మాటల గొప్పలు

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:35 AM

అమెరికా అధ్యక్షబాధ్యతలు రెండోసారి చేపట్టిన తరువాత, మొదటిసారి కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో డోనాల్డ్‌ట్రంప్‌ చేసిన ప్రసంగంలో...

మాటల గొప్పలు

అమెరికా అధ్యక్షబాధ్యతలు రెండోసారి చేపట్టిన తరువాత, మొదటిసారి కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో డోనాల్డ్‌ట్రంప్‌ చేసిన ప్రసంగంలో ఆత్మస్తుతి, పరనిందలతో పాటుగా, ప్రమాద హెచ్చరికలు కూడా ప్రబలంగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నరలోనూ తాను సృష్టించిన గందరగోళాన్నీ, చేపట్టిన విధ్వంసాన్ని మహా అద్భుతాలుగా, చారిత్రాత్మక పరిణామాలుగా అభివర్ణించుకోవడం అటుంచితే, ముందుముందు మరింత వినాశనం ఉన్నదని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. గత ఎనిమిదేళ్ళ కంటే ఈ ఆరువారాల్లోనే అధిక విజయాలు, అద్భుతాలు జరిగాయని ఆయన భుజాలు చరుచుకున్నారు. అమెరికా ఇక హాయినపడవచ్చునని చెప్పుకున్నారు. పాడుకాలం పోయి గతకాలపు ఘనమైన రోజులు తిరిగొచ్చాయని అంటూనే, అమెరికాను మళ్ళీ అగ్రస్థానాన నిలబెట్టే క్రమంలో ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరిక కూడా చేశారు. తన దేశాన్ని యావత్‌ ప్రపంచం దోచుకుంటూంటే, రక్షకుడిగా తాను అవతరించానన్నది ఆ ప్రసంగం అంతరార్థం.


ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ నాయకుడి ప్రసంగంలా కాక, ఓ చక్రవర్తిలాగా ఆయన మాట్లాడాడు. దూకుడు వ్యాఖ్యలు, అర్థసత్యాలు, అపహాస్యాలు గుదిగుచ్చిన ప్రసంగం అది. డెమోక్రాట్లు అడ్డుతగులుతారని అనుకున్నదే కానీ, అదేమీ గట్టిగా జరగలేదు. నువ్వేమీ రాజువు కావు అంటూ కొందరు ఆక్షేపించారు, చిన్నచిన్న నిట్టూర్పులతో తమ అసమ్మతిని తెలియచేశారు. కాస్తంత గట్టిగా నిరసన తెలియచేసిన టెక్సాస్‌ డెమోక్రాట్‌ అల్‌ గ్రీన్‌ను సభనుంచి గెంటేయడంతో ఆయన ఇప్పుడు అధ్యక్షుడిని అభిశంసించే ఆలోచనలో ఉన్నాడు. రెండుసార్లు అభిశంసనకు గురై, ముప్పైనాలుగు అపరాధాలు రుజువైన ట్రంప్‌కు అదేమీ కొత్తకాదు కూడా. ఈ ప్రయత్నం గనుక తప్పిజారి పట్టాలెక్కితే, మలివిడతలో కూడా ఒక సుదీర్ఘమైన అభిశంసన ప్రక్రియను అమెరికాతో పాటు మిగతా ప్రపంచమూ భరించాల్సివస్తుంది.


అమెరికా అధ్యక్షుడు ఆరువారాల్లోనే తనకు శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తేల్చేశారు. ఆప్తమిత్రదేశాలను అదిలించి, అవమానించి దూరం నెట్టేశారు. అధికారులంతా దోపిడీదారులనీ, బద్ధకస్తులనీ, జనం సొమ్మును రాళ్ళపాల్జేశారనీ ఆరోపిస్తూ వారిని వెంటాడుతున్నారు, ఇంటికి పంపేస్తున్నారు. గత పాలకుల చేతకానితనం, బాధ్యతారాహిత్యం కారణంగా దేశం అప్పుల ఊబిలోకి జారిపోయిందనీ, మిగతా ప్రపంచం దోచుకుందనీ, తాను ఉద్ధరిస్తానన్న కథనాలకు అనుగుణంగానే ఆయన చర్యలన్నీ ఉన్నాయి. మిగతా దేశాలకు ఇచ్చేది ఆపేయడం, సాధ్యమైనంత దోచేయడం లక్ష్యంగా దాడి సాగుతోంది. మిత్రుడు, శత్రువు తేడాలేకుండా సుంకాలతో బాదేయడం, నమ్ముకున్నవారిని నట్టేటముంచేయడం, సుంకాలతో మొత్తి, ప్రాంతాలను లాక్కోవడం ఒక కొత్తవిలువగా కొనసాగుతోంది. ఆయన ప్రసంగంలో ప్రతిఫలించింది ఇదే.


ఆయన మస్క్‌ను మెచ్చుకున్నారు, మెలానియాను ప్రశంసించారు. స్వల్పకాలంలోనే వంద ఎగ్జిక్యుటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశానని, వందలాది చర్యలు తీసుకున్నానని చెప్పుకున్నారు. నినాదాలు చేసినా, నిరసనలు వెలిబుచ్చినా యూనివర్సిటీలనుంచి వెళ్ళగొడతానని హెచ్చరించిన ఈయనే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్ళీ తిరిగొచ్చిందని గొప్పలకు పోయారు. ఇక ఏప్రిల్‌ ఫూల్‌ మీమ్స్‌ బారిన పడలేనంటూ ఆ మర్నాటినుంచి అమలు చేయబోతున్న ప్రతీకార సుంకాలతో ఈ వికార యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లేదని అర్థం. భారతదేశం సహా అన్ని దేశాలనూ ఆయన తన ప్రసంగంలో ఆడిపోసుకున్నారు. ఎవరు ఎంతగా తమను దోచేస్తున్నదీ, దాచేస్తున్నదీ చెప్పుకొచ్చారు. తన సుంకాల యుద్ధంతో దేశం మరింత సుసంపన్నమై, గొప్పదేశంగా అవతరిస్తుందని భరోసా ఇచ్చారు. మిగతా దేశాల సంగతి అటుంచితే, నలభైశాతానికి పైగా ఎగుమతులు దిగుమతులు జరిగే మెగ్జికో, కెనడా, చైనాతో ఈ యుద్ధం ఇదేరీతిలో కొనసాగితే ఆదాయాలు పడిపోయి, అమెరికా మధ్యతరగతికి పెద్ద దెబ్బ తగులుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ అధ్యక్షుడి హయాంలో అమెరికా పరువుదిగజారిపోతోందని గట్టిగా చెప్పగలిగే బలం డెమెక్రాట్లకు కూడా లేదు. ఉభయసభల్లోనూ ఆయనే బలవంతుడు కనుక వ్యతిరేకించే వాతావరణం లేదు. పెరిగిన జీవన వ్యయం ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేవరకూ ట్రంప్‌ ఓటు బ్యాంకు తిరగబడే పరిస్థితీ ఉండదు. కానీ, స్టాక్‌ మార్కెట్లు ఎప్పటికప్పుడు ట్రంప్‌ చర్యలను గమనిస్తూ, తుళ్లిపడుతూనే ఉన్నాయి. కనీసం పాతికేళ్ళుగా మనకు తెలిసిన, మనతో వ్యవహారాలు నడిపిన అమెరికా ఇది కాదన్నది వాస్తవం.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 06 , 2025 | 05:35 AM