ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముప్పే... బాబూ!

ABN, Publish Date - Jan 05 , 2025 | 12:56 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మొదటికే వచ్చారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని ఆటుపోట్లను, అవమానాలను, కష్టాలను 2019–2024 మధ్య ఎదుర్కొని నిలబడ్డ ఆయన మారతారనీ...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మొదటికే వచ్చారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని ఆటుపోట్లను, అవమానాలను, కష్టాలను 2019–2024 మధ్య ఎదుర్కొని నిలబడ్డ ఆయన మారతారనీ, అభివృద్ధి – సంక్షేమంతోపాటు రాజకీయం అజెండాగా పెట్టుకొని పనిచేస్తారని అందరూ ఆశించారు. ఆయన కూడా నేను మారాననీ, తనలో 1995 నాటి చంద్రబాబును 2.0 రూపంలో చూస్తారని అధికారంలోకి రాగానే నమ్మబలికారు. ఆరు నెలలు గడిచే సరికి ఆయనలో 1999–2004 నాటి చంద్రబాబు తన్నుకు వచ్చారు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 2019లో ఓడిపోయిన తర్వాత పలకరించేవారు కూడా కరువై అల్లాడిపోయారు. పార్టీ నిర్వహణ కూడా పెను భారంగా మారింది. 2020లో వచ్చి పడిన కొవిడ్‌ పుణ్యమా అని మనుషులు కనపడకపోయినా ఆయన నెట్టుకొచ్చారు. 2022 నాటికి జగన్‌రెడ్డి అరాచక పాలన పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పురుడు పోసుకుంది. జన సేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా చంద్రబాబుతో చేతులు కలపాల్సిన పరిస్థితిని జగన్‌రెడ్డి కల్పించారు. దీంతో చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకున్నారు. రాజకీయమే ప్రశ్నార్థకంగా మారిన దశ నుంచి నాలుగో పర్యాయం అధికార పగ్గాలు చేపట్టగలిగారు. అయితే, తాను మారానని చెప్పుకొన్న ఆయన ఈ ఆరు నెలల్లో నిజంగా మారారా లేదా అన్న ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పనితీరును పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన పోకడలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. రాజకీయంగా తనకు ఏమి కావాలన్న దానిపై ఆయనలో స్పష్టత కొరవడినట్టు ఈ ఆరు నెలల్లో చోటుచేసుకున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2029 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం గురించి ఇప్పుడే చెప్పలేం. అయితే, 2029 తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకం కాకూడదని పార్టీ నాయకులు, శ్రేణులు బలంగా అభిప్రాయపడుతున్నారు.


భవిష్యత్తుపై భరోసా కోసం...

జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమీకృతం కావడంతో పాటు జనసేన, బీజేపీ కూడా చేతులు కలపడంతో... చంద్రబాబు మాత్రమే కాదు, రాష్ట్రం కూడా గండం నుంచి బయటపడింది. ఇప్పుడు 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అందోళన పార్టీ వర్గాలనే కాదు – రాష్ట్ర హితవు కోరే వారిని కూడా కలవరపరుస్తోంది. వయసు రీత్యా 2029 నాటికి చంద్రబాబు క్రియాశీలంగా ఉండగలరో లేదో తెలియదు. రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయాలు జగన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. జగన్‌రెడ్డి ఇప్పటికే తాను ఏమిటో రుజువు చేసుకున్నారు. అతనికి కొన్ని వర్గాలు బలంగా మద్దతు ఇస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌కు కాపు సామాజిక వర్గం పూర్తి అండగా ఉంది. మిగతా వర్గాలకు చేరువ కావడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి లోకేశ్‌ పరిస్థితి ఏమిటి? మర్రిచెట్టు కింద మరో మొక్క బతికి బట్టకట్టదు అన్నట్టుగా అతడి పరిస్థితి ఉంది. చంద్రబాబు నీడలోనే ఆయన ఉన్నారు. చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంత వరకు లోకేశ్‌ ఎదగడం కష్టం. ‘యువగళం’ పేరిట పాదయాత్ర చేసినంత మాత్రాన అతడు ప్రజా నాయకుడిగా ఎదిగాడని భావించలేం. లోకేశ్‌కు మంత్రిత్వశాఖ కేటాయింపులో కూడా చంద్రబాబు తప్పు చేశారు. ఇప్పుడు లోకేశ్‌ ఎంతగా శ్రమించి పెట్టుబడులు, కంపెనీలు తీసుకువచ్చినా ఆ ఖ్యాతి చంద్రబాబు ఖాతాలోకే పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్నప్పుడు ఐటీతో పాటు ఇతర రంగాల్లోకి పెట్టుబడులను ఆకర్షించే ఓపిక, నైపుణ్యం ఆయనలో ఉండేవి కావు. ఆ కారణంగా ఆ సబ్జెక్టులను కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి తాను రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించారు. చంద్రబాబు, లోకేశ్‌ పరిస్థితి వేరు. అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబుకు ఇప్పటికే పేరుంది. అధికారంలో ఉన్నంత సేపు చంద్రబాబు అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించేవారు. రాజకీయాన్ని గాలికి వదిలేసేవారు. ఈ కారణంగానే 2004, 2019లో ఆయన ఓడిపోయారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయానికి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ కారణంగానే ఆయన అత్తెసరు మెజారిటీతోనైనా 2009లో తిరిగి అధికారంలోకి రాగలిగారు.


