ఆశ కలిగించి, ఆవిరైన ‘భగవత్’ బోధ!
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:45 AM
దేశ మత సామరస్యం, ఆధ్యాత్మిక వైవిధ్యం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడని సంక్షోభాన్ని, దాడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత వాటికి ప్రాణం పోసినట్టు...
దేశ మత సామరస్యం, ఆధ్యాత్మిక వైవిధ్యం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడని సంక్షోభాన్ని, దాడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత వాటికి ప్రాణం పోసినట్టు మాట్లాడారు. మసీదుల కింద హిందూ ఆలయాలను వెతికి వివాదాలు రేకెత్తించడం మానుకొమ్మని ఆయన తన అనుచర గణాలకు పిలుపు ఇచ్చారు. గత డిసెంబరు 19న పూణేలో ఒక సభలో మాట్లాడుతూ భగవత్ ఈ హితబోధ చేశారు. దీనికి దేశంలోని సెక్యులర్‌వాదులు ఎంతో హర్షించారు. మైనారిటీ మతాల పెద్దలు కూడా సంతృప్తి చెందారు. నవశకం ప్రారంభం కాబోతోందా అనే ఆశాభావ వాతావరణం కనిపించింది.
అయోధ్య వివాదాస్పద స్థలం హిందూ సంస్థలకు, బాలరాముడికి చెందాలంటూ 2019లో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానితో ఆ స్థలంలో బ్రహ్మాండమైన రామ మందిర నిర్మాణం జరిగింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు దాని మహా ప్రారంభోత్సవం జరిగింది. ఈ చర్యతో లోక్‌సభలో 400 స్థానాలు గెలుచుకుంటామని ఆశించిన బీజేపీకి 240 సీట్లే వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎల్లకాలం ఆలయ సెంటిమెంట్లకు, పరమత ద్వేషానికే ప్రాధాన్యం ఇస్తారనే భ్రమలు వదులుకోవాలని, ప్రజల జీవన సమస్యలను పాలకులు పట్టించుకోనప్పుడు కేవలం విగ్రహ పుష్టితో ఓట్ల వృష్టి ఎంతోకాలం సాగదని ఈ ప్రజా తీర్పు హెచ్చరించింది. అయితే ఊతకర్రల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినా హిందుత్వ ఎజెండాను పూర్తిస్థాయిలో అమలుపరచడానికి బీజేపీ పాలకులు వెనుకాడటం లేదు. అయోధ్య విజయంతో బలం పుంజుకున్న పరివార్ శక్తులు ముస్లింలపై ద్వేషాన్ని రగిలించే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో గల షాహీ జామా మసీదుపై తాజాగా వివాదం లేవదీశారు. అక్కడ అంతకు పూర్వమున్న హరిహర ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి బాబర్ 1526లో ఆ మసీదును నిర్మించాడని స్థానిక కోర్టుకు వెళ్లారు. మసీదు సర్వేకి సంభాల్ కోర్టు గత ఏడాది నవంబర్ 19న ఆదేశించింది. అదే రోజు జిల్లా అధికారుల పర్యవేక్షణలో సర్వే నిర్వహించారు. రెండవసారి సర్వేకి నవంబర్ 24న అధికారులు తమ సిబ్బందితో వెళ్లడంతో మసీదును కూల్చివేయడానికి వచ్చారనే భయం కమ్ముకొని పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఘర్షణల్లో అయిదుగురు దుర్మరణం పాలయ్యారు.
మసీదులు, దర్గాల కింద ఆలయాలున్నాయని, వాటి పునరుద్ధరణకు ఆదేశించాలని కోరుతూ హిందూ సంస్థలు స్థానిక కోర్టులకు ఎక్కితే, కొన్ని కోర్టులు అటువంటి మసీదులపై సర్వేకి ఆదేశించాయి. వారణాసిలో 1670లో నిర్మించిన గ్యాన్‌వాపి మసీదు వివాదం ఇందులో ముఖ్యమైనది. దీని కింద విశ్వనాథుని ఆలయం ఉందని ఆలయ పునరుద్ధరణ శక్తులు వాదిస్తున్నాయి. 1669లో ఔరంగజేబు ఆదేశాలపై అక్కడి విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాల మీద మసీదు నిర్మించారన్నది వారి వాదన. మసీదు దక్షిణ భాగంలో పూజలు చేసుకోడానికి స్థానిక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులతో క్షణం జాగు చేయకుండా అక్కడ ఆరాధన ప్రారంభించారు. ఇది 2024 ఫిబ్రవరి 1న జరిగింది. అందుకు నిరసన సంకేతంగా ఆ మరుసటి రోజు శుక్రవారం నాడు అసాధారణ స్థాయిలో 3000 మంది ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనకు హాజరయ్యారు. గ్యాన్‌వాపికి కూడా బాబ్రీ మసీదుకు కలిగిన పరిస్థితే కలుగుతుందని వారు భయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో కృష్ణుడి గుడిని కూల్చివేసి ఔరంగజేబు అక్కడ షాహీ దర్గాను కట్టాడన్నది మరో వివాదం. ఈ వివాదాలు దేశంలో మత సామరస్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తూ ఎక్కడికక్కడ మందుపాతరలను సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో– నాయకులం అయిపోవాలనే అత్యాశతో మసీదుల కింద శివలింగాల కోసం వెతకడం మానుకోండని మోహన్ భగవత్ హెచ్చరించడం బాగుంది. ‘ప్రతి రోజూ ఒక కొత్త వివాదాన్ని రేకెత్తిస్తుంటే దానిని ఎలా అనుమతిస్తారు? ఇది ఇలా కొనసాగడానికి వీల్లేదు. మనం కలిసి బతకగలమని చూపించాలి,’ అని కూడా భగవత్ హితవు చెప్పారు. ‘ప్రపంచానికి శాంతి సామరస్యాలు కావాలి, భారతదేశం తన భిన్నత్వంలో ఏకత్వ సంప్రదాయాన్ని, అందరినీ కలుపుకొనిపోయే సమ్మిళిత తత్వాన్ని ప్రదర్శించి విశ్వగురువుగా నిరూపించుకోవాలి’ అని కూడా అన్నారు ఆయన.
