ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీ ఎన్నికలు

ABN, Publish Date - Jan 09 , 2025 | 02:37 AM

దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీస్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి, మరో మూడురోజుల తరువాత జనం ఎవరికి అధికారం కట్టబెట్టారో తేలిపోతుంది. పోటీ ప్రధానంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ–బీజేపీ మధ్యే...

దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీస్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి, మరో మూడురోజుల తరువాత జనం ఎవరికి అధికారం కట్టబెట్టారో తేలిపోతుంది. పోటీ ప్రధానంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ–బీజేపీ మధ్యే ఉందని, గతంలో పదిహేనేళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌, షీలాదీక్షిత్‌ అనంతరం చిక్కిశల్యమైనందున ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కానీ, ఢిల్లీ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గత కాంగ్రెస్‌ పాలనను ప్రజలు మరిచిపోలేదని, ఆప్‌–బీజేపీ నిత్యకయ్యంతో విసిగివేసారిన జనం ఈ మారు తమకు ఓటేస్తారని ఆ పార్టీ నాయకుల వాదన. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు కుదరకపోవడం తమకు మేలుచేస్తుందని కూడా వారు నమ్ముతున్నారు. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి పుట్టుకొచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీని పాపాలపుట్టగా ముద్రవేయడం ద్వారా ఈమారు అధికారంలోకి రాగలనని బీజేపీ నమ్ముతోంది. శక్తిమంతుడైన లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ద్వారా కేజ్రీవాల్‌ను ఎన్నిరకాలుగా ఇబ్బందిపెట్టవచ్చునో అన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది. రెండు పర్యాయాలు ఢిల్లీని గెలుచుకొని, ముచ్చటగా మూడోమారు అధికారంలో కొనసాగడానికి ప్రయత్నిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికసంఖ్యలో సిట్టింగులను మార్చి, ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని పార్టీలూ వాస్తవాలూ వాదనలతోకంటే ఉచితాలతోనే జనాన్ని సులువుగా గెలవవచ్చునన్న నమ్మకంతో వేలకోట్ల రూపాయల వరాలు కురిపిస్తున్నాయి.


ఢిల్లీ ఎన్నికల తేదీల ప్రకటనతో పాటుగానే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల హామీల మీద కొన్ని విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఉచితం సముచితంకాదు, చాలా రాష్ట్రాలు జీతాలకు కూడా వెతుక్కోవాల్సిన స్థితికి వచ్చేశాయి, ఉచితాల మీద ఓ కన్నేసి ఉంచుతాం అన్నారాయన. తమ హామీల వల్ల రాష్ట్రం మీద పడే ఆర్థికభారాన్ని ప్రతీ పార్టీ ప్రజలకు తెలియచేయాలని కూడా ఆయన అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమి చెప్పిందో, ఎన్నికల సంఘం ఏమి చేయబోతున్నదో కూడా ఆయన వివరించారు. ఈ సమస్య ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదనీ, ఎన్నికలకు పోతున్న ప్రతీరాష్ట్రమూ వరాల జల్లుల్లో తడుస్తున్నదని ఆయనకు తెలియనిదేమీ కాదు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో అధికారంలో ఉన్న పార్టీలు కొత్త పథకాలేమీ ప్రకటించలేకపోవచ్చును గానీ, ఇప్పటికే చేతికి ఎముకలేనట్టుగా అన్ని పార్టీలు ప్రతీ ఓటరుకూ కచ్చితంగా ఎంతోకొంత ముట్టేట్టుగా నగదు బదిలీ పథకాలను ప్రకటించేశాయి. మూడురోజుల క్రితమే కాంగ్రెస్‌ కూడా ‘ప్యారీ దీదీ యోజన’ పేరుతో ప్రతీ మహిళకు నెలకు రెండున్నరవేలు ఇస్తానని హామీ ఇచ్చింది. కేజ్రీవాల్‌ ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన కంటే ఇది నాలుగువందల రూపాయలు ఎక్కువ. రేవడీలను తప్పుబట్టే ప్రధాని మోదీ సైతం ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆప్‌ సంక్షేమ పథకాలేవీ రద్దుచేయబోదని గట్టి హామీ ఇచ్చారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, కరెంటు, ప్రజా సౌకర్యాల గురించి గతంలో ఘనంగా చెప్పుకొనే పార్టీలు ఈ మారు ఉచితాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయని మేధావుల బాధ. భయానకమైన కాలుష్యం, నీరు, విద్యుత్‌ కొరతలు, పాడైన రోడ్లు, పరిమిత ప్రజారవాణా సహా పలు సమస్యలు ఢిల్లీ ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుంటే, వాటన్నింటినీ వదిలేసి జనానికి ఉపకరించని అంశాలచుట్టూ చౌకబారు విమర్శలతో ఎన్నికల ప్రచారం సాగుతోంది.


ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది అటుంచితే, ఏది వచ్చినా, ఢిల్లీ ప్రజలకు ఈ ఎన్నికలు గుర్తుండిపోతాయి. ఎన్నికల ప్రసంగాల్లో విమర్శలు కూడా లక్ష్మణరేఖను దాటేశాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులంతా తనను అవమానకరంగా విమర్శిస్తున్నారనీ, ప్రజల కోసం ఎటువంటి భాషనైనా భరిస్తానని కేజ్రీవాల్‌ బాధితుడి మొఖం పెడుతున్నారు. గత ఐదేళ్ళలో ఆయన, పార్టీలోని కొందరు సీనియర్‌ నాయకులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్నారు, జైలుశిక్ష అనుభవించారు. పొరుగు రాష్ట్రాల్లోకి కూడా విస్తరించగలిగిన ఆప్‌కు, తాను పుట్టిపెరిగిన ఢిల్లీని మళ్ళీ గౌరవంగా గెలుచుకోవడం మరింత ముఖ్యం. ఈ మారు కచ్చితంగా అలా జరగకుండా చేయాలన్నది ముప్పయ్యేళ్ళుగా అధికారంకోసం నిరీక్షిస్తున్న బీజేపీ పంతం.

Updated Date - Jan 09 , 2025 | 02:37 AM