Dr. Manmohan Singh : మధ్యతరగతి ‘మన్మోహనం’!
ABN, Publish Date - Jan 04 , 2025 | 05:00 AM
డాక్టర్ మన్మోహన్ సింగ్ గత నెల 26న 92 ఏళ్ల వయసులో కీర్తిశేషుడు అయ్యారు. జూన్ 21, 1991న కేంద్ర ఆర్థిక మంత్రిగా డాక్టర్ సాబ్ ప్రమాణం చేసిన రోజు నుంచి ఆయనతో ఏర్పడ్డ నా అనుబంధం ముగిసిపోయింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గత నెల 26న 92 ఏళ్ల వయసులో కీర్తిశేషుడు అయ్యారు. జూన్ 21, 1991న కేంద్ర ఆర్థిక మంత్రిగా డాక్టర్ సాబ్ ప్రమాణం చేసిన రోజు నుంచి ఆయనతో ఏర్పడ్డ నా అనుబంధం ముగిసిపోయింది.
మన్మోహన్ సింగ్ గురించి ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఒక ‘యాదృచ్ఛిక ఆర్థిక మంత్రి’. పీవీ నరసింహారావు తొలుత తన ఆర్థిక మంత్రిగా ప్రముఖ విద్యావేత్త, ఆర్థికవేత్త ఐ.జి.పటేల్‌ను నియమించేందుకు ప్రాధాన్యమిచ్చారు. అయితే పటేల్ నిరాకరించి, ఆ పదవికి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును సూచించారు. నీలిరంగు తలపాగాతో, హుందాతనం ఉట్టి పడుతున్న ఒక సిక్కు పెద్ద మనిషి ముందు వరుసలో కూర్చొని ఉండడం చూసి ఎంతో మంది విస్మయం చెందారు. ఆ గౌరవనీయుడు కేబినెట్ మంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారనేది స్పష్టమయింది. అయితే ప్రధానమంత్రి ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయించనున్నారు? అందరిలో ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. కొద్ది గంటలలోనే ఆయన నార్త్ బ్లాక్ (ఆర్థిక మంత్రిత్వశాఖ నెలవు)లో కనిపించారు.
జూలై 1, 1991న రిజర్వ్ బ్యాంక్ తొలి దశ రూపాయి విలువ తగ్గింపును ప్రకటించింది. జూలై 3 ఉదయం ప్రధానమంత్రి నన్ను తన కార్యాలయానికి పిలిచి, తన కేబినెట్ సహచరులు కొంతమంది రూపాయి విలువ తగ్గింపుపై వ్యక్తం చేసిన భయ సందేహాలు (నిజానికి ఇవి నరసింహారావువే) నాకు తెలిపారు. నేను పాత పాటే పాడాను. రూపాయి విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉన్నదని, ఫలితంగా ఎగుమతులు దెబ్బ తింటున్నాయని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయని, విదేశీ మదుపుదారులు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారని వగైరా వగైరా చెప్పాను. రూపాయి విలువను మరొకసారి తగ్గించవలసి ఉన్నదని వివరిస్తూ ఆర్థికమంత్రి వద్దకు వెళ్లి రెండవ దశ రూపాయి విలువ తగ్గింపును నిలిపివేయడం సాధ్యం కానిపక్షంలో వాయిదా అయినా వెయ్యాలని ఆయన్ను అభ్యర్థించాలని నాకు చెప్పారు. పీవీ ఇలా మన్మోహన్ వద్దకు పంపుతున్న దూతను నేను ఒక్కడినే కాదన్న భావన నాలో నిశ్చితంగా ఏర్పడింది.