లోకేశ్‌ భవిష్యత్తు...

తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ఏర్పాటు చేసినప్పటికీ 1995 తర్వాత నుంచి పార్టీని నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎన్టీఆర్‌ వేసిన బలమైన పునాది, చంద్రబాబు చాణక్యం కారణంగా నాలుగు దశాబ్దాలు దాటినా తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తోంది. ఇప్పుడు చంద్రబాబుకు వయోభారం కమ్ముకొస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తర్వాత ఎవరు? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది. చంద్రబాబు వారసుడిగా లోకేశ్‌ తెర మీద కనిపిస్తున్నప్పటికీ... చంద్రబాబు నీడ మీద పడుతున్నంత వరకు ప్రత్యామ్నాయ నాయకుడిగా అతడికి ప్రజామోదం లభిస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే. 2029 నాటికి రాష్ట్ర రాజకీయాలు జగన్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ మధ్యనే కేంద్రీకృతం అవుతాయి. జగన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ సొంత పార్టీలకు సారథ్యం వహిస్తున్నారు. లోకేశ్‌ పరిస్థితి అది కాదు. చంద్రబాబు ఉన్నంత వరకు అతను పార్టీ అధ్యక్షుడు కాగలరా? చంద్రబాబు ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ 2029 నాటికి ఆయన ఎనిమిది పదుల వయసుకు చేరువవుతారు. అంటే ఈ లోపుగానే చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేశ్‌లో ఉందని అటు ప్రజలతోపాటు ఇటు శ్రేణుల్లోనూ నమ్మకం కలిగించాలి. ప్రస్తుతానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ భారతీయ జనతా పార్టీకి ఆప్తుడుగా ఉంటున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబును పూర్తిగా నమ్ముతుందని భావించలేం. పవన్‌ కల్యాణ్‌ను ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయత్వం తలపోస్తోందని చెబుతున్నారు. అవినీతి కేసుల కారణంగా జగన్‌రెడ్డి బలహీనపడితే ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆక్రమించే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగి ఏడు నెలలైనా, తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి రాగలిగినా జగన్‌రెడ్డి కేసులలో కదలిక మాత్రం ఉండటం లేదు. పవన్‌ కల్యాణ్‌ విషయానికి వస్తే ఆయన ఎప్పుడైనా కేంద్రంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే రాష్ట్రంలో తన స్థానంలో తన సోదరుడు నాగబాబును మంత్రిని చేయాలని ఆయన కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నెత్తికెత్తుకున్నారు. అంటే, బీజేపీతో ఆయనకు బలమైన అనుబంధం ఏర్పడిందని భావించాలి. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. తెలుగుదేశం–జనసేన మధ్య ప్రస్తుతం ఉన్న సఖ్యత 2029 వరకు కూడా కొనసాగుతుందని చెప్పలేం. ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ తన ప్రయత్నాలను ఇదివరకే మొదలుపెట్టింది. వయోభారం కారణంగా చంద్రబాబు పనై పోతుందని, జాతీయ స్థాయిలో అత్యధిక పాపులారిటీ కలిగి ఉన్న పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తే బాగుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 2029 నాటికి తెలుగుదేశం పార్టీ ముందు ఉండబోయే సవాళ్లు ఇవే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌ల ఆలోచనలు ఏమిటో తెలియదు. ఇరువురూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.


