ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Irrigation Projects : ‘పాలమూరు–డిండి’.. అనాలోచిత ప్రతిపాదన

ABN, Publish Date - Jan 04 , 2025 | 04:54 AM

శ్రీశైలం ప్రాజెక్టు లోపలి నుంచి చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లాగా, జూరాల ప్రాజెక్టు లోపలి నుంచి షాద్‌నగర్‌ ఎత్తిపోతల పథకం చేపట్టాలని, తద్వారా మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధి ఎగువ ప్రాంత భూములు సాగు భూములై ప్రజాజీవనం

శ్రీశైలం ప్రాజెక్టు లోపలి నుంచి చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లాగా, జూరాల ప్రాజెక్టు లోపలి నుంచి షాద్‌నగర్‌ ఎత్తిపోతల పథకం చేపట్టాలని, తద్వారా మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధి ఎగువ ప్రాంత భూములు సాగు భూములై ప్రజాజీవనం బాగుపడుతుందని బలమైన ఉద్యమాలు నిర్మించాం. ఆ పథకమే తరువాతి రోజుల్లో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ ఉద్యమం జరిగిన 1994–2014 మధ్యలో ఎన్నడూ పాలమూరు–డిండి ఎత్తిపోతల చర్చ లేనే లేదు. కేవలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేసి, శ్రీశైలం ఎడమ కాలువలో పారించాలని, అప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల (ఏఎంఆర్‌) నీటిని నీటి వసతి లేని నల్లగొండ జిల్లా ఎగువ ప్రాంతానికి ఇవ్వాలని చర్చ జరిగేది. ఈ చర్చను తప్పుదారి పట్టించే విధంగా ఎస్‌ఎల్‌బీసీ నీటిని మన్నెవారిపల్లి నుంచి... అంటే అక్కడ నిర్మించే ప్రాజెక్టును లోయర్‌ డిండి అని, డిండి దిగువన మధ్యలో ఒక రిజర్వాయర్‌ నిర్మించి దానిని మిడ్‌ డిండి అనాలని, ప్రస్తుత డిండి భారీగా పెంచి అప్పర్‌ డిండి అనాలని ఒక ప్రతిపాదన తెచ్చారు. ఎడమ కాలువలో పారే గ్రావిటీ నీటిని మరోవైపు ఎత్తిపోసి గ్రావిటీ కాలువను ఎత్తిపోతల కాలువగా ఏఎంఆర్‌ లిఫ్టుతో ఎల్లకాలమూ ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనను ఆ కాలువ కింది నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరమైతే ఏఎంఆర్‌ నీటినే ఎటైనా తరలించుకోవచ్చునని చెప్పింది. దీనికి మహబూబ్‌నగర్‌లో అడ్డంకులు రాకూడదని అమ్రాబాద్‌ ఎత్తిపోతలతో మరో ప్రతిపాదన తెచ్చారు. అసలు డిండి ఎత్తు పెంచి కొత్తగా పన్నెండు గ్రామాలు ముంచే ఆలోచనను మహబూబ్‌నగర్‌ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు.

ఇంతలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వైపు మార్చడంతో అనేక లోపాయకారీ ఆలోచనలతో పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా పాలమూరు–డిండి ప్రతిపాదన ముందుకు తెచ్చారు. భిన్నమైన ఆలోచనలతో ఏడుసార్లు, ఏడు విధాలుగా ఒకే సర్వే కంపెనీతో సర్వే చేయించారు. ఆ సర్వేల మీద, ఆ సర్వే కంపెనీ మీద, ప్రజానిధుల దుర్వినియోగం మీద చాలా చర్చ జరిగింది. అయినా పాలమూరు–డిండి పేరుతో నల్లగొండ జిల్లాలో సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల పనులు చేపట్టారు. మహబూబ్‌నగర్‌లో ఇర్విన్‌ పనులు ప్రారంభించారు. ఎర్రవల్లి–గోకారం, ఉల్పర రిజర్వాయర్ల పనులను రైతాంగం అడ్డుకున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకపు నీటిని నార్లాపూర్‌ నుంచి తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకించారు. దాంతో నేరుగా శ్రీశైలం నుండి ప్రత్యేక లిఫ్టుతో నీరు తరలించే ప్రతిపాదన తెచ్చారు.


పాలమూరు–డిండి ఆలోచనను మూడు కారణాలతో మహబూబ్‌నగర్‌ రైతాంగం, ప్రజాసంఘాలు, పార్టీలు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంగా వ్యతిరేకించారు. 1) నీటిని తరలించవద్దని. 2) ఇప్పటికే కల్వకుర్తి, శ్రీశైలం, పాలమూరు–రంగారెడ్డి పథకాలకు భూములు కోల్పోయిన రైతులు తమకు మిగిలిన కొద్దిపాటి ఆయకట్టును ముంచుకుని, నిర్వాసితులు కావడానికి సిద్ధంగా లేరని. 3) నల్లగొండ జిల్లా అవసరాలకు నీరు తీసుకోవడానికి ఆ జిల్లాలో అవకాశం ఉన్నప్పుడు ఇప్పటికే వెనుకకు నెట్టిన మహబూబ్‌నగర్‌ ప్రజల జీవితాలతో ఆడుకునే అవసరం లేదన్నవి ఆ కారణాలు. తీవ్ర చర్చోపచర్చలు, ఉద్యమాల క్రమంలో అప్పటి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ ప్రతిపాదన మానుకొమ్మని, దానితో కలిగే నష్టాలు వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు లెటర్‌ హెడ్‌తో ఫిబ్రవరి 22, 2016న లేఖ రాశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రజాసంఘాలతో కలిసి పాలమూరు అధ్యయన వేదిక నిర్వహించిన ధర్నాలకి నాయకత్వం వహించి, పాల్గొన్నారు. ఈ పథకం అమలు జరగదని అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీర్స్‌ ఫోరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్‌లో సమావేశమై ఈ పథకం అనర్థాలపై తీర్మానం చేసింది.

