సోషల్ జస్టిస్ క్రెడిట్.. కాంగ్రెస్‌దే!
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:38 AM
పార్టీ జాతీయ విధానంలో భాగంగా తెలంగాణలో కులగణన జరిపిన కాంగ్రెస్ పార్టీ బీసీలు 56.36శాతం ఉన్నట్టు లెక్క తేల్చింది. దానికి అనుగుణంగా వారికి విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు...

పార్టీ జాతీయ విధానంలో భాగంగా తెలంగాణలో కులగణన జరిపిన కాంగ్రెస్ పార్టీ బీసీలు 56.36శాతం ఉన్నట్టు లెక్క తేల్చింది. దానికి అనుగుణంగా వారికి విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎక్కడా తప్పటడుగులు వేయకుండా పకడ్బందీగా కులగణనకు పూనుకుంది. బీసీల కులగణన అన్ని రకాల పరిశీలనల్లో, న్యాయపరమైన అంశాల్లో నిలబడేలా డెడికేటెడ్ కమిషన్, డాక్యుమెంటేషన్ ద్వారా బిల్లులను ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్ల పట్ల తన నిబద్ధతను చాటుకుంది. అలాగే భవిష్యత్తులో న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకావద్దనే ఉద్దేశంతో వన్ మాన్ కమిషన్ ఏర్పాటు చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందంటూ కొందరు చేస్తున్న వాదన హాస్యాస్పదం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. వర్గీకరణపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు వర్గీకరణ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
వర్గీకరణలో భాగంగా ఎస్సీల్లోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్–1లోని 15 ఉపకులాలకు ఒక శాతం, గ్రూప్–2లోని 18 ఉపకులాలకు 9శాతం, గ్రూప్–3లోని 26 ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఇక్కడే కొందరు రాజకీయం చేస్తున్నారు. మాలలకు 5శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించసాగారు. అయితే, గ్రూప్–3లో ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు కేవలం మాలలకు మాత్రమే కాదని అందులోని 26 కులాలకు కలిపి 5శాతం రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా విస్మరించి ప్రజల్ని ఏమారుస్తున్నారు. ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి ఢిల్లీకి పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రధాని మోదీతో చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించి, ఆయన అపాయింట్‌మెంట్ కోరింది. కులగణన మొదలుకొని అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం వరకు, జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నియామకం నుంచి ఎస్సీ వర్గీకరణ వరకు కాంగ్రెస్ పార్టీ చూపిన చిత్తశుద్ధిని ఆయా వర్గాల ప్రజలు ఎన్నటికీ మరవబోరని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా అల్టిమేట్ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే అని ప్రతిపక్షాలు గుర్తెరగాలి.
సత్తు మల్లేష్,
కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్
Also Read:
కలెక్టరేట్‌కు అగంతకుడు మెయిల్.. చివరికి..
వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా..
45 ఏళ్ల క్రితం మరీ ఇంత దారుణమా..
For More Telangana News and Telugu News..