చంద్రబాబు మారారా...

తనలో 1995 నాటి వెర్షన్‌ చూస్తారని చంద్రబాబు చెప్పినప్పటికీ ఆయనలో 1999–2004 మధ్య పుట్టుకొచ్చిన చంద్రబాబే కనిపిస్తున్నారని అంటున్నారు. అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటూ మంత్రులు, పార్టీ నాయకులకు కూడా సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రభుత్వపరంగా వెలువడుతున్న అధికారిక ప్రకటనలు కూడా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేవిగా కనిపించడం లేదు. 1999 తర్వాత తనను తాను సీఈవోగా పిలిపించుకోవడానికి ముచ్చటపడిన చంద్రబాబు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుకు, ఔటర్‌ రింగురోడ్డుకు, సైబరాబాద్‌ నగరానికి అంకురార్పణ చేశారు. హైదరాబాద్‌ నగరంపై అధికంగా ఫోకస్‌ చేశారు. దీంతో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం అవుతోందని ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా 22 జిల్లాల ప్రజలు అభిప్రాయపడ్డారు. సంపద సృష్టి గురించి అప్పుడు కూడా పదే పదే మాట్లాడేవారు. గిరిజన తండాలకు వెళ్లినప్పుడు వారి మౌలిక సమస్యలు అడిగి తెలుసుకోకుండా సత్యం కంప్యూటర్స్‌ రామలింగరాజువలె అందరూ అభివృద్ధిలోకి రావాలని చెప్పేవారు. తాగడానికి గుక్కెడు నీటి కోసం ఎదురుచూసే గిరిజనుల వద్ద సత్యం రామలింగరాజు గురించి చెబితే వికటించదా? అదే జరిగింది. తాను ఫోకస్‌ పెట్టిన హైదరాబాద్‌ నగరంలో కూడా 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు పరాభవమే మిగిలింది. ఐఎస్బీ వంటి సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పడటానికి చంద్రబాబే కారణమని ఇప్పటికీ పలువురు ప్రశంసిస్తారు. అంత మాత్రాన ఆ ప్రశంసలు ఓట్లు తెచ్చిపెట్టవని రుజువైంది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఐదేళ్లలో చేయగలిగే వాటి గురించి మాత్రమే ఆయన చెప్పేవారు. ఫలితంగానే ఆయన మరణించే వరకు ప్రధానిగానే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి పరిస్థితులతో ఇప్పటి పరిస్థితులను పోల్చలేం. ఆర్థిక సంస్థల వద్ద నిధులు మూలుగుతున్నాయి. ఎంతటి భారీ ప్రాజెక్టుకైనా నిధుల కొరత అడ్డంకి కావడంలేదు. లక్ష కోట్లతో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటే నిధుల లభ్యత ఉన్నందునే కదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి పూనుకుంది. పదేళ్లు దాటినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కానందున ఇలాంటి భారీ ప్రాజెక్టులపై ప్రజలకు సహజంగానే అనుమానాలు ఉంటాయి. సంకల్ప బలం ఉండి సరైన ప్రణాళికతో వ్యవహరించి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. 2014–2019 మధ్య కాలంలో వలె ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పోలవరం–రాజధాని అమరావతి జపం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అపోహలు ఇతర ప్రాంతాల ప్రజల్లో ఏర్పడటానికి కారణం అవుతున్నారు. అమరావతిపై గతంలో విషం కక్కిన శక్తులే మళ్లీ విషం చిమ్మడానికి సిద్ధమవుతున్నాయి.


జగన్‌ అరాచకాలు మరిచిపోతే ఎలా?