ఈ చరిత్రనంతా వదిలేసి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి పాలమూరు–డిండి ప్రతిపాదన ముందుకు తెచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలోను, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత అవగాహన ఏమిటో కానీ, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన మరింత దూకుడుగా ముందుకు రావడం చారిత్రక విషాదం మాత్రమే కాదు. తీవ్రమైన అన్యాయం. దీనితో మహబూబ్‌నగర్‌ను చెదరగొట్టి కొత్తగా ఏర్పరచిన ఏడు జిల్లాలు, 14 శాసనసభ నియోజకవర్గాలు ఘోరంగా నష్టపోతాయి. పక్కన రంగారెడ్డి జిల్లాకు తీరని ద్రోహం జరుగుతుంది.

నిజానికి నీళ్ల కోసమే మహబూబ్‌నగర్‌ జిల్లా మూడు దశాబ్దాల క్రితం 1994లో తెలంగాణ ఉద్యమంలోకి దిగింది. 2005లో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా 1–2, కోయిల్‌సాగర్‌ పథకాల పనులు మొదలవటం వెనుక కరువు, వలసలు, ఆత్మహత్యలే కాదు, నిరంతరం సాగిన పోరాటాలు, త్యాగాలున్నాయి. 2012లో లిఫ్టులు పనిచేయటం ప్రారంభమైనా అవసరానికి తగ్గ పంపులు కానీ, కాలువల సామర్థ్యం కానీ, కేటాయింపులు ప్రకటించిన మేరకైనా నీరు నిలిపే వ్యవస్థలు కానీ లేవు. ఆయకట్టు నిర్ధారణ చేయలేదు. నీటి నిర్వహణ లేదు. ఏ సంవత్సరంలోను మూడోవంతు నీరు తీసుకోలేదు. వాస్తవ పరిస్థితులు ఏ ప్రభుత్వమూ ప్రజలకు చెప్పలేదు. అబద్ధపు ప్రచారాలతో వాస్తవాలను కప్పిపుచ్చారు. మహబూబ్‌నగర్‌ కరువు, వలసలు, నీటి ఎద్దడికి పాటలు కట్టి సాగిన తెలంగాణ ఉద్యమం గెలిచిన తరువాత కళాత్మకంగా జిల్లాను వంచనకు బలి చేస్తున్నారు.


ఈ విమర్శను నల్లగొండ జిల్లా భూములకి, ప్రజలకి వ్యతిరేకమైన చర్చగా చూసే ఎవరికైనా సమస్య అర్థం కాదు. ఏడు దశాబ్దాలుగా తీవ్ర నీటి ఎద్దడికి, విధ్వంసానికి గురైన జిల్లాలకు న్యాయం చేయవలసిన సమయం, అందుకు అవసరమైన అధికారం వచ్చిన తరువాత కూడా ప్రభుత్వాలే చేస్తున్న అన్యాయంగా పరిశీలించాలని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పాలమూరు–డిండి ఎత్తిపోతలను ఆమోదిస్తుందని వింటున్నాం. అలా జరగకూడదు. ఎందుకంటే 1950ల నాటి రాజోలిబండ మళ్లింపు పథకం శిథిల సమాధిగా మారింది. ఆంధ్రకు నీరు తరలించే సుంకేశులను పాలకులు ఆధునిక ప్రాజెక్టుగా మార్చారు. 2005లో ప్రారంభించి అరకొరగా పూర్తిచేసిన పథకాలు నిర్వహణ లోపాలతో అసంపూర్తిగా శిథిలమైపోతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి పథకం పేరుతో ఎత్తిపోసే నీటిని రోజుకు టీఎంసీ చొప్పున అయిదువేల క్యూసెక్కులకు పైగా తరలించిన తరువాత మిగిలే నీళ్లు కూడా ఉండవు. ఈ నిజం ప్రజలకన్నా ప్రభుత్వాలకే బాగా తెలుసు. తెలిసి అన్యాయం చేస్తుంటే తమ పదవుల కోసం లీడర్లు నోరు మూసుకుంటారేమో కానీ, ప్రజాపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు ఊరుకోరు.

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పాలమూరు–డిండి ఎత్తిపోతలను ఆమోదిస్తుందని వింటున్నాం. అలా జరగకూడదు. తెలిసి అన్యాయం చేస్తుంటే తమ పదవుల కోసం లీడర్లు ఊరుకుంటారేమో కానీ, ప్రజాపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు ఊరుకోరు.

ఎం. రాఘవాచారి

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - Jan 04 , 2025 | 04:54 AM