప్రతి రాష్ట్రానికి రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించి ద్రవ్య బిల్లులకు దాని ఆమోదం తప్పనిసరి చేస్తే కొంత పరిష్కారం లభించొచ్చు. ఉత్తరాది ఎంపీలు దీనికి సిద్ధపడతారా? అన్నది పెద్దప్రశ్న. ఆధిపత్యాన్ని ఎవరూ ఉదారంగా వదులుకోరు. దీనికి భిన్నంగా శ్రుతీ రాజగోపాలన్‌ మరొక ప్రతిపాదన చేశారు. జనాభా ఆధారంగా రాజ్యసభ సీట్లను నిర్ణయించే ఫార్ములాకు సవరణ చేపట్టి.. ఆర్థికాభివృద్ధి ప్రకారం సీట్ల కేటాయింపులో మార్పులు చేయవచ్చనీ సూచించారు. రాష్ట్రం సొంత తలసరి రెవెన్యూని బట్టి రాజ్యసభ సీట్లను తగ్గించటం గానీ పెంచటం గానీ చేయగలగాలి. శ్రుతి ఫార్ములా ప్రకారం జాతీయ తలసరి రెవెన్యూని ప్రాతిపదికగా తీసుకుని ఒక రాష్ట్రం సొంత రెవెన్యూ నిష్పత్తి అందులో ఎంత ఉందో చూడాలి. జాతీయ తలసరికి సమానంగా అది ఉంటే, జనాభా ప్రాతిపదికన కేటాయించే రాజ్యసభ సీట్లు యథాతథంగా ఉంటాయి. ఒకవేళ తక్కువ ఉంటే ఆ మేరకు సీట్లలో కోతపడుతుంది. ఎక్కువ ఉంటే సీట్లు పెరుగుతాయి. ఉదాహరణకు బిహార్‌ తలసరి సొంత రెవెన్యూ.. కోవిడ్‌కు ముందు రూ.2,356 ఉంది. జాతీయ సగటు రూ.8,771తో పోల్చితే దాని నిష్పత్తి 0.27 అవుతుంది. తాజా జనాభా (2026) ప్రకారం బిహార్‌కు 21 రాజ్యసభ సీట్లు లభిస్తాయి. కానీ సొంత రెవెన్యూ నిష్పత్తి (0.27) ప్రకారం 5–6 సీట్లే దక్కుతాయి. ఈ పద్ధతి ఆర్థికంగా ముందుండే దక్షిణ, పశ్చిమాదులకు బాగా లాభిస్తుంది. ఇట్లా రాష్ట్రాల రాజ్యసభ ప్రాతినిధ్యాన్ని సొంత రెవెన్యూతో ముడిపెట్టాలి. దాంతో వెనుకబడిన రాష్ట్రాలు కూడా ఆర్థికాభివృద్ధిని సాధించి రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోటానికి కృషిచేస్తాయి.

ఏ కోణం నుంచి చూసినా 75 ఏళ్ల కిందట రాష్ట్రాలకు నిర్దేశించిన హక్కులు, అధికారాలు ఇప్పటి పరిస్థితుల్లో సరిపోవన్నది స్పష్టమవుతూనే ఉంది. 1991 తర్వాత మారిన ఆర్థిక విధానాలతో రాష్ట్రాలకు వ్యాపార, పారిశ్రామికాభివృద్ధిపరంగా లభిస్తోన్న వెసులుబాట్లు రాజకీయాధికారాల్లో కూడా ప్రతిఫలించాలి. పునర్వ్యవస్థీకరణ చుట్టూ రేగుతున్న వివాదాలు ఆ ప్రతిఫలన కోసం సాగుతున్న పెనుగులాటలే! దక్షిణాది ఆర్థిక ప్రగతి రాజకీయాధికారంలో అధిక వాటాకోసం గొంతెత్తేలా చేస్తుంది. దీన్ని జాతీయవాద వ్యతిరేక ధోరణిగా చూస్తే జరిగేది నష్టమే!

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Apr 08 , 2025 | 06:44 AM