ఇప్పుడు మళ్లీ అసలు విషయానికి వద్దాం! అభివృద్ధి అజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ అజెండాను మళ్లీ పక్కన పడేశారు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్‌రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తియుక్తులు అన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆరు నెలలు గడచినా రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతీగతీ కనపడటంలేదు. దీంతో పార్టీ శ్రేణులే కాదు– గత ఐదేళ్ల చీకటి పాలనను గుర్తుచేసుకుంటున్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. జగన్‌రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించనంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది. జగన్మోహన్‌రెడ్డి విషయం అటుంచితే, ఆయన చుట్టూ ఉన్న వారి అరాచకాలను గుర్తించి కేసులు పెట్టి కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతోంది. కోడి కెలికినట్టుగా ఆయా కేసులను కెలికి వదిలేస్తున్నారు. దీంతో మనకు ఏమీ కాదులే అన్న ధీమా వైసీపీ నాయకుల్లో ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తనకు ఏం కావాలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కలుషితమైందని అందరికీ తెలుసు. చంద్రబాబు సహా రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డజను మంది అధికారులను ఎంచుకొని వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. చంద్రబాబు కోసం అలా చొక్కాలు చించుకొనే అధికారులు ఇప్పుడు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పేషీ కూడా బలహీనంగా ఉంది. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్న భావన ముఖ్యమంత్రి పేషీ అధికారుల్లో కనిపించడం లేదు. అంతా మొక్కుబడిగా సాగిపోతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. జగన్‌రెడ్డిని నమ్ముకుంటే ఆయనే తమను కష్టాల్లో కూడా చూసుకుంటారన్న నమ్మకం ఆయన కోసం పనిచేసిన అధికారుల్లో ఉండేది. ఇప్పుడు అలాంటి భరోసాను చంద్రబాబు ఇవ్వలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనే కాదు– హద్దు మీరి ప్రవర్తిస్తున్న సొంత పార్టీ శాసనసభ్యులను కూడా చంద్రబాబు కట్టడి చేయలేకపోతున్నారు. అరాచకంగా వ్యవహరించడంలో కొందరు తెలుగుదేశం శాసనసభ్యులు జగన్‌ హయాంను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అప్పుడు శాసనసభ్యులకు జగన్‌రెడ్డి అంటే భయం ఉండేది. ఇప్పుడు అలాంటి భయం కూడా లేదు. కొంత మంది శాసనసభ్యుల దుశ్చర్యల గురించి వింటూ ఉంటే రోతగా ఉంటోంది. శాసనసభ్యుడు అనే పదానికి నిర్వచనం మారిపోయింది. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు లాభపడ్డారన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వ్యాపించింది. అది జగన్‌రెడ్డి హయాంలో మరింత వికృతంగా విస్తరించింది. తెలంగాణలో కేసీఆర్‌ అధికారం కోల్పోవడానికి బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల దందాలు కూడా ఒక కారణం. జగన్‌రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి ఆయన పోకడలు, ప్రాధాన్యతల లోపాలతోపాటు శాసనసభ్యుల అరాచకాలు కూడా కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలపడుతోంది. జనసేన, బీజేపీ బలంతో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం పార్టీకి సొంతంగానే కావాల్సినంత మెజారిటీ ఉంది.


ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు సొంత పార్టీ వారిని కట్టడి చేయలేకపోతే అది చేతగానితనమే అవుతుంది. కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించిన పనులను తమకే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అండతో ఎయిర్‌పోర్టు మేనేజర్‌ను కిడ్నాప్‌ చేయడాన్ని ఎలా చూడాలి? ఇలాంటి పనులు చేయడానికే అయితే ప్రభుత్వం మారడం ఎందుకు? జగన్‌రెడ్డి పాలనలో ఇంతకంటే దౌర్జన్యాలను పకడ్బందీగా చేశారు కదా? హద్దు మీరుతున్న శాసనసభ్యులను కట్టడి చేయడానికి పూనుకోని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకుండా ఉంటుందా? అదే జరిగితే ప్రభుత్వం నుంచి పవన్‌ కల్యాణ్‌ వైదొలగినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు. ఇలాంటి అంశాలపై ఫోకస్‌ పెట్టవలసింది పోయి రాష్ట్రంలో మరో ఏడు ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపడతామని ప్రకటించడంలో ఔచిత్యం ఏమైనా ఉందా? ఎయిర్‌పోర్టుల వల్ల అభివృద్ధి జరుగుతుందా? ప్రజల కడుపు నిండుతుందా? ప్రభుత్వపరంగా ప్రాధాన్యతలు ఎలా ఉండాలి? పార్టీ పరంగా ప్రాధాన్యతలు ఏమిటి? అనే విషయాలపై ముఖ్యమంత్రికి స్పష్టత ఉండాలి. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ పోతేనే ప్రజల్లోనూ, కేడర్‌లోనూ ఫీల్‌ గుడ్‌ భావన ఏర్పడుతుంది.


