స్వేచ్ఛకు సమాధి

ABN, Publish Date - Apr 02 , 2025 | 05:29 AM

ఏ విలువలను చూసి అమెరికాకు ఆ ప్రతిమను బహూకరించామో, ఇప్పుడు అవి అక్కడ లేవు, ఇక అది కూడా అక్కడ ఉండకూడదు, మా విగ్రహాన్ని మాకు ఇచ్చేయండి అంటూ పక్షంరోజుల క్రితం ఫ్రాన్స్‌ నాయకుడు ఒకరు...

స్వేచ్ఛకు సమాధి

ఏ విలువలను చూసి అమెరికాకు ఆ ప్రతిమను బహూకరించామో, ఇప్పుడు అవి అక్కడ లేవు, ఇక అది కూడా అక్కడ ఉండకూడదు, మా విగ్రహాన్ని మాకు ఇచ్చేయండి అంటూ పక్షంరోజుల క్రితం ఫ్రాన్స్‌ నాయకుడు ఒకరు అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ మీద ఓ పదునైన వ్యాఖ్య చేశారు. విదేశీ విద్యార్థుల గెంటివేత విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ సందర్భంలో, న్యూయార్క్‌ నగరంలో ఆకాశాన్ని తాకుతూ కనిపించే ఆ స్వేచ్ఛా ప్రతిమ ట్రంప్‌ ఏలుబడిలో అక్కడ ఉండటం నిజంగానే సరికాదనిపిస్తోంది. అమెరికా అంటే స్వేచ్ఛ, హక్కులకు పెద్ద దిక్కు అనే నమ్మకం ఇప్పుడు క్రమంగా నశిస్తున్నది. వందలాదిమంది విదేశీ విద్యార్థులమీద ట్రంప్‌ ఇంత కక్షకట్టడానికి వారు చేసిన తప్పల్లా ఏడాదిన్నరకు పైగా సాగుతున్న ఒక భయానకమైన యుద్ధాన్ని ఆపమనడం, మారణకాండను నిరసించడం. నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నందుకు వీరంతా ట్రంప్‌ దృష్టిలో దేశద్రోహులైనారు. భావస్వే‍చ్ఛకు పుట్టినిల్లని అంటున్నచోట ఏకంగా ఉగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రపడ్డారు.


తమ రాజ్యంగం హక్కుల గురించి ఏమంటున్నదో ట్రంప్‌కు అనవసరం. భావస్వేచ్ఛను భంగపరచే చర్యలనూ, చట్టాలనూ అది సహించదన్నదీ ఆయనకు పట్టదు. తొలి విడత పాలనలోనే ఆయన తన నిజస్వరూపాన్ని చూపించాడు. అధికారం దక్కనందుకు ఏకంగా చట్టసభలమీదకే కార్యకర్తలను ఉసిగొల్పాడు. మలివిడతలో మరింత బలంగా అధికారంలోకి రావడంతో ఏకంగా విశ్వరూపాన్నే ప్రదర్శిస్తున్నాడు. వందలాదిమంది విదేశీ విద్యార్థులను వేకువనే తట్టిలేపి, తట్టాబుట్టా సర్దుకొని దేశం విడిచిపెట్టిపోవాలంటున్నాడు. ఈ విద్యార్థులు ట్రంప్‌ అభిమానుల మాదిరిగా విధ్వంసాలు ఎరిగినవారు కాదు. రోడ్లమీదకు వచ్చి దొరికినవాటిని తగలబెట్టిందీ లేదు. మిగతా ప్రపంచం గురించీ, సమాజం గురించీ, మనుషులూ మనుగడ పోరాటాల గురించీ ఎక్కడైతే నేర్చుకుంటున్నారో, అక్కడే వాటి పరిరక్షణకోసం వారు నినదించారు. గాజా ఘోరకలిని ప్రశ్నించడం, ఆకలిదప్పికలతో అల్లాడుతున్న లక్షలాది మందిని రక్షించమంటూ ఎత్తైన ఆ విశ్వవిద్యాలయాల గోడలలోపల ఘోషించడం తిరుగుబాటు ఎలా అవుతుందో తెలియదు. మానవహక్కుల గురించి మాట్లాడటమే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంగా, విద్యార్థుల నిరసనలను హమాస్‌ అనుకూల, యూదు వ్యతిరేకత చర్యలుగా నిర్వచించి, శిక్షించడంలో ట్రంప్‌ వ్యూహం సుస్పష్టం.


యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలం సాగిన ఈ ఉద్యమాలు, అంతవరకూ నిర్లజ్జగా ఇజ్రాయెల్‌ కొమ్ముకాస్తున్న అమెరికా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేసి, కాస్తంత తగ్గేట్టు చేశాయి. మరింత శక్తిమంతమైన ఆయుధాలను సమకూరుస్తూ మారణకాండకు సహకరిస్తున్న అమెరికా పాలకులు ఈ ఉద్యమం కారణంగా ఇజ్రాయెల్‌ను నాలుగు మాటలు అనవలసి వచ్చింది, మానవతాసాయం గురించి మాట్లాడవలసి వచ్చింది. యూనివర్సిటీలు సైతం తమ నడవడికను, గతకాలపు విలువలను తడిమిచూసుకోవలసి వచ్చింది. యుద్ధాలు ఆపిన చరిత్ర విద్యార్థులకు ఉన్నదనీ, వియత్నాంలో తమ ప్రభువులను కాలువెనక్కుతీసుకొనేట్టు చేసిన ఘనులు వారని ట్రంప్‌కు తెలుసు. కాల్పుల విరమణను నీరుగార్చి, గాజాను ఖాళీచేయించే క్రమంలో నెతన్యాహూతో కలసి తిరిగి మారణకాండను అమలుచేస్తున్న ట్రంప్‌కు స్వదేశంలో ఒక్క అసమ్మతిస్వరం ఉన్నా మళ్ళీ నిప్పురాజుకొనే ప్రమాదం ఉన్నదని తెలుసు.


ఒక హంతకుడినో, ఉగ్రవాదినో వెతుకుతున్న, వేటాడుతున్న భాష ఈ విదేశీవిద్యార్థుల విషయంలో వాడుతున్నారు. కృత్రిమమేధతో సామాజిక మాధ్యమాలను జల్లెడపట్టి, కలుగులో దాక్కున్నవారిని వెతికిపట్టి మరీ దేశంనుంచి గెంటేస్తారట. విద్యార్థులకు వివరణలు ఇచ్చుకొనే అవకాశం లేదు, సమాధానం చెప్పుకొనే చోటూ లేదు. కేవలం ఓ ఆరోపణ, ఒకే ఒక్క ఈమెయిల్‌ సందేశంతో దేశ బహిష్కరణ జరిగిపోతోంది. ఉదారవాదాలు, ఉన్నతాశయాలు వెనక్కుపోయిన అగ్రరాజ్య దురహంకారమిది. వీసాలు రద్దయినంతమాత్రాన విద్యార్థులు వెనక్కుపోనవసరం లేదని, యూనివర్సిటీల దయాదాక్షిణ్యాలున్నంతవరకూ ఉండవచ్చునని కొందరు భరోసా ఇస్తున్నారు. కానీ, అమెరికా తన ఆదర్శాలను అటకెక్కించేస్తూ, విలువలకు, విజ్ఞానానికీ నెలవుగా ఉండాల్సిన విద్యాలయాలు మిలటరీ క్యాంపులుగా మారుతున్నప్పుడు ఉండికూడా ప్రయోజనమేమిటన్నది ప్రశ్న.

ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:29 AM