సంశయాగ్రస్తుడిని అయినప్పటికీ నార్త్ బ్లాక్‌కు వెళ్లాను. ఆర్థికశాఖ అధికారులు నన్ను సాదరంగా మంత్రి వద్దకు తీసుకువెళ్లారు. మన్మోహన్ సింగ్‌తో అదే నా మొదటి అధికారిక సమావేశం. ప్రధానమంత్రి సందేశాన్ని ఆయనకు తెలియజేశాను. అది ఆదేశం కానే కాదని, అభ్యర్థన మాత్రమేనని స్పష్టంగా చెప్పాను. ఆ సందేశం, బహుశా సందేశవాహకుడు విషయమై కూడా మన్మోహన్ దిగ్భ్రమ చెందినట్టు కనిపించారు. అది ఆయన ముఖంలో స్పష్టంగా ద్యోతకమయింది. నేను చెప్పింది ఆయన శ్రద్ధగా విని, రెండో దశ రూపాయి విలువ తగ్గింపు నిర్ణయాన్ని ఆ రోజు ఉదయం పది గంటలకు మార్కెట్లు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ సి. రంగరాజన్‌తో మన్మోహన్ ఎలా మాట్లాడిందీ, ఆయన మాటలకు ప్రతిస్పందనగా ‘వెన్వెంటనే ఆ నిర్ణయాన్ని అమలుపరచనున్నట్టు’ రంగరాజన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆ చరిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన గాథావళిలో భాగంగా ఉన్నాయని మరి చెప్పనవసరం లేదు. ఈ రూపాయి విలువ తగ్గింపు ఉదంతంతో యాదృచ్ఛిక ఆర్థికమంత్రి అయిన మన్మోహన్ సింగ్ ఎంత దృఢసంకల్పుడు అన్నది స్పష్టమయింది. తాను సరైనది అనుకున్న నిర్ణయాన్ని ఆయన ఎంత దీక్షా దక్షతలతో అమలుపరుస్తారో ఆ తొలిరోజుల్లోనే విశదమయింది.
మన్మోహన్ ఎంత దృఢసంకల్పుడో కొద్ది సంవత్సరాల అనంతరం ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు మరోసారి అందరికీ తెలిసివచ్చింది. ప్రతిపాదిత భారత్–అమెరికా పౌర అణు ఒప్పందానికి వామపక్షాల నుంచి ముఖ్యంగా సీపీఎం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. అమెరికాతో ఆ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కటువుగా హెచ్చరించారు. ప్రధానమంత్రిని, ప్రతిపాదిత పౌర అణు ఒప్పందాన్ని సమర్థిస్తున్న కాంగ్రెస్ నాయకులు పలువురు ఆ ఒప్పందం కోసం ప్రభుత్వాన్ని త్యాగం చేయవలసి రావడం పట్ల అభ్యంతరాలు తెలిపారు. ప్రభుత్వం మెజారిటీని కోల్పోతే ఆ ఒప్పందం సైతం రద్దయిపోతుంది కదా అని వారు వాదించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ దృఢవైఖరితో నిలబడ్డారు. ఆ ఒప్పందాన్ని త్యజించాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తే మన్మోహన్ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగవలసివస్తుందనేది స్పష్టం. మన్మోహన్ వాదన సబబైనదని నేను విశ్వసించాను. ఈ కారణంగా ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకునే అవకాశాలను అన్వేషించాలని ఆయనకు సూచించాను. ఈ విషయంలో ఆయన చాలా తెలివిగా వ్యవహరించారు. తొలుత ప్రతిపాదిత అణు ఒప్పందాన్ని సమర్ధిస్తూ ఒక ప్రకటన చేయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు మన్మోహన్ నచ్చచెప్పారు. కలాం ప్రకటన ఆలంబనతో ములాయంసింగ్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ మద్దతును సాధించగలిగారు. ములాయం మద్దతుతో వామపక్షాల దబాయింపులను మన్మోహన్ గట్టిగా ఎదుర్కొన్నారు. లోక్‌సభలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీంతో భారత్–అమెరికా పౌర అణు ఒప్పందం ఆమోదానికి అవరోధాలు పూర్తిగా తొలగిపోయాయి. కాంగ్రెస్‌కు వామపక్షాలు తమ మద్దతును ఉపసంహరించుకున్న తరువాత మన్మోహన్ తన స్వతస్సిద్ధ స్వభావానికి అనుగుణంగా ఆ పార్టీ నాయకులను ఎప్పటిలాగానే అమితంగా గౌరవించారు. వారితో సుహృద్భావపూర్వక సంబంధాలు కొనసాగించారు.
మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతులేని పక్షంలో వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను యూపీఏ ప్రభుత్వాలు రూపొందించి, అమలుపరచడం సాధ్యమయ్యేది కాదన్న వాస్తవం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా రెండు పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించవలసి ఉన్నది. అవి: వ్యవసాయ రుణాల మాఫీ (2008), ఆహార హక్కు కార్యక్రమం (2013). ఈ రెండు సంక్షేమ కార్యక్రమాలను మన్మోహన్ చాలా గట్టిగా సమర్థించారు. వాటి ఆవశ్యకత విషయమై శక్తిమంతమైన వాదనలు చేశారు. వాటి అమలు ప్రభావం ద్రవ్యలోటుపై ఎలా ఉంటుందనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలని నాకు ఆయన సూచించారు. స్థూల ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం లేని పక్షంలో ఏ సంక్షేమ కార్యక్రమాన్నీ అమలుపరచడం సాధ్యంకాదన్న వాస్తవాన్ని ఆయన సదా గుర్తుంచుకునేవారు. ఈ ఆర్థిక పరిజ్ఞానం విషయంలో ఆయనకు సాటివచ్చే రాజకీయవేత్త మరెవరూ లేరు. ద్రవ్యలోటు భర్తీ లక్ష్యాలను పరిపూర్తి చేసినప్పుడే సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ఆమోదం తెలిపేవారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వాభావికంగా సంస్కర్త అయినప్పటికీ పేదల శ్రేయస్సును ఎట్టి పరిస్థితులలోను విస్మరించేవారు కాదు. సంక్షేమ పథకాలను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు ఆర్థిక సంస్కరణలు సంక్షేమ చర్యలు ఏక సమయంలో అమలుకావలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ఆయన మాకు బోధించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు వర్తమాన మధ్యతరగతిని సృష్టించాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
1991 తరువాత జన్మించిన వర్తమాన తరం వారు మన దేశంలో ఒకప్పుడు ఒకటే టెలివిజన్ ఛానెల్, ఒకే ఒక్క బ్రాండ్ కారు, ఒకటే పౌర విమానయాన సంస్థ, ఏకైక టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్ ఉండేవని చెప్పితే నమ్మరేమో కదా?! ట్రంక్ కాల్స్, పీసీఓ/ఎస్‌టీడీ/ఐఎస్‌డీ బూత్‌లతో ప్రజలు సతమతమవుతుండేవారని; టూ వీలర్స్ నుంచి రైలు టిక్కెట్ల దాకా అన్నిటికీ నిరీక్షించే వారి జాబితా కొండవీటి చాంతాడంత పొడుగున ఉండేదన్న వాస్తవాలు వారికి నమ్మశక్యంగా ఉండవనడంలో అతిశయోక్తి లేదు. మన జీవన రీతులలో మహా ఆశ్చర్యకరమైన మార్పులకు బీజాలు వేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్. అయితే ఈ చారిత్రక వాస్తవాన్ని ఆ నవ్య పథ నిర్దేశకుడికి తన నివాళితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్ తీర్మానంతో భారత ప్రభుత్వమూ ఆలస్యంగా అంగీకరించాయి.
మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర కరుణ చూపినా చూపక పోయినా దేశ చరిత్రపై ఆయన ముద్ర ప్రగాఢమైనది. నవ భారతదేశ చరిత్రలో ఆయనవి అయిన రెండు అడుగు జాడలు అజరామరమైనవి. ఒకటి– తన పది సంవత్సరాల ప్రధానమంత్రిత్వ కాలంలో స్థూల దేశియోత్పత్తి సగటు వృద్ధిరేటు 6.8 శాతంగా ఉండేలా చేయడంలో ఆయన అనితర సాధ్యంగా సఫలమయ్యారు; రెండు– యుఎన్‌డీపీ (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం) ప్రకారం యూపీఏ ప్రభుత్వాలు తమ పదేళ్ల పాలనా కాలంలో 27 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాయి. ఈ ఆర్థిక విజయాలు మన దేశ చరిత్రలో అపూర్వమైనవి. మన్మోహన్ అనంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాటికి సరిసమానమైన వాటిని సాధించలేకపోయాయి. చరిత్ర ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు శాశ్వతమైనది.
మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర కరుణ చూపినా చూపకపోయినా దేశ చరిత్రపై ఆయన ముద్ర ప్రగాఢమైనది. నవ భారతదేశ చరిత్రలో ఆయన అడుగు జాడలు అజరామరమైనవి. స్థూల దేశియోత్పత్తి సగటు వృద్ధిరేటు 6.8 శాతంగా ఉండడం, 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి విముక్తం చేయడం ఆయన పాలన సాధించిన అపూర్వ ఆర్థిక విజయాలు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Jan 04 , 2025 | 05:00 AM