భగవత్ పూణే ప్రసంగం సద్దుమణగకముందే ఆర్‌ఎస్ఎస్ సోదర సంస్థలు తాము అందుకు అంగీకరించబోమని కరాఖండిగా స్పష్టం చేశాయి. మతసంబంధ విషయాల్లో మతసంస్థలే నిర్ణయం తీసుకోవాలి కాని ఆర్‌ఎస్‌ఎస్ కాదని అఖిల భారతీయ సంత్ సమితి దృఢంగా ప్రకటించింది. మత నాయకుల నిర్ణయాలను ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌లు గౌరవించాలని కూడా సంత్ సమితి స్పష్టం చేసింది. మసీదులను కూల్చి ఆలయాలు నిర్మించవలసిన స్థలాలు ఇంకా 56 ఉన్నాయని ఈ సమితి ప్రధానకార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి వెల్లడించారు. మోహన్ భగవత్ తమను శాసించలేరని, ఆయనకు ఆ స్థాయి లేదని జగద్గురు రామభద్రాచార్య అభిప్రాయపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ వార పత్రిక ‘ది ఆర్గనైజర్’ మోహన్ భగవత్ హితబోధను సుతిమెత్తగా చెత్త బుట్టకు చేరవేసింది. ‘మసీదుల కింద గల గుడులను పునరుద్ధరించాలన్నది మన జాతీయతా గుర్తింపు సంబంధమైనది, నాగరికతా న్యాయం కోసం ఉద్దేశించినది. దీనిని కుహనా సెక్యులర్ అద్దంలో హిందూ ముస్లిం గొడవగా చూడరాదు’ అని ఆ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొని, అలా అధినేత మాటనే కొట్టిపారేసింది. ఈ దేశానిది హిందూ జాతీయతేనని నొక్కివక్కాణించింది.
మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో వ్యక్తమైన సర్వమత సామరస్యం, సమధర్మం భారత రాజ్యాంగ స్ఫూర్తి అయిన సెక్యులరిజానికి చేరువైనది. పరివార్ శక్తులు ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకంగా స్పందించిన తర్వాత ఇక భగవత్ కిమ్మనలేదు. ప్రధాని మోదీ గాని, హోమ్ మంత్రి అమిత్ షా గాని నోరు విప్పలేదు అంటే వారు కూడా మోహన్ భగవత్ మాటను గౌరవించడం లేదనుకోవాలి.
1991 నాటి ప్రార్ధనా మందిరాల చట్టంపై తన తీర్పు వెలువడే వరకు మసీదుల కింద మందిరాలున్నాయని వాదిస్తూ వాటిపై సర్వే జరిపించాలని కోరే వ్యాజ్యాలను అనుమతించరాదని దేశంలోని కోర్టులన్నిటికీ సుప్రీంకోర్టు డిసెంబర్ 13న ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కును, ‘సౌభ్రాత్రం’ అనే పదాన్ని గమనిస్తే సెక్యులరిజం రాజ్యాంగ ప్రధాన లక్షణమని బోధపడుతుంది అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. సెక్యులరిజం ఎల్లప్పుడూ రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమేనని ధ్రువపరిచింది. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని వేసిన కేసులను గత నవంబర్ 25న కొట్టివేస్తూ ఈ అభిప్రాయాన్ని ప్రకటించింది.
దేశంపై హిందూ రాజ్యాన్ని, హిందూ సంస్కృతిని రుద్దాలన్నది ఆర్ఎస్‌ఎస్ లక్ష్యమని సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వయంగా అన్నారు. అటువంటి సంస్థ అధినేత చేసిన మతసామరస్య ఉద్బోధ వెనువెంటనే అపహాస్యం పాలుకావడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. వాస్తవానికి నిజమైన హిందూమతావలంబులు ఎవ్వరూ హిందుత్వ మోదీత్వ శక్తుల మతవైరతత్వాన్ని మెచ్చరు. దేశంలో ఇంతకాలంగా భిన్న మతస్థుల మధ్య సహజీవన సామరస్యాలు సురక్షితంగా కొనసాగాయంటే అది ఇక్కడి బహుళత్వ సంస్కృతి గొప్పదనమే. దానిని వమ్ము చేయడానికి జరుగుతున్న కుట్ర కొంతైనా ఆగుతుందేమోనన్న ఆశ కల్పించిన భగవత్ ఉద్బోధకు ఈ గతి పట్టడం బాధాకరం. ప్రజల్లో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం పట్ల గౌరవ అభిమానాలను పెంచడానికి ప్రజాస్వామిక శక్తులు పునరంకితం కావడమొక్కటే శరణ్యం.
జి. శ్రీరామమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
Updated Date - Jan 09 , 2025 | 02:45 AM