శాంతికి అవకాశం!
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:23 AM
అణుఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేది లేదు, డోనాల్డ్ ట్రంప్ చేతనైనది చేసుకోవచ్చు అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టేశారు. చర్చలకు రమ్మని ట్రంప్ కబురుపంపిన లేఖను తాను చూడలేదని...
అణుఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేది లేదు, డోనాల్డ్ ట్రంప్ చేతనైనది చేసుకోవచ్చు అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టేశారు. చర్చలకు రమ్మని ట్రంప్ కబురుపంపిన లేఖను తాను చూడలేదని అంటూనే, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా ఖొమేనీ కూడా మొన్నీమధ్య వ్యతిరేకంగానే మాట్లాడారు. అమెరికాతో ముచ్చట్లుపెట్టినంత మాత్రాన నెత్తిమీద ఉన్న ఆంక్షలు తొలగిపోవని, ఫలితం ఉండదని తెలిసికూడా చర్చలకు పోవడం ఎందుకని ఇరాన్ పెద్దాయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధిచేస్తోందనో, అవసరమైన యురేనియంను శుద్ధిచేసి పోగేస్తున్నదనో అంత అనుమానం ఉన్నప్పుడు కాస్తంత మర్యాదగానే చర్చలకు రమ్మనవచ్చు. కానీ, అమెరికా అధ్యక్షుడికి అది తెలియదు కనుక, ఇరాన్‌కు కబురు పంపానని అంటూనే, సైనికచర్య హెచ్చరిక కూడా చేర్చారు. యుద్ధమా, ఒప్పందమా ఏది కావాలో తేల్చుకోవాలన్నారు. దారికి రాకపోతే దాడులు తప్పవన్న అర్థంలో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడికి పరిష్కారాలకంటే, పెత్తనం మీదే ప్రేమ ఎక్కువంటూ ఇరాన్ పాలకులు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. అదిలించి బెదిరించి మమ్మల్ని దారికి తేలేరన్నదే ఇరువురి వ్యాఖ్యల సారాంశం తప్ప, చర్చలను ఇరాన్ తిరస్కరిస్తున్నట్టు కాదని విశ్లేషకుల వ్యాఖ్యానం. ట్రంప్ గదమాయించగానే దాసోహపడినట్టుగా కనిపించకుండా, ఈ ఆత్మగౌరవప్రదర్శనల అనంతరం ఇరాన్ దారికి వస్తుందని ఓ అంచనా.
అమెరికా అధ్యక్షుడు రాసిన లేఖను పట్టుకొని టెహ్రాన్ వచ్చిన ఎమిరేట్స్ దౌత్యప్రతినిధి ఇరాన్ విదేశాంగమంత్రికి దానిని అందచేశారట. ఇరాన్ క్షిపణి కార్యక్రమంమీద ఆంక్షలు విధించడంతో పాటు, పశ్చిమాసియాలో తమ ప్రభావాన్ని తగ్గించడానికే ట్రంప్ ఈ చర్చలను ప్రతిపాదించారని, అది తమకు అంగీకారం కాదని ఖమేనీ అంటున్నారు. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ దౌత్యప్రతినిధులు చర్చలకు సిద్ధమేనని అంటూనే, అది అణ్వాయుధీకరణకు సంబంధించిన అనుమానాల పరిష్కారానికే పరిమితం కావాలని అన్నారు. నెలరోజుల క్రితం ఇరాన్‌మీద విరుచుకుపడిన ట్రంప్ ఇంతలోనే మాట్లాడుకుందాం రండి అని పిలవడం ఆశ్చర్యంతోపాటు అనుమానాలు కూడా పెంచడం సహజం. పైగా, తనను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టుగానూ, అందువల్ల, తనకు ఏం జరిగినా వెంటనే ఇరాన్‌ను దుంపనాశనం చేయమని తాను ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టుగానూ ఆయన అప్పట్లో ఆడిపోసుకున్నారు. తన ప్రాణాలకే ఎసరుపెడుతున్న ఇరాన్‌కు ఇంతలోనే ఆయన చర్చల అవకాశం ఎందుకు ఇచ్చారో మరి. విఫలమైతే ఏంచేయాలన్న వ్యూహం కూడా ఇప్పటికే సిద్ధంగా ఉండివుంటుంది.
బరాక్ ఒబామా హయాంలో ఎంతో కష్టపడిసాధించిన అణుఒప్పందాన్ని తన తొలివిడత పాలనలో ట్రంప్ ఏకపక్షంగా కాలరాసిన సంగతి తెలిసిందే. భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలు, జర్మనీ, యూరోపియన్ యూనియన్ ఒకవైపు, ఇరాన్‌మరోవైపు ఈ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. మిగతా ప్రపంచమంతా యుద్ధభయం తగ్గినందుకు సంతోషించిన సందర్భం అది. ప్రపంచానికి కాస్తంత ప్రశాంతతను ప్రసాదించిన ఆ 2015నాటి ఒప్పందాన్ని మూడేళ్ళలోనే ట్రంప్ మట్టిపాల్జేశారు. అది అమెరికా పక్షాన కాక, ఇరాన్‌కు మేలుచేసే విధంగా ఉన్నదని వాదించారు. ఆ తరువాత ఇరాన్ మరిన్ని తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంది, అష్టకష్టాలూ పడింది. జో బైడెన్ వచ్చి ఒప్పందాన్ని పునరుద్ధరిస్తారనుకుంటే అదీ జరగలేదు. దశాబ్దాలుగా ఇరాన్ ఏవో కారణాలతో ఆంక్షలను అనుభవిస్తూనే ఉంది. చమురు ఉండీ ఎగుమతిచేయలేక, అమెరికా బ్యాంకుల్లో బంగారం, నగదు స్తంభించిపోయినందునా బాధలు పడుతోంది.
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ అండతో వేర్వేరు శక్తులు పోరాడిన విషయం తెలిసిందే. నేలమట్టమైన గాజాను రిసార్టుగా మార్చే ఆలోచన చేస్తున్న ట్రంప్ ఇప్పటికే అక్కడ యుద్ధం ఆగేట్టు చేశారు, జనాన్ని ఖాళీచేయించే ప్రయత్నంలోనూ ఉన్నారు. ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడం ఇప్పుడు అత్యవశ్యకం. గత ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కొత్త ఒప్పందానికి కూడా అనుకూలమే. ఇరాన్‌కు అన్యాయం జరగకుండా, భవిష్యత్తు భయాలు లేకుండా ఒప్పందం కుదరడానికి పుతిన్–ట్రంప్ స్నేహం ఉపకరిస్తే మరీ మంచిది. ఇరాన్ అణుబాంబు తయారీకి అడుగుదూరంలోనే ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నెలక్రితం లెక్కగట్టిన నేపథ్యంలో, కొత్త కుట్రలకు పాల్పడకుండా, మరింత అవిశ్వాసానికి తావులేకుండా ట్రంప్ నిజాయితీగా వ్యవహరిస్తే ప్రపంచానికి మంచిది.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Mar 14 , 2025 | 03:23 AM