మోదీని చూసైనా...

రాజకీయ కక్ష సాధింపులకు తాము దూరమని చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతించాల్సిందే! అయితే, తప్పు చేసిన వారిని వదిలిపెడితే అది చేతగానితనమే అవుతుంది. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఒదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు? అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ‘తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఢోకా లేదు– జగన్‌రెడ్డిని మళ్లీ అధికారంలోకి రానివ్వబోం’ అన్న భరోసా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇవ్వనంత వరకు తెలుగుదేశం పార్టీలో సణుగుళ్లు, గొణుగుళ్లు ఉంటూనే ఉంటాయి. పార్టీ భవిష్యత్తుకు ఢోకా లేదని రుజువు చేసినప్పుడే పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. లేకపోతే ఎవరికి వారు పక్కచూపులు చూస్తుంటారు. అధికారం ఉన్నంత వరకు పబ్బం గడుపుకొని ఆ తర్వాత నువ్వు కాకపోతే మరొకరు అని గెంతుతారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు నమ్మాలంటే ఏం చేయకూడదో అవన్నీ జగన్‌రెడ్డి హయాంలో చేశారు. రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయించడానికి ఏం చేయవచ్చునో కూడా అతనే చేసి చూపించాడు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ దిశగా కొత్తగా మేధోమథనం చేయాల్సిన అవసరం లేదు. కట్టుతప్పుతున్న ఎమ్మెల్యేలను, ఇతరులను వెంటనే అదుపులో పెట్టాలి. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్లను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే వారిపై ఏమి కేసు పెట్టారో తెలిసేది. ఇప్పుడు అలా కాకుండా అరెస్టుల విషయం మరచిపోయి ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను పోలీసులు ముందుగానే చెప్పేస్తున్నారు. దీంతో ఆయా కేసులు మోపబడిన వారు న్యాయస్థానాల నుంచి ఉపశమనం పొందుతున్నారు. తెలుగుదేశం కేడర్‌లో అసంతృప్తి రగలడానికి ఇది ప్రధాన కారణం. రాజధాని నిర్మించి, నాలుగు ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయించినంత మాత్రాన ఓట్ల వర్షం కురవదు. 2019కి ముందే కియా పరిశ్రమ ఏర్పాటై, అనంతపురం జిల్లాలో ఆ పరిశ్రమ వల్ల లాభపడిన నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదే? నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత దీర్ఘకాలంపాటు దేశాన్ని పాలించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కింది అంటే అందుకు ఆయన అనుసరించిన రాజకీయ వ్యూహాలే కారణం. ఆయన తనను తాను పెంచుకుంటూ భారతీయ జనతా పార్టీని కూడా పెంచారు.


రాజకీయ ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలో, ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఆయనను చూసైనా నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు కొత్తగా శోధించి కనిపెట్టాల్సింది ఏమీ లేదు. ప్రధాని మోదీని గమనిస్తే చాలు. 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి, తన కుమారుడైన లోకేశ్‌కు ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటే జగన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయడమే ఏకైక మార్గం. జగన్‌రెడ్డిని అష్టదిగ్బంధనం చేయగలిగితే 2029 ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా లోకేశ్‌కు బదలాయించడానికి ఆటంకాలు ఎదురు కావు. ఈ దిశగా చర్యలు తీసుకోకుండా ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు బిజీబిజీగా గడిపితే పార్టీ కేడర్‌తో పాటు ప్రజలకు కూడా చంద్రబాబు దూరం అవుతారు. 2019–2024 మధ్య కాలం నాటి చేదు అనుభవాలను చంద్రబాబు అనుక్షణం గుర్తు చేసుకోవాలి. ఇకపైనైనా చంద్రబాబు అడుగులు సరైన మార్గంలో పడనిపక్షంలో 2019–2024 మధ్య కాలంలో ఆయనకు అండగా నిలిచిన వర్గాలు, వ్యక్తులు కూడా ఆయనకు దూరం అవుతారు. 2029 నాటికి తనకు ఉండబోయే ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని మెలిగితే చంద్రబాబుకే మంచిది!

ఆర్కే


యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - Jan 05 , 2025 | 12:59 AM