South Asia diplomatic Relations: లంకతో మైత్రి

ABN, Publish Date - Apr 08 , 2025 | 06:23 AM

భారతదేశం "ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం" విధానాన్ని 2008లో అమలు చేసి, పొరుగుదేశాలతో సంబంధాలను మెరుగుపర్చే ప్రయత్నం చేసింది. ఈ విధానం, గుజ్రాల్ సిద్ధాంతం ఆధారంగా, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి సహకారాలను ప్రోత్సహిస్తుంది

South Asia diplomatic Relations: లంకతో మైత్రి

పరస్పర గౌరవం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం, శాంతి సామరస్యాలు, ఆర్థిక కలిమి, సంస్కృతి అనేవి ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలకు మార్గదర్శక సూత్రాలుగా ఉండాలి. దీనినే మన విదేశాంగ విధానం ‘ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’గా నిర్వచించింది. 2008లో ఈ విధానానికి అంకురార్పణ చేశారు. నిజానికి దీని మూలాలు 1990 దశకంలో 11 నెలలు మాత్రమే అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఇందర్ కుమార్‌ గుజ్రాల్‌ సిద్ధాంతంలో ఉన్నాయి. పొరుగుదేశాల సమస్యలను అర్థం చేసుకుని వాటికి తగ్గట్లుగా వ్యవహరించడంలో స్వప్రయోజనాలను కూడా పక్కన పెట్టాలని గుజ్రాల్‌ విధాన నిర్దేశం చేశారు.

2008–10 మధ్య మన ఇరుగుపొరుగు దేశాలలో చరిత్రాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2008లో బంగ్లాదేశ్‌లో సైనిక ప్రభుత్వం స్థానంలో షేక్‌ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మాల్దీవుల్లో అబ్దల్‌ గయూమ్‌ మూడు దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమై మహమ్మద్‌ నషీద్‌ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారాన్ని చేపట్టారు. 2010లో మయన్మార్‌లో రెండు దశాబ్దాల సైనిక పాలన ముగిసి ఆంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తదనంతర కాలంలో ఈ దేశాలలో ప్రజాస్వామ్య పాలన సుస్థిరంగా కొనసాగనప్పటికీ ప్రజాస్వామ్య మూలాలు బలపడ్డాయి.


మరో పొరుగుదేశం శ్రీలంకలో పరిణామాలు కొంచెం భిన్నమైనవి. మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాజీవితాన్ని అల్లకల్లోలం చేసిన తమిళ వేర్పాటు వాద సంస్థ ఎల్‌టీటీఈ ప్రభుత్వంతో యుద్ధంలో ఓడిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పొరుగుదేశాల ఆర్థికాభివృద్ధికి, ప్రజాస్వామ్యం సువ్యవస్థితం కావడానికి భారత్‌ పలు విధాల సహాయసహకారాలు అందించింది. అయినప్పటికీ వివిధ కారణాలతో ఆ దేశాలతో భారత్‌ స్నేహ సంబంధాలు సజావుగా సాగలేదు. అవి భారత్‌ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. అ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు న్యూఢిల్లీ సంయమనంతో ఇరుగుపొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. భారత్‌ను తీవ్రంగా వ్యతిరేకించి, చైనా వైపు మొగ్గిన మాల్దీవులు మళ్లీ భారత్‌ అనుకూల వైఖరి చూపుతోంది. శ్రీలంక నుంచి కూడా అటువంటి అనుకూలతను సాధించే ప్రయత్నాలలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలో మూడు రోజులపాటు పర్యటించారు.

శ్రీలంక అధ్యక్షుడుగా అనూర కుమార దిస్సనాయకె అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ప్రప్రథమంగా ఆతిథ్యమిచ్చిన విదేశీ నాయకుడు మోదీయే. గత సెప్టెంబర్‌లో అధికారంలోకి వచ్చిన దిస్సనాయకె తన తొలి అధికారిక విదేశీ యాత్రకు డిసెంబర్‌లో భారత్‌ వచ్చారు. భారత్‌ ప్రయోజనాలకు భంగం వాటిల్లే కార్యకలాపాలను శ్రీలంక భూభాగంపై జరగనివ్వమని వాగ్దానం చేశారు. ఇప్పుడు కొలంబోలో మోదీ సమక్షంలో మరోసారి ఆ వాగ్దానం చేశారు. శ్రీలంక నుంచి ఐపీకెఎఫ్‌ (భారత శాంతి పరిరక్షణ దళం) ఉపసంహరించిన నాలుగు దశాబ్దాల అనంతరం ఉభయ దేశాల మధ్య రక్షణరంగంలో సహాయసహకారాల విషయమై ఒప్పందం కుదరడం విశేషం. హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం అమిత ప్రాధాన్యం సంతరించుకుంది. శామ్‌పూర్‌ విద్యుత్కేంద్రానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు దిస్సనాయకె సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ట్రిక్నోమలీని ఎనర్జీహబ్‌గా అభివృద్ధిపరిచే విషయమై కూడా ఒక అవగాహన పత్రంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.


భారతదేశ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు ఉద్దేశపూర్వకంగా శ్రీలంక ప్రాదేశిక జలాలలోకి ప్రవేశించడం లేదు కనుక వారిని మానవతా దృష్టితో చూడాలని కోరారు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలలో భాగంగానే మోదీ తన పర్యటనలో మత్స్యకారుల సమస్యను ప్రస్తావించారని కొందరు విమర్శించారు. హిందూ మహాసముద్ర తీరస్థ దేశాలలో ఏదో ఒక విధంగా తిష్ఠవేస్తున్న చైనాను అడ్డుకోవడానికి శ్రీలంకతో సంబంధాలకు అగ్ర ప్రాధాన్యమిచ్చి వాటిని పటిష్ఠపరచుకోవలిసి ఉన్నది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరంలో జాతీయ పాలకపక్షం, రాష్ట్ర అధికారపార్టీ, ఇతర రాజకీయ పక్షాలు సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. అలా వ్యవహరించినప్పుడు మాత్రమే ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం అన్న విధానం సార్థకమవుతుంది.

Updated Date - Apr 08 , 2025 | 06:25 AM