Poem : మరో కల వస్తుందా
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:57 AM
సుదూర గతంలో ఒక సాయంత్రం ఆ ఒంటరి భవంతి పైఅంతస్తు మూల గదిలో ఒక్కడినే కాసేపు కూర్చుని కాసేపు పచార్లు చేసిబయటికి నడిచాను నిమ్మళించిన లోపలితో-
సుదూర గతంలో ఒక సాయంత్రం
ఆ ఒంటరి భవంతి పైఅంతస్తు మూల గదిలో
ఒక్కడినే కాసేపు కూర్చుని కాసేపు పచార్లు చేసి
బయటికి నడిచాను నిమ్మళించిన లోపలితో-
వచ్చేటప్పుడు గది కిటికీ లోని పూల తీగా
నిశ్శబ్ద రాగాల కొసా నా చేతిని తాకిన స్పర్శ గుర్తుంది
మెట్లు మృదువుగా దిగువకు దింపాయి
కింద అలంకారవిన్యాసాల సీతాకోకల రంగులనూ
రెపరెపలనూ అబ్బురంతో చూస్తూ వుండగానే...
కల చటుక్కున ఆగిపోయింది, బహుశా తెగిపోయిందేమో!
కళ్లు తెరిస్తే ఆ భవంతి లేదు, పూల తీగా లేదు
నిస్సవ్వడీ లేదు చుట్టూరా సీతాకోక ఒక్కటీ లేదు
చాలా ఏళ్లయినా గతపు పచ్చిక బయళ్ళ నుంచి
ఆ కల తలపుకొస్తూనే ఉంది అపుడపుడు
పాత స్నేహితుడి పలకరింపులా, పిలుపులా-
ఇంతకీ
ఆ భవంతి ఎక్కడిది ఏ కాలం నాటిది ఎవరిది?
ఆ గది పాపం ఒంటరిగానే ఉందా నేనొచ్చాక?
ఆ పూల తీగ అట్లాగే వేచి వుందా వాడకుండా?
ఆ సీతాకోకలు రంగుల ఉత్సవోత్సాహంతో
అక్కడే తిరుగుతూ ఉన్నాయా కాలాన్ని ఓలలాడిస్తూ?
వెళ్లాలి, వాటిని మళ్ళీ కలవడానికి, కాసేపైనా -
కానీ వెళ్లేదెట్లా?
ఏదో మరొక అపురూప రాత్రి ప్రయాణంలో
మరో కల వస్తుందా స్వయంగా ప్రియంగా
నన్ను అక్కడికి తీసుకెళ్లడానికి?
-దర్భశయనం శ్రీనివాసాచార్య
94404 19039
Updated Date - Jan 13 , 2025 | 04:58 AM