ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RK Kothapaluku : భయ భక్తులు ఉన్నాయా?

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:51 AM

తిరుపతిలో రెండు రోజుల క్రితం జరిగింది ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒక పోలీసు అధికారి సదుద్దేశంతో అయినప్పటికీ అనాలోచితంగా గేట్లు తెరవడంతో... వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల కోసం భక్తులు ఎగబడటంతో...

RK Kothapaluku

తిరుపతిలో రెండు రోజుల క్రితం జరిగింది ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒక పోలీసు అధికారి సదుద్దేశంతో అయినప్పటికీ అనాలోచితంగా గేట్లు తెరవడంతో... వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల కోసం భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారు. కుంభమేళాలు, పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన సంఘటనలను గతంలో కూడా చూశాం. కాకపోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆరుగురు చనిపోవడం తిరుమల–తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం! దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హుటాహుటిన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. తొక్కిసలాట సంఘటన తర్వాత జరిగిన సన్నివేశాలు మాత్రం జుగుప్సాకరంగా ఉన్నాయి. కొండ మీద ఏం జరుగుతోంది? అన్న సందేహాలు తలెత్తాయి. ఈ సందర్భంగా రాజకీయాలు, వ్యక్తుల మధ్య వైషమ్యాలు బయటపడటం శోచనీయం. తిరుమలలో ఆ దేవదేవుడికి సేవ చేసుకొనే అవకాశం లభించడాన్ని మహాభాగ్యంగా పరిగణించాలి. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భావించాల్సిన సన్నివేశాలు చోటుచేసుకోవడమే అసలైన విషాదం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తిరుమల తిరుపతి పాలకమండలి చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గొడవపడ్డారు. బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్న వారి మధ్య భేషజాలు ఏర్పడి భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయమై సమన్వయం కొరవడినట్టు స్పష్టమవుతోంది. కీలక పదవులలో ఉన్న వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.


భయం లేదా...

సాక్షాత్తూ ముఖ్యమంత్రి సమక్షంలోనే గొడవపడటానికి చైర్మన్‌కూ, ఈవోకూ ఎంత ధైర్యం ఉండాలి? జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా కూర్చోవడానికి కూడా అధికారులు జంకేవారు. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్‌ వద్దనే అంతగా భయభక్తులు ప్రదర్శించిన అధికారులు పద్నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి? అలాంటిది ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించడమేమిటి? తిరుమలలో ఉన్నత స్థాయిలో సమన్వయం కొరవడిందని, వైషమ్యాలు పరాకాష్ఠకు చేరాయన్న విషయం ప్రభుత్వానికి ముందుగా తెలియదా? టీటీడీ ఈవో పదవి చేపట్టాలని ఐఏఎస్‌ అధికారులు పోటీపడుతుంటారు. పాలక మండలి చైర్మన్‌ పదవికి ఎంత గిరాకీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ పదవులకు ఎందుకంత డిమాండ్‌? దేవుడిపై భక్తితోనా? లేక... శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని తద్వారా తమ పలుకుబడి పెంచుకోవడానికా? అన్నది ఇక్కడ కీలకం. నిజానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు మాత్రమే దేవుడిపై భక్తి ఉంటుంది. ఆ దేవుడి పుణ్యమా అని కొండమీద కొలువులు దక్కించుకున్న వారిలో కొందరికి దేవుడిపై అంతగా భక్తి ఉన్న దాఖలాలు లేవు. నిజంగా దేవుడిపై భక్తి ఉన్నా, పాప పుణ్యాలపై నమ్మకం ఉన్నా కొండమీద చేతి వాటాలు జరగవు కదా? దేవుడిపై నమ్మకంతో భక్తులు సమర్పించే కానుకలపై ఆధారపడి జీతభత్యాలు పొందుతున్న వారిలో ఎంత మందిలో నిజమైన భక్తి ఉంది? అంటే చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల పోస్టులకు కూడా డిమాండ్‌ పెరిగింది. పాలక మండలి సభ్యుడి పోస్టు కోసం రూ.10 నుంచి 20 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడని వారు ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడిపై నిజమైన భక్తితో కొందరు ఆ పోస్టును ఆశిస్తుండగా, అత్యధికులు మాత్రం దీన్ని ఒక స్టేటస్‌ సింబల్‌గా పరిగణిస్తున్నారు. సొంత పలుకుబడి పెంచుకోవడానికి దాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చైర్మన్‌, ఈవో, జాయింట్‌ ఈవో పోస్టులకు భారీ ఎత్తున లాబీయింగ్‌ జరుగుతుంది. కేవలం ఆ దేవ దేవుడి మీద భక్తితో మాత్రమే అయితే ఆధిపత్య పోరుకు దిగకూడదు కదా? దేవుడి సేవలో తరించాలి కదా! భగవంతుడి సన్నిధిలో పెత్తనం చేయాలనుకోవడం ఏమిటి? తామే పెత్తనం చేయాలన్న పట్టుదలలు పెరగడం వల్లనే అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ దేవుడే లేకపోతే చైర్మన్‌, ఈవో పోస్టులు ఎక్కడివి అన్న స్పృహ ఉండాలి కదా!


పెద్ద గుళ్లకే డిమాండ్‌...

ప్రజలలో భక్తి పెరగడం వల్ల తిరుమలలోనే కాదు అన్ని దేవాలయాల వద్దా రద్దీ ఏర్పడుతోంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పదవుల పోటీ కూడా పెరుగుతోంది. భక్తుల ఆదరణ కొరవడి ధూప దీప నైవేద్యాలకు దిక్కులేని గుళ్లు ఎన్నో ఉన్నాయి. వాటి పదవులకోసం ఎవరూ ఎందుకు పోటీ పడరు? దేవుడిపై నిజంగా భక్తి ఉంటే ఆ గుళ్లను అభివృద్ధి చేయడానికి పోటీ పడవచ్చుకదా! ‘తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది... డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది’ అని కవి గజ్జెల మల్లారెడ్డి ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు భక్తిరసం వరదలై పారుతోంది. కారణాలు ఏవైనా ప్రజల్లో భక్తి భావం పెరుగుతుండటం వల్ల ప్రవచనకారుల సంఖ్య కూడా పెరుగుతోంది. డొక్కశుద్ధి, వాక్‌శుద్ధి లేని వారు కూడా ఒళ్లంతా బొట్లు పెట్టుకొని ప్రజల్లో మూఢ భక్తిని ప్రేరేపిస్తున్నారు. ఫలానా నూనెతో దీపం వెలిగించాలి.. అప్పుడే ఇష్టవాంఛ నెరవేరుతుందని చెబుతున్నారు. ఫలానా విధంగా పూజలు చేయాలని ఏ శాస్త్రంలో రాశారు? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పవిత్ర మనసుతో దేవుడికి మనసులో దండం పెట్టుకుంటే ఆ దేవుడు కనికరించడా? భక్తి అనేది ఇప్పుడు ప్రధాన వ్యాపారంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రవచనకారుల మధ్య కూడా వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. అపారమైన విద్వత్‌ కలిగిన గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం గురించి జరిగిన ప్రచారం కూడా ఈ కోవలోకే వస్తుంది. అహాన్ని వదులుకోలేని వారికి భక్తులకు బోధించే అర్హత ఉంటుందా? అసూయను వళ్లంతా నింపుకొని ఎన్ని సుద్దులు చెబితే మాత్రం ఏమి ప్రయోజనం? ధర్మ నిష్ఠ లేనప్పుడు ఎంత భక్తిని ప్రదర్శించినా ఏమిటి ప్రయోజనం? ప్రజల్లో స్వార్థ కాంక్షను తగ్గించలేని ప్రవచనాల వల్ల ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం!


మరణ రాజకీయం...

తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. విషాదానికి బాధ్యత మీదంటే మీదంటూ పాలక మండలి – అధికారుల మధ్య వివాదం మొదలైంది. సందట్లో సడేమియా అన్నట్టుగా జగన్‌రెడ్డితో పాటు ఆయన రోత మీడియా యధావిధిగా విషప్రచారం మొదలుపెట్టింది. చనిపోయినవారు చనిపోగా మిగతా భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవదేవుడి దర్శనం చేసుకొని తరించారు. కానీ... ఆధిపత్య పోరు మాత్రం తగ్గలేదు. జరిగిన విషాదానికి నైతిక బాధ్యత తీసుకొని భక్తులకు క్షమాపణలు చెప్పడంలో కూడా వివాదమేనా? ముఖ్యమంత్రి సమక్షంలోనే గొడవపడిన చైర్మన్‌, ఈవో అంతటితో తగ్గలేదు. శుక్రవారం నాడు జరిగిన పాలక మండలి అత్యవసర సమావేశంలో కూడా విభేదాలు బయటపడ్డాయి. దీనికితోడు తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్న మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వ్యాఖ్యానించడంతో దాని ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడింది. ఎవరో ఏదో అన్నారని క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా చైర్మన్‌ వ్యాఖ్యానించడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. నిజానికి పవన్‌ కల్యాణ్‌ చేసిన సూచనలో తప్పు లేదు. జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పడం హుందాగానే ఉంటుంది. కారణం తెలియదుగానీ, చైర్మన్‌ తొలుత క్షమాపణలు చెప్పడానికి నిరాకరించి.. తర్వాత సర్దుకున్నారు. తిరుమలలో చైర్మన్‌, ఈవో, అదనపు ఈవోల మధ్య సఖ్యత కొరవడిన విషయం ప్రభుత్వానికీ తెలుసు. సంఘటన జరిగిన రోజు తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యంతం సీరియస్‌గానే ఉన్నారు. బాధితులను పరామర్శించిన తర్వాత సమీక్ష సందర్భంగా పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి ‘మీ మధ్య మాటలు కూడా ఉండనట్టుగా ఉంది’ అని చైర్మన్‌, ఈవోను ఉద్దేశించి అన్నారు. ఆ తర్వాత కూడా వారిరువురూ తన సమక్షంలోనే వాదులాడుకోవడంతో ముఖ్యమంత్రికి చిర్రెత్తుకొచ్చింది. పరిస్థితిని చక్కదిద్దకపోతే టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసింది. తన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారని ఆయన మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాలక మండలికి, అధికారులకు మధ్య వివాదాలు ఏర్పడటం కొత్త కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది. పాలనా వ్యవహారాలన్నింటినీ చైర్మన్‌ కార్యాలయం ఆధ్వర్యంలోకి తీసుకోబోతున్నట్టు బీఆర్‌ నాయుడు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. దర్శనాలకు సంబంధించిన సిఫారసుల విషయంలోనే అధికారులతో పాలక మండలి సభ్యులకు గొడవలు వస్తుంటాయి. లెక్కకు మించి సిఫారసులు చేయడంపై అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో కొంత మంది పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితోపాటు బీజేపీకి చెందిన భానుప్రకాశ్‌రెడ్డి ప్రభృతులు చైర్మన్‌ నాయుడును ప్రభావితం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాటి సమావేశంలో భానుప్రకాశ్‌ రెడ్డి కల్పించుకొని ‘ఏమిటి.. తమాషాలు చేస్తున్నారా?’ అని ఈవో శ్యామలరావును ఉద్దేశించి పరుషంగా వ్యాఖ్యానించారు. పాలక మండలి సభ్యుల సిఫారసు లేఖలలో కొన్నింటిని అధికారులు తిరస్కరించడం కొత్త కాదు. గతంలో కూడా జరిగింది. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు అధికారాలు అన్నీ ఆయన వద్దే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ ఎవరూ కిమ్మనలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పాలక మండలిలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఈ కారణంగా వారు అవసరానికి, పరిమితికి మించి స్వేచ్ఛను తీసుకుంటున్నారు.


ఇతర పార్టీల సభ్యులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అదుపు ఉండటం లేదు. అధికారులకు కూడా దిక్కుతోచడం లేదు. నిర్ణయాలన్నీ తమకు చెప్పిన తర్వాత మాత్రమే తీసుకోవాలని అధికారులపైన పాలక మండలి ఒత్తిడి తెస్తోంది. సీనియర్‌ అధికారులమైన తమపై సభ్యుల పెత్తనం పెరిగిపోవడం ఏమిటి? అని అధికారులు గుర్రుగా ఉంటున్నారు. దీంతో అధికారులకు, పాలక మండలికి మధ్య సమన్వయం కొరవడింది. నిజానికి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఈవో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. అయినా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా యంత్రాంగంతో జరిపిన సమావేశాల గురించి తనకు మాట మాత్రమైనా చెప్పలేదని చైర్మన్‌ నాయుడు ఆగ్రహంగా ఉన్నారు. టీటీడీ చట్టం ప్రకారం పాలక మండలికి విశేష అధికారాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు పాలక మండలి అనేది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితం అయింది. ఈ కారణంగానే ఈవోలుగా నియమితులైన సీనియర్‌ అధికారులు తమ విధులను సజావుగా నిర్వహించగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫలితమే తాజా వివాదాలు. జరిగిన దానికి అధికారులు బాధ్యత తీసుకోవాలా? పాలక మండలి తీసుకోవాలా? అన్న వివాదం కొత్తగా తలెత్తింది. చట్టంలోని ఒక నిర్దుష్టమైన సెక్షన్‌ ప్రకారం పాలక మండలికి సర్వాధికారాలు ఉన్నందున ఈవోలుగా సీనియర్‌ అధికారులను నియమించడం అనవసరం. ఆర్డీవో స్థాయి అధికారిని నియమిస్తే సరిపోతుంది. అయితే దీనివల్ల పాలక మండలి సభ్యుల పెత్తనం పెరిగిపోయి దేవస్థానం పాలనా వ్యవహారాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది.


అదీ మోదీ పవర్‌...

కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధికారానికి తిరుగులేదు. భాగస్వామ్య పక్షాలన్నీ తమ పరిమితులను తెలుసుకొని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రికి పోటీగా ఇతర భాగస్వామ్య పక్ష నాయకులు ప్రకటనలు చేసేందుకు సాహసించడం లేదు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బలంపైన ఆధారపడి మనుగడ సాగిస్తోంది. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. జనసేన, బీజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బాధితులను పరామర్శించడానికి విడిగా వెళ్లారు. ఒకరకంగా ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. జనసేన పార్టీకి పవన్‌ కల్యాణ్‌ అధినేత కూడా. తన పార్టీ తరఫున స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకొనే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్‌ కల్యాణ్‌ ఇతర మంత్రులతోపాటు మరో మంత్రి మాత్రమే. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. తను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్‌ కల్యాణ్‌ కోరుకోవడం ఆయన కోణంలో సరైనదే కావచ్చు. ప్రభుత్వపరంగా చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది. ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలితే దాని ప్రభావం పాలనా యంత్రాంగంపై ఉంటుంది. ఎవరి ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న సందేహం అధికారుల్లో ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని కొంతమంది అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రుల వలె పవన్‌ కల్యాణ్‌ కూడా తిరుపతి పర్యటనకు వెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. విలేకరుల సమావేశంలో కూడా ఇరువురూ సమష్టిగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అలా కాకుండా విడివిడిగా ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడుతుంది. సంకీర్ణ ధర్మానికి అందరూ కట్టుబడి ఉంటే ఏ గొడవా ఉండదు. జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్‌ ఇంజనీరింగ్‌ పేరిట ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు. అయితే, వారెప్పుడూ తాము మిగతా మంత్రుల కన్నా అధికులమని చెప్పుకొనే పనిచేయలేదు. పవన్‌ కల్యాణ్‌ జనసేన అధినేత కనుక ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి. ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదనుకుంటే... ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి.


ఎవరు బాధ్యులు?

మృతుల కుటుంబాలకు పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్‌ కల్యాణ్‌ కోరడం ముమ్మాటికీ సమర్థనీయమే. కింది స్థాయి అధికారులు చేసే తప్పిదాలకు ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే, ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఆనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయినందున పాలక మండలి నైతిక బాధ్యత తీసుకోవడంలో తప్పు లేదు. నామోషీ అంతకన్నా లేదు. అయితే పవన్‌ కల్యాణ్‌ ఈ ప్రకటనను ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే బాగుండేది. విషయాలు స్వల్పమే అయినప్పటికీ అవి భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉంటుంది. కూటమిలో చిచ్చు పెట్టడానికి జగన్‌ అండ్‌ కో కాచుకొని ఉన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారిలో విశ్వాసం ఏర్పడాలన్నా కూటమిలో ఐక్యత ఉంది–ఉంటుంది అన్న నమ్మకం కూడా కలిగించాలి. తెలుగుదేశం–జనసేన–బీజేపీ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తితే దాని ప్రభావం ఆ పార్టీలపైనే కాదు– రాష్ట్రంపైనా పడుతుంది. కూటమి విచ్ఛిన్నమైతే 2029లో పరిస్థితి ఏమిటి? అన్న సందేహం పెట్టుబడిదారుల్లో కలగకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పటికే జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రారు అన్న భరోసా ఇవ్వగలరా? అని పెట్టుబడులు పెట్టేవారు అడుగుతున్నారని మంత్రి లోకేశ్‌ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం–జనసేన మధ్య, ముఖ్యంగా చంద్రబాబు–పవన్‌ కల్యాణ్‌ మధ్య మరింత సమన్వయం అవసరం. అదే సమయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల కొండపై పరిస్థితిని గాడిలో పెట్టడానికి చంద్రబాబు–పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా యోచన చేయాలి. ముఖ్యమంత్రి అంటే లెక్కలేకుండా తన సమక్షంలోనే గొడవపడిన చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావును చంద్రబాబు ఆరోజే మందలించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. వైకుంఠ ఏకాదశి రద్దీ ఉన్నందున భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించకుండా బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించడం సమంజసం కాదన్న ఈవో అభిప్రాయాన్ని బోర్డు సభ్యులు లెక్కచేయలేదు. ఈ సమస్యకు వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారం కనుగొనాలి. లేనిపక్షంలో తిరుమల ప్రతిష్ఠ మంటకలవడమే కాకుండా దాని ప్రభావం చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై కూడా పడుతుంది. కొండ మీద ఆధిపత్య పోరువల్ల సామాన్య భక్తులు బలి కాకూడదు. పదవులలో ఉన్న వారికి దేవుడిపై నిజంగా భక్తి ఉంటే భేషజాలను వెంటనే వదులుకోవాలి. ఆ దేవుడే లేకపోతే మనమూ లేము– మన పదవులూ లేవన్న వాస్తవాన్ని గుర్తించి మెలుగుతారని ఆశిద్దాం! తిరుమల చరిత్రలో మొదటిసారిగా జరిగిన ఈ దురదృష్టకర సంఘటన చివరిది కావాలని కోరుకుందాం!

ఆర్కే


యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - Jan 12 , 2025 | 07:59 AM